అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి TCSలో ప్రవేశం నిరాకరణ? హైదరాబాద్‌లో కంపెనీ కార్యాలయం ఎదుట భక్తుల ఆందోళన!
అయ్యప్ప దీక్షలో ఉన్న ఓ ఉద్యోగిని కార్యాలయంలోకి అనుమతించలేదన్న ఆరోపణతో హైదరాబాద్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని TCS కార్యాలయం ఎదుట గురువారం పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రెండు నెలల ముందే సమాచారం ఇచ్చినా.. చివరి నిమిషంలో అడ్డుకున్నారా?
మనీష్ అనే ఉద్యోగి గత రెండేళ్లుగా TCSలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. అయ్యప్ప దీక్ష తీసుకోబోతున్న విషయాన్ని రెండు నెలల ముందుగానే కంపెనీ యాజమాన్యానికి తెలియజేశానని పేర్కొన్నాడు.
అయితే, గురువారం దీక్ష వస్త్రధారణతో కార్యాలయానికి వెళ్లిన తనను ప్రవేశ ద్వారం వద్దే అడ్డుకున్నారని మనీష్ ఆరోపించాడు. కంపెనీ డ్రెస్ కోడ్‌ను పాటించకుండా కార్యాలయంలోకి రావడానికి అనుమతి లేదని తనకు చెప్పినట్లు వెల్లడించాడు.
ఇదే సమయంలో ఇతర ఉద్యోగులు అదే డ్రెస్ కోడ్‌ను పాటించకుండానే కార్యాలయంలోకి వెళ్తున్నారని, తన విషయంలోనే ఈ నిబంధన ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిపాడు.
ఇవి కూడా చదవండి
TCS కార్యాలయం ఎదుట అయ్యప్ప భక్తుల నిరసన
మనీష్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల సభ్యులు TCS ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. దీక్షలో ఉన్న ఉద్యోగికి విధులకు హాజరయ్యేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కార్యాలయం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల వివరణ ఏమిటి? వివాదం పరిష్కారమైందా?
ఈ ఘటనపై ఆదిబట్ల పోలీసు అధికారి స్పందిస్తూ.. ఓ ఉద్యోగి కంపెనీపై చేసిన ఆరోపణల నేపథ్యంలోనే నిరసన జరిగిందని తెలిపారు. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
మరోవైపు, ఓ సీనియర్ పోలీసు అధికారి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఉద్యోగి సంప్రదాయ వస్త్రధారణకు సంబంధించి ఏర్పడిన అపార్థం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని, సమస్య పరిష్కారమైందని పేర్కొన్నారు. ఈ ఘటనకు ఎలాంటి మతపరమైన కోణం లేదని కూడా స్పష్టం చేశారు.
ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.
ఒకవైపు ఉద్యోగి చేసిన ఆరోపణలు.. మరోవైపు పోలీసుల అపార్థం వివరణ.. ఈ రెండు పరిణామాలతో ఆదిబట్లలోని TCS కార్యాలయం వద్ద జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కంపెనీ డ్రెస్ కోడ్, ఉద్యోగుల సంప్రదాయ వస్త్రధారణకు సంబంధించిన అంశంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







