హెచ్చరికలే తప్ప చర్యలు శూన్యం.. మూడు పార్టీల్లోనూ ఓకే పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారమే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నా.. సొంత పార్టీలోని నాయకులను కట్టడి చేయడం మాత్రం అధినేతలకు పెద్ద సవాలుగా మారుతోంది. తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP), జనసేన (Jana Sena) పార్టీల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధిష్టానం నిర్ణయాలను ధిక్కరించడం, స్థానిక నాయకత్వంతో విభేదించడం, ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులకే వ్యతిరేకంగా పనిచేయడం వంటి పరిణామాలు మూడు పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని అగ్రనాయకత్వం హెచ్చరిస్తున్నా.. ఆచరణలో మాత్రం అంత కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా రాజకీయ పార్టీల్లో అధినేత నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో బలమైన పట్టున్న నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అధిష్టానం సూచనలను పక్కనపెడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు, స్థానిక రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు నేతల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని పార్టీలు ప్రకటిస్తున్నప్పటికీ, వారిని పూర్తిగా దూరం చేసుకునేందుకు మాత్రం వెనుకాడుతున్నాయి.
కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనలకు ఈ సమస్య మరింత సున్నితంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా కొందరు నాయకులు రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ, కొన్ని సందర్భాల్లో వెనక్కి తగ్గిన పరిస్థితులు కనిపించాయి. ఒకవైపు క్రమశిక్షణ విషయంలో రాజీపడేది లేదని చెబుతూనే, మరోవైపు కూటమి ఐక్యతకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ప్రతిష్ట, భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలు కూడా ఈ నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇక వైసీపీలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. గతంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిర్ణయాలను ధిక్కరించిన నాయకులపై వేగంగా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి నాయకులను పూర్తిగా నియంత్రించడం అంత సులభంగా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థుల ఏకగ్రీవాలను అడ్డుకోవడంలో విఫలమైనా, ప్రచారంలో నిర్లక్ష్యం వహించినా వచ్చే సాధారణ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు జగన్ హెచ్చరికలు జారీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ ఆ ఆదేశాలను నాయకులు ఎంతవరకు పాటిస్తున్నారనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
నిజానికి ఈ మూడు పార్టీలకు ఇప్పుడు నాయకులను కోల్పోవడం రాజకీయంగా ప్రమాదకరమే. స్థానికంగా బలమైన నేతలను సస్పెండ్ చేసినా, పార్టీ నుంచి బయటకు పంపించినా వారు ప్రత్యర్థి పార్టీల వైపు వెళ్లే అవకాశం ఉంది. కొత్త రాజకీయ వేదికలు, ప్రత్యామ్నాయ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో నాయకులను పూర్తిగా దూరం చేసుకోవడానికి పార్టీలు ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఏపీలో మూడు ప్రధాన పార్టీల్లోనూ ఒకే తరహా పరిస్థితి కనిపిస్తోంది. అధినేతలు కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం హెచ్చరికలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ధోరణి కొనసాగితే పార్టీ క్రమశిక్షణ బలహీనపడటమే కాకుండా, భవిష్యత్తులో అధిష్టానం మాటకు విలువ తగ్గే ప్రమాదం ఉంది. నాయకులను కాపాడుకోవాలా? క్రమశిక్షణను నిలబెట్టాలా? అన్న సందిగ్ధంలో మూడు పార్టీల అధినేతలు ఉన్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.







