రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్!
అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య సాగుతున్న పరోక్ష, ప్రత్యక్ష విమర్శల పర్వం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధిపేటలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా ఎక్స్ లో స్పందించారు. తగ్గేదే లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ, నాయకుల భాష వంటి అంశాలు ఈ వివాదానికి కేంద్రబిందువులుగా కనిపిస్తున్నాయి.
ఇటీవల మునుగోడు బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు వేల కోట్ల రూపాయల నిధులు తరలిస్తున్నారని, అదే సమయంలో మిగతా నియోజకవర్గాల అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మునుగోడు ప్రజల అవసరాల కోసం నిధులు అడగడం తప్పా అని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఉపయోగించే భాషపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా సిద్ధిపేటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. పార్టీలో ఏవైనా లోపాలు ఉంటే అంతర్గత వేదికలపై చర్చించాలని, అంతేకానీ బహిరంగంగా మైకుల్లో మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో, కొందరు నేతలు “పిచ్చి కుక్కలు కరిచినట్లుగా” మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా పరోక్షంగా, అంతే తీవ్రంగా స్పందించారు. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు హుందాతనం పాటించాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేసేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మపరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నట్లు ఆయన చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఈ వివాదం కేవలం నిధుల కేటాయింపుకు మాత్రమే పరిమితం కాలేదు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడం పట్ల రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలోనూ ఆయన కొన్ని ఆరోపణలు చేయడం గమనార్హం. మరోవైపు, పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలను అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.







