నాదబ్రహ్మోత్సవం–26లో తొమ్మిదవ రోజు – శ్రీనిధి స్వరార్చన
అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో శోభారాజు గారి సేవలు చిరస్మరణీయం.
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నాదబ్రహ్మోత్సవం–26 తొమ్మిదో రోజు కార్యక్రమం భక్తి సంగీత వైభవంతో అలరించింది. ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి శ్రీనిధి తిరుమల అన్నమాచార్య సంకీర్తనలను మధురంగా ఆలపించి ప్రేక్షకులను భక్తిరసంలో ముంచెత్తారు.
సాయంత్రం 4:30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీనిధి తిరుమల గారు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహించిన ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆలపించిన కీర్తనలతో పాటు, పద్మశ్రీ డా. శోభారాజు గారు స్వరకల్పన చేసిన అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.
ఈ సందర్భంగా “ఆమెతో ఏమి”, “జగదానంద కారక”, “బ్రహ్మ కడిగిన పాదము”, “బ్రహ్మమొక్కటే”, “అదివో అల్లదివో” తదితర సంకీర్తనలను ఆలపించి శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ స్వరార్చనకు రాజేశ్వరరావు కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు.
అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో శోభారాజు గారి కృషి ప్రశంసనీయం అని ముఖ్య అతిథులుగా విచ్చేసిన పద్మభూషణ్ డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డి గారు, తెలుగు టైమ్స్ సంపాదకులు శ్రీ చెన్నూరు సుబ్బారావు గారు అన్నమాచార్య భావనా వాహిని చేస్తున్న సేవలను కొనియాడారు.
డా. వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, పది రోజుల పాటు అన్నమయ్య సంకీర్తనలతో స్వామివారిని వివిధ రూపాల్లో ఆరాధించే ఇలాంటి విశిష్ట కార్యక్రమం అన్నమయ్యపురంలో నిర్వహించడం డా. శోభారాజు గారి అంకితభావం వల్లనే సాధ్యమవుతోందని అన్నారు. అన్నమయ్య సంకీర్తనలను విస్తృతంగా ప్రచారం చేస్తూ, అనేకమంది యువ కళాకారులకు వేదిక కల్పించి వారిని ప్రోత్సహిస్తున్న శోభారాజు గారికి, అన్నమాచార్య భావనా వాహినికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంస్థతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
శ్రీ చెన్నూరు సుబ్బారావు గారు మాట్లాడుతూ, ఆర్థిక లాభనష్టాలను, వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా అన్నమయ్య సంకీర్తనల ప్రచారమే జీవిత లక్ష్యంగా చేసుకుని డా. శోభారాజు గారు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తన సొంత వనరులను వెచ్చిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అన్నమయ్య సంకీర్తనల సేవను కొనసాగిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని నిజంగా ఆదర్శప్రాయమైన సంస్థ అని పేర్కొన్నారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారమే కొనసాగిస్తానని స్వామివారికి ఇచ్చిన మాటను దశాబ్దాలు గడిచినా నిలబెట్టుకుంటూ శోభారాజు గారు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.
అన్నమయ్య సంకీర్తనల ద్వారా భక్తిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, యువ కళాకారుల ప్రతిభను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందించడమే అన్నమాచార్య భావనా వాహిని ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తి సంగీతం, అన్నమయ్య సంకీర్తనల మాధుర్యంతో నాదబ్రహ్మోత్సవం తొమ్మిదో రోజు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.









