ఏపీ స్థానిక పోరు.. హైకోర్టు మెట్లెక్కిన వైసీపీ..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body elections) షెడ్యూల్ విడుదలవుతోందన్న వార్తలతో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన అడుగు ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగవంతమైన తరుణంలో.. వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. స్థానిక పోరులో అధికార కూటమి పార్టీలను ఎదుర్కొనేందుకు భద్రతా పరమైన అంశాలను తెరపైకి తెస్తూ హైకోర్టులో వరుసగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్లలో వైసీపీ కోరిన డిమాండ్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.
ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ అంతటా రాష్ట్ర పోలీసుల జోక్యం లేకుండా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ హైకోర్టును విజ్ఞప్తి చేసింది. కూటమి ప్రభుత్వంలో స్థానిక పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. ఎన్నికల భద్రత కోసం కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాలని అభ్యర్థించింది. అధికార పార్టీల అంగబలం, బలప్రదర్శనల నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ప్రత్యేక రక్షణ మరియు భద్రత కల్పించాలని కోర్టును కోరింది.
ఇవి కూడా చదవండి
దీంతో పాటు ఎన్నికల పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా సీసీటీవీల నిఘాలోకి తీసుకురావాలని, 24 గంటల పాటు నిరంతరాయంగా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వైసీపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన తీరును విస్మరించి.. ఇప్పుడు విపక్షంలోకి రాగానే కేంద్ర బలగాలు, ప్రత్యేక నిఘా కావాలంటూ వైసీపీ చేస్తున్న ఈ వింత విజ్ఞప్తులపై కూటమి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే కోర్టుల చుట్టూ తిరగడం వైసీపీ ఓటమి భయాన్ని సూచిస్తోందని విమర్శిస్తున్నారు. హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్లపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.








