మరో ఐదేళ్లలో ఇంటర్నెట్ ఇంతలా మారిపోతుందా? మస్క్ షాకింగ్ వార్నింగ్
ఇన్నాళ్లూ మనం ఇంటర్నెట్లో ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్‌లో వెతుక్కుంటున్నాం. ఒక వెబ్సైట్ నుంచి మరో వెబ్‌సైట్‌కు వెళ్తున్నాం. షాపింగ్ చేయాలన్నా, టికెట్ బుక్ చేయాలన్నా, ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా మనమే స్వయంగా చేసుకుంటున్నాం. అయితే ఇప్పుు మొత్తం మారిపోతోంది మెల్లిమెల్లిగా మనం చేయాల్సిన పనులను AIకి వెళ్లిపోతున్నాయి. ఏవో చిన్న చిన్న పనులే కదా ఏఐ చేస్తోంది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే.సిట్యువేషన్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తోంది. మన తరఫున AI ఏజెంట్లే ఇంటర్నెట్ మొత్తం తిరిగి, వెతికి మనకు కావాల్సిన పనులు పూర్తి చేసే రోజులు రాబోతున్నాయి. ఈ క్రమంలో జరిగే పరిణామం ఎలా ఉండబోతోంది. అసలు అప్పుడు ఇంటర్నెట్ను ఉపయోగించేది మనుషులా? AIలేనా? ఈ ప్రశ్నకు టెక్ ప్రపంచంలో సంచలనం కలిగించే సమాధానం ఇచ్చారు ఎలాన్ మస్క్.
మరో ఐదేళ్లలో ఇంటర్నెట్లో AI ఏజెంట్ల ద్వారా వచ్చే ట్రాఫిక్, మనుషుల ద్వారా వచ్చే ట్రాఫిక్ కంటే ఏకంగా 1,000 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మార్పు ఇప్పుడే మొదలైందని, ఇప్పటికే కొన్ని గణాంకాల్లో AI ఆధారిత ట్రాఫిక్ మనుషులను దాటేసిందని మస్క్ చెబుతున్నారు. క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) సంస్థ అంచనాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఐదేళ్లలో వెయ్యి రెట్లు పెరుగుతుందన్న అంచనా కూడా తక్కువేనని మస్క్ అభిప్రాయపడటం ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది.
మనం ఐదు వెబ్సైట్లు చూస్తే.. AI ఏజెంట్ ఐదు వేల సైట్లు చూస్తుంది!
ఇదంతా అర్థం కావాలంటే AI ఏజెంట్లు ఎలా పనిచేస్తాయో చూడాలి. ఇప్పటివరకు మనం ఇంటర్నెట్ను ఉపయోగించిన విధానానికి, AI ఏజెంట్లు ఉపయోగించే విధానానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు మనం ఒక కెమెరా కొనాలనుకున్నారనుకుందాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలోకి వెళ్లి నాలుగైదు మోడళ్లను చూస్తాం. వాటి ధరలు, ఫీచర్లు, రివ్యూలు పోల్చుకుని ఒక నిర్ణయానికి వస్తాం. ఈ మొత్తం పని చేయడానికి మనకు కొంత సమయం పడుతుంది.
కానీ ఇదే పనిని ఒక AI ఏజెంట్‌కు అప్పగిస్తే అది మన కోసం వేలాది వెబ్సైట్లను పరిశీలించగలదు. ధరలు ఎక్కడ తక్కువగా ఉన్నాయి? ఏ సైట్లో మంచి ఆఫర్ ఉంది? ఏ మోడల్‌కు ఎక్కువ రేటింగ్ ఉంది? ఇలా ప్రతి అంశాన్ని వెతికి మన ముందుంచుతుంది. మనం ఒకసారి అడిగితే చాలు.. మన తరఫున అది వందల, వేల వెబ్ రిక్వెస్టులు పంపగలదు. ఇప్పుడు ఇలాంటి పనులను లక్షలాది మంది తమ AI ఏజెంట్లకు అప్పగిస్తే ఇంటర్నెట్పై ఎంత ట్రాఫిక్ పెరుగుతుందో ఊహించుకోవచ్చు.
అందుకే AI ఏజెంట్ల వినియోగం పెరిగే కొద్దీ ఇంటర్నెట్లో మెషిన్ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటికే మనుషులను దాటేశాయా బాట్స్?
మస్క్ వ్యాఖ్యల్లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. AI ఏజెంట్ల ట్రాఫిక్ భవిష్యత్తులో మనుషులను దాటేస్తుందని ఆయన చెప్పడం లేదు. ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. క్లౌడ్‌ఫ్లేర్ రాడార్ గణాంకాల ప్రకారం, జూన్‌లో నమోదైన HTTP రిక్వెస్టుల్లో బాట్స్ వాటా సుమారు 57.5 శాతానికి చేరుకుంది. మనుషుల నుంచి వచ్చిన రిక్వెస్టుల వాటా 42.5 శాతంగా ఉంది. అంటే వెబ్సైట్లను యాక్సెస్ చేసే విషయంలో ఆటోమేటెడ్ వ్యవస్థలు ఇప్పటికే ముందంజలోకి వచ్చాయి.
