సింగరేణి కార్మికులకు దసరా బోనస్..!
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగ వేళ కార్మికులకు బోనస్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా సింగరేణి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. చలో సింగరేణికి కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణిని నాశనం చేశారంటూ మంత్రులు విమర్శలు గుప్పించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య సింగరేణి రాజకీయ అస్త్రంగా మారింది.
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సింగరేణి సాధించిన లాభాల్లో 34 శాతాన్ని పర్మినెంట్ ఉద్యోగులకు వాటాగా అందిస్తున్నామన్నారు. దీనిద్వారా ఒక్కో రెగ్యులర్ కార్మికుడికి రూ.1.51 లక్షల దసరా బోనస్ లభించనుంది. అలాగే, సంస్థలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రూ.5,500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు ‘నెహ్రూ కాలనీల’ పేరుతో క్వార్టర్ల నిర్మాణం, ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, తాము అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.కోటి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు గుర్తుచేశారు.
అయితే, ఈ పరిణామాలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసిందని, అసలు దసరా బోనస్ ఇస్తారో లేదోనన్న సందిగ్ధంలో ఉంచి చివరి నిమిషంలో నామమాత్రపు ప్రకటనలు చేసిందని ఆరోపించింది. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ తీరును ఎండగట్టేందుకు ఉద్యమాలకు పిలుపునిచ్చింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులకు మరింత ఉన్నతమైన ప్రయోజనాలు అందేవని, కానీ నేడు ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ప్రతిపక్షం వాదిస్తోంది.
మరోవైపు, సింగరేణి లాభాలు తగ్గడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వపు నిర్ణయాలే కారణమని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. గడచిన ప్రభుత్వ హయాంలో కేంద్రం నిర్వహించిన 141 బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొనకుండా నిర్లక్ష్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రైవేట్ మార్కెట్లో బొగ్గు ధరలు తగ్గిన నేపథ్యంలో, సంస్థ మనుగడను కాపాడుకునేందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను సవరించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
మొత్తానికి.. దసరా బోనస్ ప్రకటన కార్మిక కుటుంబాల్లో ఆనందాన్ని నింపినప్పటికీ, దీని చుట్టూ అలుముకున్న రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. రాబోయే కాలంలో సింగరేణి కార్మిక సంఘాల మద్దతు కూడగట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నాయి. కార్మికుల సంక్షేమం పేరుతో సాగుతున్న ఈ రాజకీయ మైలేజ్ పోరు రానున్న రోజుల్లో ఏలుబడిని ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.








