మాజీ ప్రేయసి కోసం అంత పెద్ద డీలా? ఎన్విడియా కథలో భారీ ట్విస్ట్!
ఇదంతా ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ అనుకుంటే పొరబడినట్టే! ఎందుకంటే ఇక్కడ కథలో ఉన్నది ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా, దాని మాజీ బాస్ జెన్సన్ హువాంగ్, చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త.. వీళ్ల మధ్య తిరుగుతున్నది ఏకంగా ఎంతో విలువైన చిప్స్ బిజినెస్! అమెరికా ప్రభుత్వం చైనాకు ఏఐ చిప్స్ వెళ్లకుండా ఆంక్షలు పెడుతుంటే, మరోవైపు జెన్సన్ హువాంగ్ మాజీ ప్రేయసికి సంబంధం ఉన్న కంపెనీ ద్వారా చైనా సంస్థలకు భారీగా ఎన్విడియా చిప్స్ ఆర్డర్లు వెళ్లాయనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఎంత బిజినెస్ జరిగిందనే విషయం వచ్చేవరకూ ఈ మేటర్ సీరియస్ టర్న్ తీసుకోలేదు. ఓ చైనా స్పై అనుమానం, ఓ పెద్ద కంపెనీ బాస్ వ్యవహారంలా చూసిన వాళ్లు డీల్ మేటర్ బయిటకు వచ్చక ఆశ్చర్యపోతున్నారు.
ఎంత బిజినెస్ జరిగింది?
ఈ కథలో కీలకమైన పేరు మెగాస్పీడ్ (Megaspeed). ఆలిస్ హువాంగ్ అనే చైనా వ్యాపారవేత్తకు ఈ కంపెనీతో సంబంధం ఉంది. ఆమెకు ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌తో గతంలో వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ పేరు ఎందుకు ఇంతలా చర్చలోకి వచ్చిందంటే.. 2024 మార్చి నుంచి 2025 జూన్ మధ్య చైనా కంపెనీల కోసం దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన ఎన్విడియా ఏఐ చిప్స్ ఆర్డర్లను మెగాస్పీడ్ ఏర్పాటు చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పరిశీలించిన పత్రాలు వెల్లడించాయి. మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు రూ.1.08 లక్షల కోట్లు. ఆర్డర్లలో కొన్ని లక్షల అత్యాధునిక చిప్స్ ఉన్నట్లు నివేదిక చెబుతోంది. అయితే ఈ మొత్తం ఆర్డర్లలో ఎన్ని చిప్స్ నిజంగా చైనాకు చేరాయన్నది ఇంకా స్పష్టంగా తెలియదు.
అమెరికా నిషేధించిన చిప్స్ చైనాకు ఎలా వెళ్లాయి?
ఇక్కడే అసలు సినిమా మొదలవుతుంది. చైనా ఏఐ రంగంలో దూసుకెళ్తే..అది అమెరికాకు అది పెద్ద వ్యూహాత్మక సవాలు. అందుకే అత్యాధునిక కంప్యూటింగ్ చిప్స్ చైనాకు చేరకుండా అమెరికా ప్రభుత్వం ఎగుమతి ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా ఎన్విడియా తయారుచేసే శక్తివంతమైన ఏఐ చిప్స్ విషయంలో ఈ నియంత్రణలు చాలా కీలకం. కానీ చైనాకు కూడా ఈ చిప్స్ అవసరం భారీగానే ఉంది. ఏఐ మోడల్స్ తయారు చేయాలన్నా, డేటా సెంటర్లు నడపాలన్నా, సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యం పెంచుకోవాలన్నా ఇలాంటి చిప్స్ కావాల్సిందే. మరి నేరుగా కొనడం కష్టమైనప్పుడు మరో మార్గం వెతుక్కుంటున్నారా? ఇప్పుడు మెగాస్పీడ్ వ్యవహారంతో తెరపైకి వచ్చిన విషయం ఇదే.
ఎన్విడియా పార్ట్నర్ హోదా.. గేమ్ ఛేంజర్ అయిందా?
మెగాస్పీడ్కు ఎన్విడియాతో క్లౌడ్ పార్ట్నర్షిప్ ఉంది. అంటే ఎన్విడియా చిప్స్‌ను ఉపయోగించి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించే భాగస్వామ్య సంస్థల్లో ఇది కూడా ఒకటి. మార్కెట్లో ఏఐ చిప్స్ కోసం కంపెనీలు క్యూ కడుతున్న సమయంలో, ఎన్విడియా క్లౌడ్ పార్ట్నర్గా ఉండటం వల్ల మెగాస్పీడ్కు చిప్స్ లభ్యతలో ప్రత్యేక అవకాశం దక్కినట్లు రిపోర్ట్ లు సూచిస్తున్నాయి. దీనికి తోడు చైనాకు చెందిన టెక్ దిగ్గజం అలీబాబా ఈ కంపెనీకి ప్రధాన క్లయింట్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ వ్యాపార సంబంధాల వల్లే చైనా కంపెనీలకు అవసరమైన చిప్స్ ఆర్డర్లను మెగాస్పీడ్ ఏర్పాటు చేయగలిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే అమెరికా నేరుగా చిప్స్ అమ్మకాలను నియంత్రిస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లౌడ్ కంపెనీల వ్యాపార మార్గాలు మరో దారిని తెరిచాయా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఎన్విడియా చైనా బిజినెస్ మనం అనుకున్నదానికంటే పెద్దదా?
ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ లెక్క ఉంది. ఎన్విడియా అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరు నెలల్లో చైనా మార్కెట్ నుంచి 12.4 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 7 శాతం మాత్రమే. కానీ కల్పర్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లింగ్ సంస్థ మాత్రం ఎన్విడియా గత ఆర్థిక సంవత్సర ఆదాయంలో 20 శాతానికి పైగా చైనా కస్టమర్ల నుంచే వచ్చి ఉండవచ్చని అంచనా వేసింది.
ఈ రెండు లెక్కల మధ్య ఇంత తేడా ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. నేరుగా ఎన్విడియా నుంచి కొనకపోయినా, ఇతర కంపెనీలు లేదా క్లౌడ్ సేవల ద్వారా చైనా సంస్థలు ఈ చిప్స్‌ను ఉపయోగిస్తున్నాయా? అలా జరిగితే అధికారిక అమ్మకాల లెక్కల్లో కనిపించని భారీ వ్యాపారం వెనుక ఉండే అవకాశం ఉందా? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఆలిస్ హువాంగ్ తప్పుకున్నా.. వివాదం మాత్రం తగ్గలేదు!
ఈ ఆరోపణలపై మెగాస్పీడ్ రాయిటర్స్‌కు వివరణ ఇచ్చింది. ఆలిస్ హువాంగ్ 2025 ఆగస్టు 30నే కంపెనీ నుంచి తప్పుకున్నారని, ప్రస్తుతం ఆమెకు సంస్థలో ఎలాంటి బాధ్యతలు లేవని తెలిపింది. అయితే అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ C4ADS ప్రకారం, 2023 మార్చిలో ఆమె మెగాస్పీడ్లో నియంత్రణ వాటాదారుగా మారారు. తమ వ్యాపారమంతా చట్టబద్ధంగానే జరిగిందని, ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ కోసం బయటి న్యాయ నిపుణులను నియమించామని కంపెనీ చెబుతోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు, చైనా కస్టమర్లకు అమెరికా ఎగుమతి ఆంక్షలకు లోబడి ఉన్న ఎన్విడియా చిప్స్ చేరడంలో మెగాస్పీడ్ పాత్ర ఉందా అనే అంశంపై గతంలోనే విచారణ మొదలైనట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచార సంస్థతో సంబంధాలు కలిగి ఉండవచ్చనే ప్రచారం కూడా ఉంది. అయితే ఆమె చైనా గూఢచారి అన్నది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఇది కేవలం ఓ లవ్ స్టోరీ కాదు.. ఏఐ ప్రపంచంలో పెద్ద గేమ్!
ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఓ విషయం అర్థమవుతుంది. ఏఐ ప్రపంచంలో చిప్స్ అంటే కేవలం కంప్యూటర్ పార్ట్స్ కాదు. ఎవరి దగ్గర అత్యంత శక్తివంతమైన చిప్స్ ఉంటాయో వాళ్లకే భవిష్యత్తు టెక్నాలజీ రేసులో ఆధిక్యం దక్కుతుంది. అందుకే అమెరికా… చైనాకు చిప్స్ వెళ్లకుండా అడ్డుకోవాలని చూస్తోంది. కానీ అదే సమయంలో అమెరికా కంపెనీల వ్యాపార ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈ రెండింటి మధ్యే అసలు సంఘర్షణ నడుస్తోంది. ఇప్పుడు మెగాస్పీడ్ వ్యవహారం బయటకు రావడంతో అమెరికా ఎగుమతి ఆంక్షలు ఎంతవరకు పనిచేస్తున్నాయి? వాటిని దాటుకుని చైనాకు చిప్స్ చేరుతున్నాయా? అనే ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.
మొత్తానికి…
ఓ మాజీ సీఈఓ వ్యక్తిగత సంబంధాల చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు రూ.లక్ష కోట్ల చిప్స్ వ్యాపారం, చైనా గూఢచర్య అనుమానాలు, అమెరికా జాతీయ భద్రత వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో నిజంగా ఏం జరిగింది? ఎన్విడియాకు ఈ పరోక్ష వ్యాపారం గురించి ఎంత తెలుసు? జెన్సన్ హువాంగ్ పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే ప్రపంచ ఏఐ వ్యాపారంలో ఇప్పటివరకు బయటపడని మరో పెద్ద కోణం వెలుగులోకి రావచ్చు.
— సూర్య ప్రకాశ్ జోశ్యుల







