విశాఖ మేయర్ పీఠంపై భారీ పోటీ.. తెర పైకి బాలయ్య కూతురి పేరు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం (Visakhapatnam) మేయర్ పదవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధి, నగర ప్రాధాన్యం, భారీ బడ్జెట్ కారణంగా ఈ పదవిని దక్కించుకోవాలని రాజకీయ నాయకులు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా మేయర్ పదవికి మహిళా రిజర్వేషన్ ఖరారైనట్లు ప్రచారం జరగడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార కూటమితో పాటు వైఎస్సార్సీపీ కూడా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ముఖ్యంగా టీడీపీకి చెందిన ప్రముఖ కుటుంబాల మహిళల పేర్లు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది.
విశాఖ మేయర్ పదవి మరోసారి మహిళకు దక్కనుండటంతో మహిళా నాయకుల మధ్య పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2021లో జరిగిన మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బీసీ వర్గానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కూడా మహిళా అభ్యర్థికే అవకాశం ఉండటంతో పార్టీలు సామాజిక సమీకరణాలు, రాజకీయ బలాబలాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఈ క్రమంలో నందమూరి తేజస్విని (Nandamuri Tejaswini) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రెండో కుమార్తె. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ (M. Sri Bharat) సతీమణి కూడా. రాజకీయంగా ప్రభావం ఉన్న కుటుంబానికి చెందిన ఆమెను మేయర్ అభ్యర్థిగా నిలబెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. గతంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే మేయర్ పదవికి పోటీ చేసే విషయంలో ఆమె ఆసక్తి, పార్టీ నిర్ణయం ఏమిటన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఆమె పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు పరిమితమైంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ (Palla Srinivasa Rao) సతీమణి లావణ్య పేరు కూడా వినిపిస్తోంది. ఆమెకు అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ టీడీపీ అధ్యక్షుడు పట్టాభిరాం సతీమణి పేరును కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. జనసేన నుంచి పెద్దిశెట్టి ఉషశ్రీ, ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఉషా కిరణ్ పేర్లు చర్చలో ఉన్నాయి. బీజేపీ నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుటుంబానికి చెందిన మహిళ పోటీ చేస్తారా అన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సతీమణి బొత్స ఝాన్సీ పేరు వినిపిస్తున్నప్పటికీ, ఆమె పోటీపై స్పష్టత లేదు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పేరు కూడా ప్రచారంలో ఉంది. మాజీ ఎమ్మెల్యేల కుటుంబాల నుంచి కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేం.
మొత్తంగా విశాఖ మేయర్ పీఠం కోసం ప్రధాన పార్టీల్లో ఇప్పటి నుంచే కసరత్తు మొదలైనట్లు కనిపిస్తోంది. అయితే ప్రచారంలో ఉన్న పేర్లలో ఎవరికి పార్టీలు అవకాశం కల్పిస్తాయన్నది అధికారిక ప్రకటనల తర్వాతే తేలనుంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ పలుకుబడి, స్థానిక నాయకుల మద్దతు ఈ ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది.








