ఇంటి పనులతోనే అలసిపోతున్నారా? ఫిట్‌గా ఉండేందుకు మహిళలు చేయాల్సిన 5 వ్యాయామాలు!
ఇంట్లోనే ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకునే మహిళలకు రోజంతా చేతినిండా పని ఉంటుంది. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, పిల్లలను చూసుకోవడం, ఇంట్లోని పెద్దవారికి అవసరమైన పనులు చేయడం వంటి వాటితో సమయం గడిచిపోతుంది. ఇన్ని పనులు చేస్తున్నా ప్రత్యేకంగా వ్యాయామం (Exercise) చేయడానికి మాత్రం చాలామందికి సమయం దొరకదు. దీంతో శరీర బరువు పెరగడం, నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, అలసట వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఫిట్నెస్ (Fitness) కోసం తప్పనిసరిగా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే రోజుకు కొంత సమయం కేటాయించి కొన్ని సులభమైన యాక్టివిటీస్ చేస్తే శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవచ్చు.
ఇంట్లోనే చేయగలిగే సులభమైన వ్యాయామాలు..

ఇంట్లో పని చేసే మహిళలకు నడక చాలా మంచి వ్యాయామం. ఉదయం లేదా సాయంత్రం 15 నుంచి 20 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లడానికి వీలుకాకపోతే ఇంట్లోనే ఒక గది నుంచి మరో గదికి నడవవచ్చు. నడిచేటప్పుడు చేతులను కూడా కదిలిస్తూ అడుగులు వేస్తే శరీరానికి మంచి కదలిక లభిస్తుంది. క్రమంగా నడిచే సమయాన్ని పెంచుకోవచ్చు.
ఇంటి పనుల మధ్యలో చిన్న చిన్న వ్యాయామాలు చేయడం కూడా మంచిదే. వంట పూర్తయ్యేలోపు లేదా బట్టలు ఉతికిన తర్వాత కొన్ని నిమిషాలు కేటాయించవచ్చు. ఒకచోట నిలబడి మోకాళ్లను మెల్లగా పైకి ఎత్తడం, చేతులను ముందుకు వెనక్కి కదిలించడం వంటి చర్యలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. ఎక్కువసేపు ఒకే చోట నిలబడకుండా మధ్య మధ్యలో కాసేపు కూర్చోవడం, నడవడం అలవాటు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి
కుర్చీ సహాయంతో చేసే వ్యాయామాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. బలమైన కుర్చీని పట్టుకుని నెమ్మదిగా కూర్చోవడం, తిరిగి నిలబడటం (Chair Squats) సాధన చేయవచ్చు. ఇది కాళ్ల కండరాలకు బలం అందిస్తుంది. అలాగే గోడకు చేతులు ఆనించి మెల్లగా ముందుకు వంగి వెనక్కి రావడం (Wall Push-ups) వల్ల చేతులు, భుజాలకు వ్యాయామం లభిస్తుంది. ప్రారంభంలో తక్కువ సార్లు చేసి, శరీరానికి అలవాటయ్యాక సంఖ్య పెంచుకోవాలి.
యోగా, డ్యాన్స్‌తో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి

యోగాసనాలు (Yoga) కూడా మహిళల రోజువారీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. తాడాసనం, వృక్షాసనం, మార్జారాసనం వంటి సులభమైన ఆసనాలను నిపుణుల సూచనలతో నేర్చుకుని సాధన చేయవచ్చు. ఇవి శరీరాన్ని సాగదీయడానికి, సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. రోజుకు ఐదు నుంచి పది నిమిషాలు శ్వాస వ్యాయామం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
పాటలు వింటూ ఇంట్లోనే డ్యాన్స్ చేయడం కూడా మంచి ఫిట్నెస్ యాక్టివిటీ. రోజుకు 10 నిమిషాలు ఇష్టమైన పాటలకు అనుగుణంగా కదలడం వల్ల శరీరానికి కదలికతో పాటు ఉత్సాహం కూడా వస్తుంది. పిల్లలతో కలిసి ఆటలు ఆడటం కూడా మంచి మార్గమే.
వ్యాయామంతో పాటు సరైన ఆహారం, తగినంత నీరు, మంచి నిద్ర కూడా అవసరం. రోజంతా ఇంటి పనులు చేస్తున్నామనే కారణంతో శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా ఉండకూడదు. మొదట చిన్న లక్ష్యంతో ప్రారంభించి క్రమంగా అలవాటు చేసుకోవాలి. నొప్పి, తల తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే వ్యాయామం ఆపాలి. గర్భిణులు, ప్రసవానంతర మహిళలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి. రోజులో కొద్దిసేపైనా మన ఆరోగ్యం కోసం కేటాయిస్తే ఇంటి బాధ్యతలతో పాటు మనల్ని మనం కూడా ఆరోగ్యంగా చూసుకోవచ్చు.







