దేవీ భాగవతము కథ: విష్ణుమూర్తి చెవుల నుంచి పుట్టిన రాక్షసులు ‘మధుకైటభుల’ వృత్తాంతం
—-సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక యుగం ముగియబోయే సమయం ఆసన్నమైంది. సృష్టి అంతమయ్యే వేళ సంభవించిన మహాప్రళయం భూమిని పూర్తిగా ముంచెత్తింది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. పర్వతాలు లేవు. అడవులు లేవు. భూమి జాడే లేదు. ఆకాశం, సముద్రం కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. సర్వసృష్టి అంతా జలమయమైపోయింది.
ఆ అనంత జలరాశిపై ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు.
ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంది. సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. జీవరాశులేవీ కనిపించడం లేదు. కాలం సైతం స్తంభించిపోయినట్లుగా అనిపిస్తోంది.
అలాంటి సమయంలో శ్రీమహావిష్ణువు చెవుల నుంచి వెలువడిన మలినాల నుంచి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే మధుడు, కైటభుడు. విష్ణుమూర్తి శరీరం నుంచి జన్మించిన కారణంగా వారిద్దరూ అసాధారణమైన శక్తిసామర్థ్యాలను పొందారు. కొద్దికాలంలోనే వారి శరీరాలు పర్వతాలంత భారీగా పెరిగాయి. కండలు తిరిగిన దేహాలు, అపారమైన బలం వారిని భీకరమైన రాక్షసులుగా మార్చాయి.
ఆ అనంత సముద్రంలో నివసించే జలచరాలే వారికి ఆహారంగా మారాయి. సముద్రంలోని భయంకరమైన జీవులు సైతం వారి ముందు నిలవలేకపోయాయి. వారిద్దరూ ఈదుతూ, గంతులు వేస్తూ, ఆడుకుంటూ తిరిగినప్పుడల్లా సముద్రం అల్లకల్లోలంగా మారేది. వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సముద్రం తిరిగి నిశ్శబ్దంగా ఉండేది.
అలా కాలం గడిచింది. వారిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. తమకున్న బలాన్ని చూసి వారిలో క్రమంగా గర్వం పెరగసాగింది.
అసలు ఈ సృష్టికి మూలం ఏమిటి?
ఒకరోజు సముద్రంలో విహరిస్తున్న మధుడికి ఒక సందేహం కలిగింది. తమ్ముడైన కైటభుడిని పిలిచి ఇలా అడిగాడు. “తమ్ముడూ! అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఈ సముద్రంలో ఎలా జన్మించాం? మనకు తల్లిదండ్రులు ఎవరు? ఈ సృష్టికి మూలం ఏమిటి? కారణం లేకుండా ఏ కార్యమూ సంభవించదు కదా! మరి ఈ అనంతమైన జలరాశి వెనుక ఏదో ఒక శక్తి ఉండి తీరాలి కదా!”
మధుడి మాటలు విన్న కైటభుడు కొద్దిసేపు ఆలోచించాడు. “అన్నా! నువ్వు చెప్పింది నిజమే. మనం ఏదో ఒక మహాశక్తి వల్ల జన్మించి ఉండాలి. ఆ శక్తి ప్రభావం వల్లనే ఈ సముద్రం ఇంత విశాలంగా, నిశ్చలంగా ఉండవచ్చు. ఈ నీటికి, మన జన్మకు, ఈ అనంతమైన ప్రపంచానికి మూలం ఆ శక్తే అయి ఉండవచ్చు” అని సమాధానమిచ్చాడు.
ఆ మాటలతో వారిద్దరిలోనూ ఆలోచనలు మొదలయ్యాయి. ఇంతటి విశాలమైన సముద్రానికి ఆధారం ఏమిటి? తమకు జన్మనిచ్చిన శక్తి ఎవరు? ఆ శక్తి ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వారిద్దరూ సముద్రంలో ముందుకు సాగారు. ఎంత దూరం ప్రయాణించారో వారికే తెలియలేదు. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఆకాశం, సముద్రం ఒకటిగా కలిసిపోయినట్లు ఉన్నాయి. అంతలోనే ఆకాశంలో ఒక మహత్తరమైన కాంతి మెరిసింది. మొదట అది మెరుపులా కనిపించింది. ఆ తర్వాత క్రమంగా విస్తరించి, ప్రకాశవంతమైన కాంతిపుంజంగా మారింది. ఆ వెలుగును చూడలేక వారిద్దరూ క్షణకాలం కళ్లు మూసుకున్నారు.
