గెలవాలి.. గెలిచి తీరాలి.. అమెరికా మిడ్ టర్మ్ పోల్ పై ట్రంప్ గురి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం కీలక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం.. రష్యా-ఉక్రెయిన్ వార్.. పెరిగిన చమురు ధరలు.. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం.. పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోతున్న అమెరికా.. ఇలా ఒకటేమిటి, ఎటు చూసినా సమస్యల పర్వమే. ఇలాంటి తరుణంలో అమెరికా మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడీ ఎన్నికలను .. రాజకీయ పరిశీలకులు.. ట్రంప్ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న కోణంలో చూస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు ట్రంప్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.
2026 నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) జరగనున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఎన్నికలు కీలకం. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తే ఆయనకు కాంగ్రెస్‌లో తన విధానాలను ముందుకు తీసుకెళ్లడం సులభమవుతుంది.చ్చు. డెమోక్రాట్లు ఆధిక్యం సాధిస్తే ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, పర్యవేక్షణ, రాజకీయ ప్రతిఘటన పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో తానే బరిలో దిగినట్లుగా ట్రంప్ కాలికి బలపం కట్టుకుని సభల్లో పాల్గొంటున్నారు.
ట్రంప్ అక్టోబర్‌లో టెక్సాస్, ఓక్లహోమా సహా పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఓటర్లు ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా భావించి తమ పార్టీకి ఓటు వేయాలని కూడా పిలుపునిస్తున్నారు. కీలక సెనేట్, ప్రతినిధుల సభ స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడం దీని ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఆర్థిక విజయాలను ప్రచారం చేయడంపై ఫోకస్…
పన్ను తగ్గింపులు, ఉద్యోగాలు, అమెరికా పరిశ్రమలకు ప్రోత్సాహం వంటి అంశాలను తన ప్రభుత్వ విజయాలుగా ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. అయితే నిత్యావసరాల ధరలు, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ ప్రచారానికి సవాలుగా మారింది.
వలసలు, సరిహద్దుల భద్రతపై దృష్టి
అక్రమ వలసల నియంత్రణ, సరిహద్దుల భద్రతను రిపబ్లికన్ల ప్రధాన ప్రచార అంశాలుగా ముందుకు తెస్తున్నారు. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే ఈ విధానాలు మారవచ్చని రిపబ్లికన్ నేతలు ఓటర్లను హెచ్చరిస్తున్నారు. మరోవైపు, వలసలపై కఠిన చర్యల ప్రభావం కూడా ఎన్నికల చర్చలో ఉంది.
రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ తనకు అనుకూలమైన అభ్యర్థులను బహిరంగంగా సమర్థిస్తున్నారు. తన మద్దతుతో వారు పార్టీ నామినేషన్ పొందడానికి, తన మద్దతుదారుల ఓట్లు సంపాదించడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే కొన్ని కీలక స్థానాల్లో ఆయన ఎంపికలపై పార్టీ నేతల్లోనే విభేదాలు ఉన్నాయి.
ట్రంప్‌కు అనుకూలమైన MAGA Inc. రాజకీయ సంస్థ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాల కోసం భారీ మొత్తాలను వినియోగిస్తోంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన ద్వారా రిపబ్లికన్లకు ప్రయోజనం కల్పించే ప్రయత్నాలు జరిగాయి. ఈ పునర్విభజనపై రాజకీయ, న్యాయపరమైన వివాదాలు కూడా ఉన్నాయి.
అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్‌కు సుమారు $4.27కు చేరింది. జీవన వ్యయం పెరగడంపై ఓటర్ల అసంతృప్తి ట్రంప్ ప్రచారానికి సవాలుగా ఉంది. రాయిటర్స్/ఇప్సోస్ సర్వేలో అక్టోబర్‌లో ట్రంప్ పనితీరుకు ఆమోదం సుమారు 31%గా నమోదైంది. ఇది ఆ సర్వేలో ఆయన రెండో పదవీకాలంలో నమోదైన అత్యల్ప స్థాయి.
ఈ ఎన్నికలు ఎందుకు కీలకం?
నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో సుమారు మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం రిపబ్లికన్లకు ఉన్న స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్ ప్రధాన లక్ష్యం.డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో ఏ సభనైనా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే, ట్రంప్ ప్రభుత్వంపై విచారణలు చేపట్టడం, చట్టాలపై చర్చలను ప్రభావితం చేయడం, ఆయన విధానాలను అడ్డుకోవడం వంటి అధికారాలు వారికి పెరుగుతాయి.








