రెండేళ్ల తర్వాత పాకిస్థాన్‌కు తొలి టెస్టు సిరీస్ విజయం..!
రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పాకిస్థాన్(Pakistan) క్రికెట్ జట్టు ఎట్టకేలకు టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. రావల్పిండి వేదికగా శుక్రవారం ముగిసిన రెండో టెస్టులో శ్రీలంకపై(Srilanka) 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన పాక్, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లోనే శ్రీలంకను 98 పరుగులకే కుప్పకూల్చి 227 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించిన పాకిస్థాన్, అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో లంకను 316 పరుగులకు కట్టడి చేసింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు, నాలుగో రోజు తొలి సెషన్లోనే కేవలం 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అబ్బాస్ తన కచ్చితమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా పేసర్ సాకిబ్ ఖాన్ బౌలింగ్‌కు దూరమైనప్పటికీ, అబ్బాస్ ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు 90 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు తయ్యబ్ ఆరిఫ్ (13), మహ్మద్ తాహా (4) త్వరగానే అవుటైనప్పటికీ, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్ కేవలం 22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 34 పరుగులు చేసి జట్టుకు మెరుపు విజయాన్ని అందించాడు.
ఇవి కూడా చదవండి
అజాన్ అవైస్ (32 నాటౌట్) అతనికి చక్కటి సహకారం అందించాడు. 2024లో స్వదేశంలో ఇంగ్లాండ్‌పై గెలిచిన తర్వాత పాకిస్థాన్‌కు ఇదే మొదటి టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. కుర్రాళ్లతో కూడిన కొత్త జట్టు అద్భుతంగా రాణించిందని కెప్టెన్ బాబర్ ఆజం సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఓటమితో శ్రీలంక తన పాకిస్థాన్ పర్యటనను నిరాశతో ముగించింది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో కోల్పోయిన లంక, వన్డే ముక్కోణపు సిరీస్ ఫైనల్లోనూ పాక్ చేతిలో పరాజయం పాలైంది.







