నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ..!
జాతీయ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పర్యటన రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయిన చంద్రబాబు, ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు మరియు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాల అభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రాయలసీమ హార్టీకల్చర్ హబ్’ ప్రాజెక్టు అమలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, నిధుల కేటాయింపులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో మదనపల్లె వేదికగా చర్చకు వచ్చిన ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, రాయలసీమను ఉద్యానవన రంగానికి కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకు కేంద్రం నుంచి పూర్తి స్థాయి మద్దతు కోరారు.
ఇవి కూడా చదవండి
ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఇటీవల ఎదురైన ప్రకృతి వైపరీత్యాలు, వరుస తుపానుల వల్ల జరిగిన నష్టాలపై సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి దృష్టికి స్పష్టమైన నివేదికను తీసుకెళ్లారు. ఎల్‌నినో ప్రభావం, వరుస తుపానుల కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని వివరించారు. ఈ మేరకు తుపానుల నష్టాలకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన నివేదికల ఆధారంగా తక్షణమే తగిన ఆర్థిక సాయం, పునరుానిర్మాణ నిధులను విడుదల చేయాలని ఆయన గట్టిగా కోరారు. రాష్ట్ర ఆర్థిక పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.






