సోనియా పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన లేదెందుకు?: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఈ పాలనపై రైతులు, సామాన్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ‘ఈస్ట్‌మన్ కలర్’ సినిమా తరహాలో రంగుల మేనిఫెస్టోను చూపించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ప్రజల చేతిలో రిక్తహస్తం పెట్టిందని ఎద్దేవా చేశారు. అభయహస్తం అనేది ఈ శతాబ్దపు అతిపెద్ద రాజకీయ మోసమని, హామీలను గాలికొదిలేసి చివరి ఆరు నెలల్లో ఏదో ఒకటి చేసి మభ్యపెట్టాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడం తప్పుకాదు కానీ, రేవంత్ రెడ్డి పూర్తిగా ఒక బాడీగార్డ్ స్థాయికి దిగజారడం తెలంగాణ ఆత్మగౌరవానికి భంగకరమని అన్నారు. గతంలో రాహుల్ గాంధీని ముద్దపప్పు అని విమర్శించిన రేవంత్‌కు, నేడు ఆయనే ముద్దు కావడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమన్నారు. మరోవైపు బీజేపీలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రి వివేక్ బండి సంజయ్ వెంట పరుగులు తీయడం, సీనియర్ నేత రామచందర్ రావు అమిత్ షా కాళ్లు మొక్కడం చూస్తుంటే ఇక్కడి నేతలను ఢిల్లీ నాయకులు గులాంలుగా చూస్తున్నారని అర్థమవుతోందన్నారు.
తెలంగాణ నేడు అన్ని రంగాల్లో పతనం దిశగా వెళ్తుంటే, కేవలం అప్పులు, నేరాల రేటు మాత్రమే పెరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. గత మూడేళ్లలో ఆర్భాటంగా ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 7 వేల ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ సర్కార్ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
ప్రస్తుత కరువు పరిస్థితులు ప్రకృతి వల్ల కాకుండా పాలకుల వికృతి వల్లే వచ్చాయని కేటీఆర్ మండిపడ్డారు. 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పంకు నీళ్లు వెళ్తుంటే, 70 కిలోమీటర్ల దూరంలోని పాలమూరుకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. రాష్ట్రమంతా కరువుతో అల్లాడుతుంటే, ఒక్క కొడంగల్ నియోజకవర్గానికే రూ. 9 వేల కోట్లు కేటాయించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తాగునీటి కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని, మంత్రుల క్వార్టర్లకు నీళ్లు వస్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. కరువు వేళ కనీసం డీపీఆర్ కూడా లేకుండా మూసీ సుందరీకరణ పేరుతో టెండర్లు పిలవడం, హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించాల్సిన 10 టీఎంసీల నీటిని మూసీలో వదలడం తుగ్లక్ చర్య కాక మరేమిటని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 72 శాతం కాంట్రాక్టులు ఇస్తామన్న హామీని మూసీ టెండర్లలోనైనా అమలు చేస్తారో లేదో చూడాలన్నారు. ‘భారత్ సమ్మిట్’ పేరుతో వంద కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, మరి ఆమె రాసుకున్న పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో సృష్టించిన అనివార్యత వల్లే రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. అసెంబ్లీలో తనపై, ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి చిల్లర ఆరోపణలు చేశారని, ఆధారాలుంటే బయటపెట్టాలని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి పర్యటనలు నిధుల కేటాయింపు కోసం కాకుండా కేవలం తిట్ల కోసమే సాగుతున్నాయని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మారుస్తామంటూ ప్రభుత్వం లీకులు ఇస్తోందని, తాము తిరిగి అధికారంలోకి రాగానే ఆ పేర్లను యథావిధిగా పునరుద్ధరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టారని, కానీ తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న పాత, కొత్త ప్రాజెక్టులన్నింటి పేర్లనూ మారుస్తామని గట్టిగా హెచ్చరించారు. రీ ట్వీట్ చేసినందుకు 20 రోజులు జైల్లో పెట్టించి, ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు తమ వద్ద అభ్యర్థులు కోకొల్లలుగా ఉన్నారని తెలిపారు. ఈ నెలలో రానున్న ‘దీక్షా దివస్’ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో స్ఫూర్తి సభలు నిర్వహిస్తామని, కేసీఆర్ అరెస్టయిన అలుగునూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.







