166 మంది ప్రాణాలు తీసిన దాడులు.. 18 ఏళ్లుగా వెంటాడుతున్న ఓ మిస్టరీ! అసలు ఆ ‘మేజర్ జనరల్ సాహబ్’ ఎవరు?
2008 నవంబర్ 26.. ముంబై నగరం ఒక్కసారిగా ఉగ్రదాడులతో వణికిపోయింది. హోటళ్లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ఎక్కడ చూసినా తుపాకీ కాల్పులు, పేలుళ్లు, హాహాకారాలు! ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌ను సజీవంగా పట్టుకోవడంతో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ, అతడు చెప్పిన ఓ వ్యక్తి గురించి మాత్రం ఇప్పటికీ ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. అతడే ‘మేజర్ జనరల్ సాహబ్’!
కసబ్‌కు శిక్షణ ఇచ్చింది ఎవరు?
పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌లో లష్కరే తోయిబా నిర్వహించిన శిక్షణ శిబిరంలో కసబ్‌కు శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఈ శిక్షణను పర్యవేక్షించేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి వచ్చేవాడని కసబ్ తన పోలీసు విచారణలో చెప్పాడు. అతడు వచ్చినప్పుడు హఫీజ్ సయీద్, జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ ప్రత్యేకంగా కలుసుకుని కౌగిలించుకునేవారని వివరించాడు. అప్పటి నుంచి ఆ వ్యక్తిని ‘మేజర్ జనరల్’ అని పిలిచేవారట.
ఉగ్రవాదుల సామర్థ్యాన్ని పరీక్షించిన ఆ అధికారి!
ఎనిమిది వారాలపాటు సాగిన శిక్షణను ఈ మేజర్ జనరల్ పర్యవేక్షించినట్లు కసబ్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అంతేకాదు, 2008లో మరోసారి శిక్షణ శిబిరానికి వచ్చి ఉగ్రవాదుల సన్నద్ధతను పరీక్షించాడట. కసబ్‌కు ఈత వచ్చా? అని కూడా అడిగాడని విచారణలో వెల్లడైంది.
అక్కడితో ఆగకుండా పది లక్ష్యాలను ఏర్పాటు చేసి కాల్పుల పరీక్ష నిర్వహించినట్లు కసబ్ తెలిపాడు. ఉగ్రవాదులు లక్ష్యాలను ఛేదించడంతో ఆ అధికారి వారిని అభినందించాడట. కసబ్ భుజం తట్టి ప్రశంసించాడని కూడా తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
దాడుల వెనుక ఉన్న కీలక వ్యక్తి ఇతడేనా?
ముంబైపై దాడులు జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌లోని వారి హ్యాండ్లర్లకు మధ్య జరిగిన సంభాషణల్లోనూ ‘మేజర్ జనరల్ సాహబ్’ ప్రస్తావన వచ్చినట్లు దర్యాప్తు వివరాలు చెబుతున్నాయి. దీంతో పాక్ సైన్యం, నిఘా వ్యవస్థలోని కీలక వ్యక్తి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
18 ఏళ్లయినా బయటపడని అసలు పేరు!
కసబ్ ఇచ్చిన వివరాల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ వ్యక్తిని ‘Accused No.20 – Major General Sahab, Name Not Known’గా గుర్తించింది. 32 మంది పాకిస్థానీయుల ప్రస్తావన ఉన్న దర్యాప్తు రికార్డుల్లో ఇతడి అసలు గుర్తింపు మాత్రం తెలియరాలేదు. ముంబై పోలీసుల 2009 ఛార్జ్‌షీట్‌లోనూ అతడి పేరు వెల్లడించలేదు.
అంతేకాదు.. ఈ మేజర్ జనరల్‌కు సంబంధించిన ఫొటో కానీ, స్కెచ్ కానీ ఇప్పటివరకు బయటకు రాలేదు. కసబ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలమే అతడి గురించి అందుబాటులో ఉన్న ప్రధాన ఆధారంగా నిలిచింది.
166 మంది ప్రాణాలు తీసిన 26/11 దాడులకు 18 ఏళ్లు గడిచిపోయాయి. కానీ, ఆ దాడుల వెనుక ఉన్న కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ‘మేజర్ జనరల్ సాహబ్’ ఎవరు? అతడి అసలు పేరు ఏమిటి? అతడు ఇప్పటికీ పాకిస్థాన్‌లో ఉన్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







