గ్రామ పీఠాలే టార్గెట్.. ఏపీలో మంత్రుల పొలిటికల్ స్కెచ్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ రాజకీయాల వరకు పట్టు సాధించేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు కుటుంబ సభ్యులనే ఎన్నికల బరిలోకి దించుతున్నారు. సాధారణంగా పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాల్సిన స్థానాల్లో భార్యలకు ప్రాధాన్యం కల్పించడం ఆసక్తికరంగా మారింది. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్న చోట సొంత కుటుంబ సభ్యుల ద్వారా రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే వ్యూహం కనిపిస్తోంది. తాజాగా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy), మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ( Ramprasad Reddy) తీసుకున్న నిర్ణయాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
నంద్యాల జిల్లా (Nandyal District) బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తన సతీమణి ఇందిరారెడ్డిని సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిపారు. బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి ఆమె నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా రాజకీయ వేడిని పెంచింది. మంత్రి స్వయంగా రాష్ట్రస్థాయి బాధ్యతల్లో ఉన్నప్పటికీ, తన స్వస్థలంలోని కీలకమైన పంచాయతీని వదులుకోవడానికి సిద్ధంగా లేరనే సంకేతాలు ఈ నిర్ణయం ద్వారా వెలువడుతున్నాయి.
బనగానపల్లె (Banaganapalle) పంచాయతీకి నియోజకవర్గ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 40 వేలకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో సర్పంచ్ పదవిని సాధారణ స్థానిక పదవిగా కాకుండా, రాజకీయ పలుకుబడికి ప్రతీకగా చూస్తారు. గతంలో కూడా బీసీ కుటుంబానికి చెందిన నాయకులు ఈ పదవిలో పనిచేశారు. దీంతో ఈసారి కూడా తమ కుటుంబ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతోనే ఇందిరారెడ్డిని రంగంలోకి దించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థి కాటసాని రామిరెడ్డి వర్గానికి అవకాశం ఇవ్వకుండా పంచాయతీపై పట్టు సాధించడం మంత్రికి కీలకంగా మారింది.
ప్లాస్టిక్ రహిత బనగానపల్లి వంటి సామాజిక కార్యక్రమాల ద్వారా ఇప్పటికే బీసీ ఇంద్రారెడ్డి ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్థానికంగా మంచి గుర్తింపు ఉండడం మంచి ప్లస్ పాయింట్ . అభివృద్ధి పనులు, స్థానిక నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపైనా ఈ పదవి ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు రాయచోటి (Rayachoti) రాజకీయాల్లోనూ ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. రాయచోటి నియోజకవర్గంలో అధికార టీడీపీ (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి.
నియోజకవర్గంలోని 85 సర్పంచ్ స్థానాలతో పాటు ఎంపీటీసీ స్థానాల విషయంలో మంత్రి మండిపల్లి వర్గం, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వర్గం మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్ష పదవిని తమ చేతుల్లో ఉంచుకోవడం మంత్రికి రాజకీయంగా కీలకంగా మారింది. గెలిచిన ఎంపీటీసీలను ఒకే తాటిపైకి తీసుకురావడంతో పాటు, భవిష్యత్తులో వర్గ విభేదాలు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతోనే హరితారెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే మంత్రుల కుటుంబ సభ్యులకు పదవులు దక్కడం స్థానిక నాయకుల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు అవకాశాలు తగ్గుతున్నాయనే అసంతృప్తి కూడా తలెత్తవచ్చు. మరోవైపు మంత్రులు మాత్రం స్థానిక రాజకీయాలపై తమ పట్టు తగ్గకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాప్రతినిధుల ఎంపికకే పరిమితం కాకుండా, మంత్రుల కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి కూడా వేదికగా మారుతున్నాయనే చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.







