వేద సంప్రదాయాల పరిరక్షణలో విశ్వ వేద పారాయణ బృందం
హ్యూస్టన్ లో ఘనంగా వివిపిబి 8వ వార్షికోత్సవం
– హేమనళిని తల్లావఝుల
విశ్వ వేద పారాయణ బృందం (వివిపిబి) 8వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 19, 2026న హ్యూస్టన్ లోని శ్రీంగేరి విద్యాభారతి ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించింది. దాదాపు 600 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం వేద పారాయణం, సంగీతం, సామూహిక భాగస్వామ్యం, సేవాభావాల సమ్మేళనంగా ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ప్రత్యేకంగా నిలిచింది. గురువందనంతో కార్యక్రమం ప్రారంభమై, స్వాగతం, పరిచయం అనంతరం స్వరభారతి బృందం సంగీత సేవను సమర్పించింది. అనంతరం పాల్గొన్నవారంతా విష్ణు సహస్రనామ పారాయణంలో భాగస్వాములయ్యారు. VVPదీ వ్యవస్థాపకులు డా. రఘు శర్మ చుండూరు గారు సంస్థ ఆవిర్భావం, లక్ష్యాలు, దార్శనికతతో పాటు ఇప్పటివరకు చేపట్టిన సేవా కార్యక్రమాలు, వాటి ద్వారా సమకూరిన నిధుల వినియోగాన్ని వివరించారు.
కార్యక్రమంలో దాతలను సత్కరించడంతో పాటు డా. దాసిక నరసింహం గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సనాతన ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, మన ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సందేశమిచ్చారు. అనంతరం రెండో విడత విష్ణు సహస్రనామ పారాయణం, 60 మందికి పైగా చిన్నారుల ఉత్సాహభరితమైన హనుమాన్ చాలీసా పారాయణం, సామూహిక లక్ష్మీ అష్టకం, హారతి, ఆంజనేయ భజన, ఆశీర్వచనం జరిగాయి. వందలాది మంది భక్తిశ్రద్ధలతో పాల్గొనడంతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. తీర్థప్రసాద వితరణతో కార్యక్రమం ఆనందభరితంగా సంపూర్ణమైంది.
వేద విద్యకు వివిపిబి సమగ్ర సహకారం వివిపిబి సేవలు వార్షిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా విస్తృతంగా వివిధ రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సంస్థ 14 వేద పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ లోని కొవ్వూరులో ఒక గిరిజన బాలికల పాఠశాల, తెలంగాణలోని వికారాబాద్ లో ఒక అనాథాశ్రమానికి వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తోంది. వేద పాఠశాలలకు ఉపాధ్యాయుల సహాయం, విద్యా వనరులు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, పోషకాహారంతో పాటు విద్యార్థుల్లో సంభాషణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు కూడా తోడ్పడుతోంది.
ఇప్పటివరకు 50 లక్షలకు పైగా భోజనాలను వేద విద్యార్థులు, పండితులకు అందించడంతో పాటు, 58,000కు పైగా వేద విద్యార్థి సంరక్షణకు మద్దతు అందించింది. గిరిజన బాలికల పాఠశాల, అనాథాశ్రమంలోని పిల్లలకు విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతోంది.
కుటుంబాలను వేద సంప్రదాయాలతో అనుసంధానం
విష్ణు సహస్రనామ యజ్ఞం, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాల ద్వారా కుటుంబాలు వేద పారాయణం, ఆచారాలు, సంప్రదాయాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యే అవకాశాన్ని వివిపిబి కల్పిస్తోంది. తద్వారా తరతరాలుగా వస్తున్న వేద సంప్రదాయాలు నిత్యజీవితంలో భాగంగా నిలిచేందుకు వేదికను అందిస్తోంది.
యువత భాగస్వామ్యం — సేవకు మరో అడుగు
VVPదీ యూత్ వింగ్ ద్వారా యువతను సంస్కృతి, సేవ, మార్గదర్శకత్వంతో అనుసంధానిస్తోంది. యÖత్ ద్యాడ్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలోని యువతను వివిపిబి భాగస్వామ్య సంస్థల విద్యార్థులతో కలుపుతూ పరస్పర అభ్యాసం, సాంస్కృతిక మార్పిడికి అవకాశం కల్పిస్తోంది. క్లాత్స్ డ్రైవ్ ద్వారా అవసరమైన వారికి వస్త్రాలను అందించడం, సుచిబాల ద్వారా బాలికలు, మహిళల్లో రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో యువతను ప్రత్యక్షంగా సమాజ సేవలో భాగస్వాములను చేస్తోంది.

పరిరక్షణ నుంచి సేవ వరకు
వేద విద్య, పారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు, యువత భాగస్వామ్యం, సమాజ సేవ—ఇలా విభిన్న రంగాలను ఒకే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ వివిపిబి తన సేవా పరిధిని నిరంతరం విస్తరిస్తోంది. సనాతన ధర్మాన్ని రక్షించడం, విస్తృతంగా వ్యాప్తి చేయడం వంటి లక్ష్యంతో వేద సంప్రదాయాల పరిరక్షణను ఆచరణాత్మక సేవతో మేళవిస్తూ, సనాతన ధర్మ విలువలను సమాజంలో మరింత బలంగా నిలబెట్టి భావితరాలకు సజీవ వారసత్వంగా అందించే దిశగా వివిపిబి విశిష్టమైన సేవా ప్రస్థానాన్ని సాగిస్తోంది.
మరిన్ని వివరాలకు సందర్శించండి…
viswaveda.org