ఆ సమయంలోనే వారికి ఒక బీజాక్షరం వినిపించింది. ఆ శబ్దం వారి మనసులను కదిలించింది. ఇప్పటివరకు తాము వెతుకుతున్న ఆ మహాశక్తి మరెవరో కాదు, ఆదిపరాశక్తి అయి ఉంటుందని వారికి అనిపించింది. ఆమెనే తమ జన్మకు, ఈ జలరాశికి మూలకారణమని భావించారు. వెంటనే వారిద్దరూ ఆ బీజాక్షరాన్ని మంత్రంగా స్వీకరించి, జలస్థంభన చేసి, సముద్రంలోనే ఘోరమైన తపస్సు ప్రారంభించారు.
ఆదిపరాశక్తి ప్రత్యక్షం.. స్వేచ్ఛా మరణం వరం!
మధుడు, కైటభుడు తమ ఇంద్రియాలను నియంత్రించుకున్నారు. నిద్రాహారాలను విడిచిపెట్టి, సంవత్సరాల తరబడి తపస్సు చేశారు. వారి కఠోరమైన తపస్సుకు ఆదిపరాశక్తి సంతోషించింది. కొంతకాలానికి వారి ముందు ప్రత్యక్షమై, “వత్సలారా! మీ తపస్సుకు మెచ్చాను. మీకు కావలసిన వరం కోరుకోండి” అని పలికింది. ఆమెను చూసిన సోదరులిద్దరూ భక్తితో నమస్కరించారు.
“అమ్మా! మాకు స్వేచ్ఛా మరణాన్ని ప్రసాదించు. మా ఇష్టప్రకారమే మాకు మరణం కలిగేలా వరమివ్వు” అని కోరుకున్నారు. ఆదిపరాశక్తి వారి కోరికను అంగీకరించింది.
“వత్సలారా! మీరు కోరుకున్న వరం మీకు లభించుగాక!” అని ఆశీర్వదించి అంతర్ధానమైంది. ఆ వరం పొందిన వెంటనే మధుడు, కైటభుడు తమను తాము అజేయులుగా భావించడం ప్రారంభించారు. తమకు ఇష్టం లేకపోతే మరణమే సంభవించదని గర్వించారు. తమను ఓడించగలవారు ఈ సృష్టిలో ఎవరూ లేరని విర్రవీగసాగారు.
వరమిచ్చిన ఆదిపరాశక్తి మహిమను గుర్తుంచుకోవాల్సింది పోయి, ఆ వరమే తమ అహంకారానికి ఆయుధంగా మార్చుకున్నారు.
అలా గర్వంతో సముద్రంలో సంచరిస్తున్న మధుకైటభులకు ఒకరోజు పద్మాసనంపై ఆసీనుడై ఉన్న బ్రహ్మదేవుడు కనిపించాడు. వెంటనే వారిద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు.
“ఓ బ్రహ్మా! మాతో యుద్ధం చేసి మమ్మల్ని ఓడించు. అలా చేయలేకపోతే నీ పద్మాసనాన్ని మాకు అప్పగించి, నువ్వు అక్కడి నుంచి వెళ్లిపో!” అని సవాలు విసిరారు.
బ్రహ్మదేవుడు కళ్లు తెరిచి వారి వైపు చూశాడు. ఎదురుగా ఇద్దరు మహాబలవంతులైన రాక్షసులు కనిపిస్తున్నారు. వారి శరీరాలు పర్వతాలంత భారీగా ఉన్నాయి. ముఖాల్లో అహంకారం ఉట్టిపడుతోంది. ముందుగా సామ, దాన, భేదోపాయాలతో వారిని శాంతింపజేయాలని భావించాడు. కానీ వారు వినే పరిస్థితిలో లేరు. యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
వారిని ఎదుర్కోవడం తన వల్ల కాదని గ్రహించిన బ్రహ్మదేవుడికి వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకొచ్చాడు. అయితే విష్ణుమూర్తి అప్పటికీ యోగనిద్రలోనే ఉన్నాడు. బ్రహ్మదేవుడు మొదట విష్ణుమూర్తిని స్తుతించాడు. అయినా ఆయన యోగనిద్ర నుంచి మేల్కొనలేదు. అప్పుడు విష్ణుమూర్తిని ఆవరించి ఉన్న యోగనిద్రాదేవిని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో శ్రీమహావిష్ణువు కళ్లు తెరిచాడు.
బ్రహ్మదేవుడు తనకు ఎదురైన ప్రమాదాన్ని వివరించి, మధుకైటభుల నుంచి రక్షించమని కోరాడు. అంతలోనే మధుకైటభులు అక్కడికి చేరుకున్నారు.
