డాక్టర్ కేఏ పాల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న ప్రపంచ శాంతి, ప్రార్థన సభ.. ఏర్పాట్లు ముమ్మరం
గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ప్రెసిడెంట్ డాక్టర్ కేఏ పాల్(Dr. K.A. Paul) అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లూయిస్విల్లే లో ఉన్న ఎన్టీఎక్స్ అరెనా(NTX Arena @ The Vista) వేదికగా అక్టోబర్ 25, 2026 ఆదివారం రోజున గ్లోబల్ పీస్ & ప్రేయర్ మీటింగ్(Global Peace & Prayer Meeting) నిర్వహించనున్నారు. సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం.. శాంతి, నిరీక్షణ, ప్రార్థనతో పాటు ఇమ్మిగ్రేషన్ సమస్యలు సహా వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్న కుటుంబాలు, కమ్యూనిటీలకు మద్దతుగా నిలవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వాషింగ్టన్ డీసీ వేదికగా…
వాషింగ్టన్ డీసీలో జరిగిన అంతర్జాతీయ శాంతి కార్యకలాపాల ముగింపు వెంటనే ఈ కార్యక్రమం నిర్వహిస్తుండటం విశేషం. గత సెప్టెంబర్‌లో ఆయన కాపిటల్ హిల్టన్‌లో గ్లోబల్ పీస్ & ఎకనామిక్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సదస్సుకు రాజకీయ, దౌత్య, మత, వ్యాపార, కమ్యూనిటీ నాయకులు హాజరయ్యారు. ఈ వాషింగ్టన్ సమావేశానికి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ (Mike Johnson) ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సహకారం, చర్చలు, శాంతియుత విధానాల ప్రాముఖ్యతపై పాల్‌తో కలిసి చర్చలు జరిపారు.
ఘనంగా పుట్టినరోజు వేడుకలూ…
వాషింగ్టన్ డీసీలోనే డాక్టర్ కేఏ పాల్ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన అంతర్జాతీయ శాంతి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లారు. లూయిస్విల్లేలో జరిగే సమావేశం ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశమని పాల్ అనుచరులు చెబుతున్నారు.








