ఆడబిడ్డలు అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం : చంద్రబాబు
వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ (MBBS) రాష్ట్ర కోటా సీట్లలో బాలుర (Boys)ను మించి బాలికలు (Girls) సీట్లు సాధించడం వారి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర కోటా సీట్లలో 61.34 శాతం యువతులే దక్కించుకోగా, బాలురు 38.66శాతానికే పరిమితమయ్యారని తెలిపారు. ఆడబిడ్డల్లో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం, ఆశయాలకు ఇది ప్రతిబింబమని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రతి ఆడబిడ్డకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వారు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విజయాలు సాధిస్తూ నాయకత్వ స్థానాలకు ఎదిగేలా ప్రోత్సహిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.