శ్రీమహావిష్ణువుతో భీకర యుద్ధం
శ్రీమహావిష్ణువును చూసిన మధుకైటభులు పరిహాసంగా నవ్వారు. “ఓ విష్ణుమూర్తీ! మమ్మల్ని ఏం చేయగలవు? మమ్మల్ని ఎదుర్కోలేక భయపడిన బ్రహ్మ నీ సహాయం కోరాడా?” అంటూ ఎగతాళి చేశారు. వెంటనే బ్రహ్మదేవుడిని పక్కకు తప్పించి, శ్రీమహావిష్ణువుపైకి దూసుకెళ్లారు. యుద్ధం ప్రారంభమైంది. ఒకవైపు ఇద్దరు మహాబలవంతులైన రాక్షసులు. మరోవైపు ఒక్కడే అయినా అపారమైన శక్తి కలిగిన శ్రీమహావిష్ణువు.
మధుడు, కైటభుడు వంతులవారీగా పోరాడుతున్నారు. ఒకరు అలసిపోయినప్పుడు మరొకరు యుద్ధంలోకి దిగుతున్నారు. కానీ శ్రీమహావిష్ణువు మాత్రం నిరంతరం వారిద్దరినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. యుద్ధం భీకరంగా సాగింది. సముద్రం అల్లకల్లోలమైంది. అలలు ఆకాశాన్ని తాకేలా ఎగసిపడ్డాయి. ఎంతసేపు పోరాడినా మధుకైటభులు వెనక్కి తగ్గలేదు. పైగా ఆదిపరాశక్తి ఇచ్చిన వరం కారణంగా వారి ధైర్యం మరింత పెరిగింది.
శ్రీమహావిష్ణువు క్రమంగా అలసిపోసాగాడు. ఈ రాక్షసుల బలం వెనుక ఆదిపరాశక్తి వరం ఉందని ఆయన గ్రహించాడు. వారిని కేవలం తన శక్తితో ఓడించడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. ఆమె ఆయన ప్రార్థనకు స్పందించింది. “నారాయణా! నీవు ఆందోళన చెందవద్దు. తిరిగి యుద్ధం ప్రారంభించు. విజయం నీకే లభిస్తుంది” అని అభయమిచ్చింది. ఆమె అనుగ్రహంతో శ్రీమహావిష్ణువు తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యాడు.
ఆదిపరాశక్తి మాయ.. రాక్షసుల అహంకారమే వారి బలహీనత!
మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. మధుకైటభులు తమ శక్తినంతా ఉపయోగించి శ్రీమహావిష్ణువుపై విరుచుకుపడ్డారు. నారాయణుడు కూడా వారిని ఎదుర్కొంటూ పోరాటాన్ని కొనసాగించాడు. ఎంతసేపు యుద్ధం చేసినా విజయం ఎవరి వైపూ మొగ్గుచూపలేదు. చివరకు శ్రీమహావిష్ణువు అలసటతో కాసేపు విశ్రమించినట్లుగా వెల్లకిలా పడుకున్నాడు. అదే సమయంలో ఆదిపరాశక్తి తన మహత్తరమైన మాయాశక్తితో ఆకాశంలో అతిలోక సౌందర్యవతిగా ప్రత్యక్షమైంది.
ఆమె అందాన్ని చూసిన మధుకైటభులు యుద్ధాన్ని సైతం మర్చిపోయారు. ఇప్పటివరకు తమతో పోరాడుతున్న శ్రీమహావిష్ణువుపై దృష్టి పెట్టిన ఆ ఇద్దరు రాక్షసులు, ఆ సౌందర్యవతి వైపు చూస్తూ మైమరచిపోయారు. ఆమెను పొందాలనే కోరిక వారిలో కలిగింది. వారి దృష్టి మరలిన విషయాన్ని శ్రీమహావిష్ణువు గమనించాడు. అంతలోనే మధుకైటభులు విష్ణుమూర్తిని ఉద్దేశించి ఇలా అన్నారు.
“ఓ విష్ణుమూర్తీ! నీలాంటి వారిని ఎందరినో చూశాం. ఎందరితోనో యుద్ధం చేశాం. వారందరినీ ఓడించాం. మమ్మల్ని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు. నువ్వు మాకు తగిన ప్రత్యర్థివి కూడా కావు. అయినా నీతో యుద్ధం చేశాం. ఇప్పుడు నీకు ఏదైనా వరం కావాలంటే అడుగు. నువ్వు కోరుకున్నది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం!” అని గర్వంగా ప్రకటించారు.
