జేక్ లాంగ్, థామస్ అలెన్ పై చర్యలు తీసుకోవాలి : అటార్నీ జనరల్ కి లేఖ రాసిన భారతీయ ప్రతినిధులు
సియాటిల్ దీపావళి వేడుకల సమయంలో ట్రంప్ మద్దతుదారులుగా భావిస్తున్న ,అతివాదులు జేక్ లాంగ్, థామస్ అలెన్ తీవ్ర అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై హిందువులు, భారతీయ అమెరికన్ ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వున్నారు. ఈ ఘటన జరగగానే.. వారిపై చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే.. తాజాగా.. ఇదే విషయంపై భారతీయ అమెరికన్ ప్రతినిధులైన ప్రమీలా జయపాల్, సుహాస్ సుబ్రహ్మణ్యంతో సహా పలువురు అమెరికా చట్ట సభ్యులు అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె కి లేఖ రాశారు. అతివాదులు జేక్ లాంగ్, థామస్ అలెన్ పై చర్యలు తీసుకోవాలని అందులో డిమాండ్ చేశారు.
ఈ ఘటనను ఫెడరల్ ద్వేషపూరిత నేరంగా (హేట్ క్రైమ్) పరిగణించి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్‌నల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (CAPAC) సభ్యులు మంగళవారం రాసిన ఈ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌కు కూడా పంపారు.
ఇవి కూడా చదవండి
“నవంబర్ 7, 2026న సియాటిల్‌లో బహిరంగంగా జరిగిన దీపావళి వేడుకలకు జేక్ లాంగ్, థామస్ అలెన్‌లు అంతరాయం కలిగించడంపై వెంటనే దర్యాప్తు జరిపించాలని మేము కోరుతున్నాము. దేశవ్యాప్తంగా వీరు సాగిస్తున్న ద్వేషపూరిత చర్యలకు బాధ్యులను చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలి” అని చట్టసభ సభ్యులు తమ లేఖలో పేర్కొన్నారు.
అలెన్, లాంగ్ ఇద్దరిపైనా గతంలోనే నిర్లక్ష్యపూరిత, నేరపూరిత చర్యల రికార్డులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. జనవరి 6 నాటి క్యాపిటల్ హింసాకాండలో పోలీసులపై దాడి చేసిన కేసులో లాంగ్ నిందితుడని, ఆ తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అతనికి క్షమాభిక్ష లభించిందని లేఖలో ప్రస్తావించారు.
“ప్రజా పదవుల్లో ఉన్న మేము ఎక్కడ ద్వేషం కనిపించినా దానిని ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తమ సొంత నగరంలో దీపం వెలిగించడానికి, నృత్యం చేయడానికి లేదా పిల్లలను పండుగకు తీసుకురావడానికి ఏ కుటుంబమూ భయపడే పరిస్థితి ఉండకూడదు” అని వారు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దక్షిణాసియా కమ్యూనిటీలపై జరుగుతున్న వరుస బెదిరింపుల నేపథ్యంలోనే సియాటిల్ ఘటన చోటుచేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ లేఖపై సంతకం చేసిన వారిలో CAPAC చైర్ గ్రేస్ మెంగ్, రాజా కృష్ణమూర్తి, యాస్మిన్ అన్సారీ, అమీ బేరా, జూడీ చూ, సుజాన్ కె. డెల్బెన్, రో ఖన్నా, ఎమిలీ రాండాల్, లతీఫా సైమన్, ఆడమ్ స్మిత్, శ్రీ తానేదార్ ఉన్నారు.







