మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల ఓటు డెమొక్రాట్లకేనా..?
ట్రంప్ సర్కార్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇస్తున్న వరుస షాకులతో భారతీయ అమెరికన్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసా జారీపై కఠిన ఆంక్షలు విధిస్తుండడం.. దానికి తోడు విద్యార్థి వీసాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో అమెరికాలో చదువు, ఉద్యోగం కష్టసాధ్యంగా మారింది. ఇక కంపెనీల యాజమాన్యాలపైనే ట్రంప్ సర్కార్ గురిపెట్టింది. వీసా అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఇటీవలే టెక్ దిగ్గజాలపై తీవ్ర ఆరోపణలు చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్. తర్వాత భారత ప్రభుత్వం నుంచి విమర్శలు రావడంతో.. వెనక్కు తగ్గారు.
బర్త్ టూరిజం.. విద్యావకాశాలు.. ఇలా అన్నింటా తమకు దారులు మూసుకుపోతుండడంతో.. భారతీయులు,చైనా సహా వివిధ దేశాల నుంచి వచ్చిన, వస్తున్న విదేశీయులు… ఇప్పుడు ట్రంప్ సర్కార్ కు వ్యతిరేకంగా మారారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వేల ప్రకారం, భారతీయ సంతతి అమెరికన్లలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది.
ట్రంప్‌పై భారతీయ అమెరికన్ల అభిప్రాయం ఎలా ఉంది?
కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ 2026లో నిర్వహించిన సర్వేలో ట్రంప్ అధ్యక్ష పనితీరును సుమారు 71% భారతీయ సంతతి అమెరికన్లు వ్యతిరేకించారు. అదే సమయంలో, డెమొక్రటిక్ పార్టీ పట్ల వారి అనుబంధం కూడా గతంతో పోలిస్తే తగ్గిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా పెరిగిన జీవన వ్యయం.. నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణం.. కుటుంబ జీవనాన్ని ఇబ్బందికరంగా మార్చింది.
ప్రస్తుత సర్వేలను బట్టి చూస్తే, భారతీయ సంతతి ఓటర్లలో డెమొక్రాట్లకు మద్దతు ఎక్కువగా నమోదైంది. కానీ 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు పెరిగిన నేపథ్యంలో, రిపబ్లికన్లకు కూడా ఒక వర్గం మద్దతు ఇస్తోంది.








