రూ.2 కోట్ల జీతం తగ్గించుకున్న మహ్మద్ షమీ..!
ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగిసే ముందు మరో సంచలన ట్రేడ్ డీల్ అధికారికంగా ఖరారైంది. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టును వీడి, ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ (2008) ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టులో చేరారు. ఈ మల్టీ-ప్లేయర్ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా షమీ తన వేతనంలో ఏకంగా రూ.2 కోట్లు తగ్గించుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లక్నో జట్టులో రూ.10 కోట్ల భారీ పారితోషికం అందుకున్న షమీ, ఇప్పుడు రూ.8 కోట్ల సవరించిన ఫీజుతో రాజస్థాన్ తరఫున బరిలోకి దిగనున్నారు.
ఈ విషయాన్ని ఐపీఎల్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటన ద్వారా ధృవీకరించింది. ఈ ట్రేడ్ డీల్‌లో మహ్మద్ షమీతో పాటు లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మణిమారన్ సిద్ధార్థ్ కూడా తన ప్రస్తుత ధర రూ.75 లక్షలకే రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి మారారు. వీరిద్దరికీ బదులుగా రాజస్థాన్ రాయల్స్ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు అప్పగించింది. సామ్ కరన్ రాజస్థాన్ జట్టులో పొందిన రూ.2.4 కోట్ల పాత వేతనానికే లక్నో తరఫున ఆడనున్నారు. ఐపీఎల్ 2026కు ముందు సంజూ శాంసన్, రవీంద్ర జడేజా ట్రేడ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్‌కు వచ్చిన కరన్, గాయం కారణంగా గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టును వీడాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, మహ్మద్ షమీకి వరుసగా నాలుగు ఐపీఎల్ సీజన్లలో ఇది నాలుగో ఫ్రాంచైజీ కావడం విశేషం. 2022 నుంచి 2024 వరకు మూడు సీజన్ల పాటు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి అద్భుత విజయాలు అందించిన షమీ, 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మారారు. ఆ తర్వాత 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఆయన, ఆ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 9 ఎకానమీ రేటుతో 12 వికెట్లు పడగొట్టారు. గత సీజన్లో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవడంతో ఇప్పుడు జట్టులో భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్ కెరీర్లో 132 మ్యాచ్‌లు ఆడి 145 వికెట్లు పడగొట్టిన అనుభవజ్ఞుడైన షమీ రాకతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది.







