నాదబ్రహ్మోత్సవం–26లో మూడో రోజు “దివ్య” నృత్య వైభవం
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం–26 మూడో రోజు కార్యక్రమాలు భక్తి, నృత్య వైభవంతో అలరించాయి.
అక్టోబర్ 13న నిర్వహించిన ఈ కార్యక్రమంలో “దివ్య తేజస్విని” మరియు ఆమె బృందం నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమానికి కళాజ్ఞానం ప్రవచనకర్త, శ్రీ మాణిక్యేశ్వరి మాత శిష్యులు పూజ్యశ్రీ శ్రీరామ యోగి గారు, ఇన్సూరెన్స్ ఇన్ఫో బ్యూరో ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకట్ చెంగవల్లి గారు విశిష్ట అతిథులుగా విచ్చేశారు.
“శ్రీనివాస కళ్యాణం” ప్రత్యేకగా కూచిపూడి నృత్య ప్రదర్శన కమారి దివ్య తేజస్విని బృందం ప్రదర్శించిన నృత్యరూపకాల్లో శ్రీనివాసుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, పద్మావతి, నారదుడు, భృగు మహర్షి, ఆకాశరాజు, ధరణీదేవి, వకుళమాత, బ్రహ్మ, గరుడుడు, ఎరుకలసాని తదితర పాత్రలను కళాకారులు భావాభినయంతో ఆవిష్కరించారు. గురువు దివ్య తేజస్విని మార్గదర్శకత్వంలో శిష్యులు మధురి, వైష్ణవి, భారతి, హరి సుప్రియ, హారిక, ప్రియ, సాయి నిఖిత, సృజన తదితరులు వివిధ పాత్రల్లో మెప్పించారు.
సఖుల పాత్రల్లో వేద, అదితి, అక్షిత, అర్జిత, అభినయ శ్రావణి, నిఖిత, స్వాతి లయ, అంచల్ సింగ్, హితశ్రీ, గ్రీషశ్రీ, నిత్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు పద్మశ్రీ డా. శోభారాజు గారు అన్నమాచార్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
అన్నమయ్య సాహిత్యంలోని భక్తి, తాత్వికత, ఆధ్యాత్మిక సందేశాన్ని సంగీతం ద్వారా తరతరాలకు అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు.
కళాకారులకు వేదికలు కల్పిస్తూ, యువతలో భక్తి సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ, అన్నమాచార్యుల అమూల్యమైన సంకీర్తన సంపదను విశేషంగా ప్రచారం చేస్తున్న శోభారాజు గారి సంకల్పం ప్రశంసనీయమని కొనియాడారు.
అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని నృత్యరూపంలో ప్రజలకు చేరువ చేసిన దివ్య తేజస్విని బృందాన్ని అతిథులు అభినందించారు.
సంగీతం, నృత్యం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆధ్యాత్మిక విలువలను విస్తరింపజేయడం అభినందనీయమని తెలిపారు.
నాదబ్రహ్మోత్సవం–26లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 4:30 గంటలకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం పారాయణాలు నిర్వహిస్తున్నారు.
సాయంత్రం 6 గంటలకు సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతుండగా, రాత్రి 8:30 గంటల నుంచి హారతి, ప్రసాద వితరణ జరుగుతున్నాయి.
అన్నమాచార్యుల 32,000 సంకీర్తనల వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, దివ్య సంగీతం ద్వారా ఆలోచనా కాలుష్యాన్ని తొలగించి సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలనే అన్నమాచార్య భావనా వాహిని లక్ష్యానికి నాదబ్రహ్మోత్సవం–26 మరో విశిష్ట వేదికగా నిలుస్తోంది.








