ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు చూడబోతున్నామా?
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, ప్రముఖ వ్యాపారవేత్తలపై అక్రమంగా నిఘా పెట్టారన్న ఆరోపణలపై సాగుతున్న సిట్ విచారణ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. తన ఫోన్‌ను ట్యాప్ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానిస్తూనే, విచారణ ముగింపు దశలో ఉందని, త్వరలోనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని సీఎం సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
బదిలీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్ అధికారులు ఇప్పటికే పలువురు కీలక రాజకీయ నాయకులు, బాధితులు, నిందితుల వాంగ్మూలాలను నమోదు చేసి తుది చార్జిషీట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సజ్జనార్ బదిలీతో దర్యాప్తు వేగం తగ్గుతుందన్న ఊహాగానాలకు తెరదించుతూ, విచారణ పక్కాగా సాగుతోందని అధికార కాంగ్రెస్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు తదితరుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఇప్పటికే కీలక వివరాలు సేకరించింది.
అయితే ఈ వ్యవహారంలో రాజకీయ వేడి ఎంతగా ఉన్నప్పటికీ, న్యాయస్థానంలో నేరాన్ని నిరూపించడంలో దర్యాప్తు సంస్థలకు పెను సాంకేతిక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సైబర్ భద్రతా నిపుణులు, న్యాయకోవిదులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా, ఈ కేసులో బాధితులుగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మాజీ మంత్రులు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు అత్యంత కట్టుదిట్టమైన ఎన్క్రిప్షన్ భద్రత కలిగిన ‘యాపిల్ ఐఫోన్’లను వినియోగిస్తుంటారు. సాధారణ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లను టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ట్యాప్ చేయడం సులభమే అయినా, వాట్సాప్, ఫేస్‌టైమ్, ఐమెసేజ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ మాధ్యమాల ద్వారా ఐఫోన్లలో జరిగే సంభాషణలను సాధారణ సాఫ్ట్వేర్లతో హ్యాక్ చేయడం సాధ్యం కాదు.
ఇవి కూడా చదవండి
ఇక్కడే అసలైన సాంకేతిక చిక్కుముడి ఏర్పడింది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ వంటి అత్యున్నత మిలిటరీ గ్రేడ్ స్పైవేర్‌ను వినియోగించి ఉంటే తప్ప ఐఫోన్ల డేటాను తస్కరించడం అసాధ్యమని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిందితులు ఆధారాలను చెరిపేసే క్రమంలో ఎస్ఐబీ కార్యాలయంలోని కీలక హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలైన సర్వర్ లాగ్స్, టెలికాం సంస్థల సాంకేతిక ఆధారాలు లేదా స్పైవేర్ వినియోగించిన జాడలు స్పష్టంగా లేకుండా, కేవలం నిందితులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఐఫోన్ ట్యాపింగ్ జరిగిందని కోర్టులో నిరూపించడం సిట్ అధికారులకు కత్తిమీద సాములా మారనుంది.
భారత సాక్ష్యాధారాల చట్టం ప్రకారం, పోలీసుల విచారణలో నిందితులు ఇచ్చే వాంగ్మూలాలకు నేరుగా న్యాయస్థానంలో విలువ ఉండదు. వాటిని బలపరిచే బలమైన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తప్పనిసరి. సాంకేతిక ఆధారాలు బలహీనంగా ఉంటే ట్రయల్ సమయంలో కేసు నిలబడటం కష్టమవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే, సిట్ అధికారులు విదేశీ టెక్నాలజీ నిపుణుల సాయంతో ధ్వంసమైన హార్డ్ డిస్క్‌ల నుంచి డేటాను రికవరీ చేయడంతో పాటు, ఇజ్రాయెల్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన నిఘా పరికరాల ఇన్వాయిస్లు, విదేశీ సర్వర్ల లాగ్స్‌ను సేకరించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం.
మరోవైపు సాంకేతిక చిక్కులు ఎలా ఉన్నా, రాజకీయంగా మాత్రం ఈ కేసును తుది అంకానికి తీసుకెళ్లడం ద్వారా గత పాలకులను ఇరకాటంలో పెట్టాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ అక్రమ నిఘా సాగిందన్న కోణంలో కీలక నేతలకు నోటీసులు జారీ చేయడం లేదా సప్లిమెంటరీ చార్జిషీట్లో పెద్ద తలకాయల పేర్లను చేర్చడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి, సిట్ దాఖలు చేయబోయే తుది చార్జిషీట్లో కేవలం పోలీసు అధికారుల పాత్రే పరిమితమవుతుందా లేక గత పాలకుల ప్రమేయంపై బలమైన సాంకేతిక ఆధారాలను బయటపెట్టి సంచలనం సృష్టిస్తారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.







