అన్నమయ్య సంకీర్తనలతో నాదబ్రహ్మోత్సవం–26 ఘన ముగింపు – భక్తిరసాన్ని పంచిన గాయత్రి నారాయణన్
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన నాదబ్రహ్మోత్సవం–26 ముగింపు రోజు కార్యక్రమం భక్తి సంగీత వైభవంతో అలరించింది. ప్రముఖ గాయని, ‘గోదావరి’ చిత్రంలోని “రామచక్కని సీతకి” పాటతో ప్రసిద్ధి పొందిన శ్రీమతి గాయత్రి నారాయణన్ తన మధుర గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం గాయత్రి నారాయణన్ గారు “రామచక్కని సీతకి” పాటతో పాటు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి భక్తులను అలరించారు. ముఖ్యంగా “అదివో అల్లదివో”, “కొండలలో నెలకొన్న”, “బ్రహ్మమొక్కటే” వంటి అన్నమాచార్య సంకీర్తనలు భక్తిభావాన్ని చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రజాసంబంధాల అధికారి, రచయిత శ్రీ జ్వాలా నరసింహారావు గారు, పాత్రికేయులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్, రచయిత శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు విచ్చేశారు. వారు అన్నమాచార్య భావనా వాహిని నిర్వహిస్తున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను అభినందిస్తూ, అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పది రోజుల పాటు దసరా ఉత్సవాల్లో అన్నమయ్య సంకీర్తనల ద్వారా భక్తిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం నాదబ్రహ్మోత్సవం ప్రత్యేకతగా నిలిచింది. అనేకమంది గాయనీగాయకులకు, యువ కళాకారులకు వేదిక కల్పిస్తూ అన్నమయ్య సాహిత్యాన్ని భావితరాలకు చేరవేస్తున్న పద్మశ్రీ డా. శోభారాజు గారి మార్గదర్శకత్వం ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అన్నమాచార్య భావనా వాహిని మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు సహా సంస్థ నిర్వాహకులు అతిథులను, కళాకారులను సత్కరించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే సంకల్పంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ, అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో నిర్వహించిన నాదబ్రహ్మోత్సవం–26 విజయవంతంగా ముగిసింది.








