నాదబ్రహ్మోత్సవం–26 లో నిహాల్ స్వరార్చన
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం–26లో భాగంగా అక్టోబర్ 15న జరిగిన సంగీత కార్యక్రమం భక్తిరసభరితంగా సాగింది. ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ నిహాల్ తన మధుర గానంతో అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, సాహిత్యవేత్త శ్రీ గౌరీ శంకర్ గారు, జె.వి. పబ్లికేషన్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, రచయిత్రి, వంటకళా నిపుణురాలు శ్రీమతి జ్యోతి వల్లభోజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
సాయంత్రం 4:30 గంటలకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం పారాయణాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం శ్రీ నిహాల్ గారు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహించిన ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆలపించిన, పద్మశ్రీ డా. శోభారాజు గారు స్వరకల్పన చేసిన “మొగదాకిరి వాడు” సంకీర్తనతో పాటు “కొండలలో నెలకొన్న, అదివో అల్లదివో, చాలదా హరినామము, సిరుత నవ్వులవాడే సిన్నెక్కా అనే తదితర అన్నమాచార్య సంకీర్తనలను భక్తిపూర్వకంగా ఆలపించారు.
ఈ స్వరార్చనకు రాజు కీబోర్డుపై, స్వరూప్ తబలాపై వాయిద్య సహకారం అందించారు. గానంలోని మాధుర్యం, శ్రుతి–లయ సమన్వయం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు శ్రీ గౌరీ శంకర్ గారు, శ్రీమతి జ్యోతి వల్లభోజు గారు మాట్లాడుతూ, అన్నమాచార్య భావనా వాహిని చేస్తున్న సేవలను కొనియాడారు. ఎంతోమంది కళాకారులకు వేదికలు కల్పిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ అన్నమయ్య సంకీర్తనలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న పద్మశ్రీ డా. శోభారాజు గారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
అన్నమయ్య సాహిత్యాన్ని భావితరాలకు అందించడంతో పాటు, మరెందరో గాయకులను తీర్చిదిద్దుతున్న సంస్థ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపకురాలు పద్మశ్రీ డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు ముఖ్య అతిథులను, గాయకుడు శ్రీ నిహాల్ను, వాయిద్య సహకారం అందించిన కళాకారులను శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళహారతి సమర్పించి, ప్రసాద నివేదనతో కార్యక్రమాన్ని ముగించారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా భక్తి, సంగీతం, ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అన్నమాచార్య భావనా వాహిని సంకల్పానికి నాదబ్రహ్మోత్సవం మరో విశిష్ట వేదికగా నిలిచింది.