వారి మాటలు విన్న శ్రీమహావిష్ణువు ఇదే సరైన సమయమని భావించాడు. రాక్షసులే వరం ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు వారి అహంకారాన్నే వారి అంతానికి మార్గంగా మార్చుకోవచ్చు. వెంటనే ఆయన ఇలా అన్నాడు. “మీరు నిజంగా మాట తప్పని వారే అయితే, నాకు ఒక వరం ఇవ్వండి. మీ ఇద్దరికీ నా చేతిలోనే మరణం సంభవించాలి!”
ఆ మాటలు వినగానే మధుకైటభులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాము వరం ఇస్తామని చెప్పినప్పుడు విష్ణుమూర్తి తన ప్రాణాలనే కోరుకుంటాడని వారు ఊహించలేదు. ఒకవైపు తమ మాటను నిలబెట్టుకోవాలి. మరోవైపు తమకు ఆదిపరాశక్తి ప్రసాదించిన స్వేచ్ఛా మరణం వరాన్ని గుర్తుంచుకోవాలి. చివరకు తమ అహంకారాన్ని వదులుకోలేక వారు ఒక షరతు విధించారు.
“సరే! మా ప్రాణాలను తీసుకో. కానీ నీరు లేని ప్రదేశంలో మాత్రమే మమ్మల్ని చంపాలి!” అని అన్నారు. వారికి తెలియని విషయం ఒక్కటే. తాము విధించిన షరతే తమ మరణానికి మార్గం కాబోతోంది.
విష్ణుమూర్తి తొడలపై మధుకైటభుల అంతం
మధుకైటభుల మాటలు విన్న శ్రీమహావిష్ణువు వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఎటు చూసినా నీరే ఉన్న ఆ ప్రళయ సముద్రంలో నీరు లేని ప్రదేశం ఎక్కడ ఉంటుంది? అయితే విష్ణుమూర్తికి ఆ సమస్యకు పరిష్కారం తెలుసు. ఆయన తన తొడలను అత్యంత విశాలంగా, ఎత్తుగా విస్తరించి, నీరు లేని వేదికలా రూపొందించాడు. ఆ తర్వాత మధుకైటభులను తన తొడలపైకి తీసుకున్నాడు.
తాము విధించిన షరతు నెరవేరిందని గ్రహించిన రాక్షసులు తమ శరీరాలను మరింత భారీగా పెంచడం ప్రారంభించారు. విష్ణుమూర్తి కూడా తన తొడలను అంతకంటే విస్తృతంగా పెంచాడు. ఇలా కొంతసేపు కొనసాగిన తర్వాత శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని స్మరించాడు. మరుక్షణమే ఆ దివ్యాయుధం ఆయన చేతికి చేరింది.
అత్యంత వేగంగా తిరిగిన సుదర్శన చక్రం మధుకైటభుల కంఠాలను ఛేదించింది. అంతే!అపారమైన బలంతో విర్రవీగిన ఆ ఇద్దరు రాక్షసులు శ్రీమహావిష్ణువు చేతిలో సంహరించబడ్డారు. వారి భారీ శరీరాలు సముద్రంలో పడిపోయాయి. వారి మేధస్సు, శరీర భాగాలు జలరాశిలో విస్తరించాయని పురాణగాథ వివరిస్తుంది.
మేధస్సు నుంచి మేదిని.. భూమి ఆవిర్భావ గాథ
మధుకైటభుల సంహారంతో ప్రళయ సముద్రంలో ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది.
ఈ పురాణగాథలో వారి శరీరాల మేధస్సు నుంచి మట్టి ఏర్పడిందని, మేధతో ఏర్పడిన ఆ మట్టి కారణంగా భూమికి ‘మేదిని’ అనే పేరు వచ్చింది. అలా సృష్టికి ముందు ఉన్న అనంత జలరాశిలో మధుకైటభుల జననం, వారి తపస్సు, ఆదిపరాశక్తి ప్రసాదించిన వరం, ఆ వరంతో వచ్చిన అహంకారం, చివరకు శ్రీమహావిష్ణువు చేతిలో వారి సంహారం చోటుచేసుకున్నాయి.
ఈ కథలో మధుకైటభులు కేవలం ఇద్దరు బలవంతులైన రాక్షసులు మాత్రమే కాదు. తమకు లభించిన వరాన్ని తమ అజేయత్వానికి నిదర్శనంగా భావించిన అహంకారానికి ప్రతీకలు కూడా.
వరాన్ని పొందడం గొప్ప విషయం కావచ్చు. కానీ ఆ వరం వెనుక ఉన్న శక్తిని మర్చిపోయి, తామే సర్వశక్తిమంతులమని భావించినప్పుడు పతనం తప్పదనే సందేశాన్ని మధుకైటభుల వృత్తాంతం అందిస్తుంది.








