చైనా దెబ్బ ..సీఐఏ అబ్బా..! సైబర్ ఎటాక్ తో తలపట్టుకున్న అమెరికా..!
ప్రపంచ సూపర్ పవర్ అమెరికాకు షాకిచ్చింది చైనా. ప్రపంచంలో తామే గొప్పగా గూఢచర్యం చేస్తామని దేశాధ్యక్షుడు ట్రంప్ ఘనంగా ప్రకటించుకుని రోజులు కూడా గడవకముందే.. ఏకంగా సైబర్ అస్త్రం సంధించింది. అదికూడా..సీఐఏ ఖాతాలను హ్యాక్ చేసి, అందులోని కీలక సమాచారాన్ని తస్కరించింది. చైనా సైబర్ అస్త్రం దెబ్బకు సీఐఏ బుర్ర తిరిగిపోయింది. అందులో కీలక సమాచారం లేదంటున్నప్పటికీ.. ఇది ఎలా జరిగిందన్న కోణంలో విచారణ జరుపుతోంది .
అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ది నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ది ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడ్డారు. అయితే కచ్చితంగా ఏ సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లిందో మాత్రం అధికారిక వర్గాలు వెల్లడించలేదు. రహస్య డేటా మాత్రం భద్రంగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
చైనా ఏఐ ఆయుధం ఆర్టెక్స్..?
అమెరికా నిఘా సంస్థల కంప్యూటర్లలోకి చొరబడేందుకు చైనాలో తయారైన కృత్రిమ మేధ (ఏఐ) టూల్‌ను వాడారు. దాని పేరు ఆర్టెక్స్ (Artex). ఈ ఏడాది ప్రారంభంలో ఓ చైనా ఇంజినీర్ దీనిని సైబర్ సెక్యూరిటీ కోసం అంటూ తయారు చేశాడు. జులై నుంచి బహిరంగంగా అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి జపాన్, దక్షిణ కొరియాలోని పలు వ్యాపార సంస్థలపై సైబర్ దాడులకు దీనిని వాడినట్లు ఆరోపణలున్నాయి. గత కొన్నేళ్లుగా చైనా ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్లు అమెరికాపై సైబర్ దాడులు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అమెరికా నిఘా వర్గాలు సేకరించిన బహిరంగ సమాచారం, వాణిజ్య పరంగా అందుబాటులో ఉన్న వివరాలు, సోషల్ మీడియా నుంచి సేకరించిన డేటా, ఉపగ్రహ చిత్రాలు, ఇతర ఆన్లైన్ మెటీరియల్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. తమకు చేరే రహస్య సమాచారానికి వీటిని అనుసంధానించి నిఘా వర్గాలు విశ్లేషిస్తుంటాయి. ఈ సైబర్ దాడిపై సీఐఏ, ఎన్జీఏ స్పందించలేదు.
ఇటీవల అమెరికా నిఘా, భద్రతా సంస్థల్లో తరచూ సాంకేతిక లోపాలు, సైబర్ దాడులు చోటుచేసుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ కీలక నెట్వర్క్ మోరాయించింది. అయితే ఇది సైబర్ దాడి కాదని ఎన్ఎస్ఏ తెలిపింది. ఇక అమెరికాలోని క్రిమినల్స్, అనుమానితుల డేటాను ఎఫ్‌బీఐ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి హ్యాకర్లు కాజేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా ధ్రువీకరించారు. ‘అది ఏమాత్రం క్షేమం కాదు’ అని నాడు ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు గత వారం అమెరికా వ్యవసాయ శాఖపై కూడా సైబర్ దాడి జరిగింది







