శ్రీనిధి నృత్యాలయం వారిచే అన్నమయ్య సంకీర్తనలకు నృత్యాంజలి
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో అక్టోబర్ 24న అన్నమయ్యపురంలో నిర్వహించిన వారాంతపు అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీనిధి నృత్యాలయం గురువు శ్రీమతి కాపూడి వసుధ గారి మార్గదర్శకత్వంలో వారి శిష్య బృందం విష్ణు శ్రీ, హిమర్షిత, కృతిక, అభిజ్ఞ, సంతాన, సన్విత, సహిత, సహస్ర, హర్షిత, వర్షిక, నిహస్వి, ప్రత్యూష, వర్ష, శరణి, నక్షత్ర, వజ్రనందన, ఆర్. మనస్వి, సాయి సాన్వి, నవనీత, నాగశ్రేష్ఠ, వర్ష, వైష్ణవి, మనస్విని, నిహాన్షి, అద్విక, లిఖిత, ఉషస్విని, నేహశ్రీత, రుచిత, సుధ, రజిని, లక్ష్మీ ప్రసన్న సంయుక్తంగా “మూషిక వాహన”, “ముద్దుగారే యశోద”, “జతిస్వరం”, “అదివో అల్లదివో”, “కొలువై ఉన్నాడు”, “మహా గణపతిం”, “భావములోన”, “కొండలలో నెలకొన్న”, “దశావతార శబ్దం”, “రామాయణ శబ్దం” తదితర గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు. లయ, భావం, అభినయాల సమన్వయంతో స్వామివారికి నృత్య కైంకర్యం నివేదించారు.
సాయంత్రం 7 గంటలకు డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో సంకీర్తనలతో కార్యక్రమం కొనసాగి, 7:30 గంటలకు హారతి, ప్రసాద వితరణతో ముగిసింది.
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి మార్గదర్శకత్వంలో సుమారు ఆరు నెలల పాటు పది సంకీర్తనలు నేర్చుకునే అవకాశం కల్పించే “సంకీర్తన యోగా” అనే సంగీత శిబిరం ఈ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. మరిన్ని వివరాల కోసం అన్నమయ్యపురాన్ని ఒక్కసారి సందర్శించి సంప్రదించగలరు.
అన్నమయ్య సంకీర్తనలను సంగీతం, నృత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని రానున్న కార్యక్రమాల్లో భక్తులు, సంగీతాభిమానులు పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.