నిజానికి ఈ మార్పు 2027 నాటికి వస్తుందని క్లౌడ్‌ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ గతంలో అంచనా వేశారు. కానీ అనుకున్న సమయానికి ముందే ఈ పరిస్థితి కనిపించింది. మరోవైపు హ్యూమన్ సెక్యూరిటీ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నివేదిక ప్రకారం, 2025లో AI ఏజెంట్లు, ఏజెంటిక్ బ్రౌజర్ల నుంచి వచ్చిన ట్రాఫిక్ ఏకంగా 7,851 శాతం పెరిగింది. ఈ సంఖ్య చూస్తే AI వినియోగం ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థమవుతుంది.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. బాట్స్ అన్నీ AI ఏజెంట్లు కావు. వెబ్సైట్లను స్కాన్ చేసే సాధారణ ఆటోమేటెడ్ ప్రోగ్రామ్‌లు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మొత్తం బాట్ ట్రాఫిక్‌ను AI ఏజెంట్ల ట్రాఫిక్‌గా భావించకూడదు.
వెబ్సైట్లను మనుషుల కోసం కాకుండా AI కోసం మార్చుకోవాల్సిన రోజులు!
ఈ మార్పు వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యేది ఆన్లైన్ వ్యాపారాలే కావచ్చు. ఇప్పటివరకు ఒక వెబ్‌సైట్‌కు ఎంతమంది వచ్చారు? ఎంతసేపు ఉన్నారు? ఎన్ని పేజీలు చూశారు? ఎంతమంది కొనుగోలు చేశారు? అనే లెక్కలతో వ్యాపారాలు తమ విజయాన్ని అంచనా వేసేవి. కానీ రేపు ఒక వెబ్‌సైట్‌కు లక్షలాది విజిట్స్ వచ్చాయని అనుకుందాం. వాటిలో ఎక్కువ భాగం మనుషులవి కాకుండా AI ఏజెంట్లవే అయితే ఆ ట్రాఫిక్ వల్ల వ్యాపారానికి ఏ మేరకు ప్రయోజనం కలిగిందో చెప్పడం కష్టమవుతుంది.
ఇంకో చెప్పుకోదగ్గ మార్పు కూడా వస్తోంది. వెబ్సైట్లు తమ సమాచారాన్ని మనుషులు చదివేందుకు మాత్రమే కాకుండా AI ఏజెంట్లు సులభంగా అర్థం చేసుకునేలా కూడా అందించాల్సి వస్తోంది. ఈ దిశగా క్లౌడ్‌ఫ్లేర్ ‘Markdown for Agents’ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వెబ్పేజీల్లోని సమాచారాన్ని AI వ్యవస్థలు సులభంగా చదివేలా తక్కువ డేటాతో అందించవచ్చు. అంతేకాదు, AI ఏజెంట్లు వెబ్సైట్లలోని సమాచారాన్ని ఉపయోగించుకున్నప్పుడు వాటి నుంచి ఛార్జీలు వసూలు చేసే అవకాశాలపైనా సంస్థ పనిచేస్తోంది.
అంటే భవిష్యత్తులో వెబ్సైట్ యజమానులు కేవలం మనుషుల విజిట్స్ గురించే ఆలోచిస్తే సరిపోదు. తమ సమాచారాన్ని AI ఏజెంట్లు ఎలా ఉపయోగించుకుంటున్నాయో కూడా పట్టించుకోవాల్సి వస్తుంది.
బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదా?
మస్క్ ఆలోచన ఇంతటితో ఆగడం లేదు. భవిష్యత్తులో మనుషులు బ్రౌజర్లు ఓపెన్ చేసి, వెబ్సైట్లలో వెతికి, ఒక్కో పని చేసుకుంటూ వెళ్లే అవసరం తగ్గిపోవచ్చని ఆయన భావిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత AI ఏజెంట్ ఉంటుంది. అది మన అవసరాలను అర్థం చేసుకుని ఇతర AI ఏజెంట్లతో మాట్లాడుతుంది. మన తరఫున పనులు పూర్తి చేస్తుంది.
ఉదాహరణకు మీరు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లడానికి విమాన టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే.. ఇప్పటిలా పది వెబ్సైట్లు తెరిచి ధరలు పోల్చుకోవాల్సిన పని ఉండకపోవచ్చు. మీ ప్రయాణ తేదీలు, బడ్జెట్, ప్రాధాన్యతలు చెబితే చాలు. మీ AI ఏజెంట్ వివిధ విమానయాన సంస్థల వివరాలు పరిశీలించి, తగిన విమానాలను సూచిస్తుంది. ఇదే తరహాలో హోటల్ బుకింగ్స్, షాపింగ్, బ్యాంకింగ్, వ్యాపార లావాదేవీలు కూడా AI ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లొచ్చు.
మస్క్‌కు చెందిన xAI కూడా ఇలాంటి భవిష్యత్తు కోసమే ప్రయత్నిస్తోంది. ‘Macrohard’ పేరుతో మనిషి కంప్యూటర్‌పై చేసే డిజిటల్ పనులను AI ద్వారా చేయించే ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. కీబోర్డ్, మౌస్ ఉపయోగిస్తూ మనిషిలా కంప్యూటర్ను ఆపరేట్ చేయగల AI వ్యవస్థలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.
ఇవి కూడా చదవండి
ఇంటర్నెట్లో మనుషులు మిగిలేది చిన్న భాగమేనా?
అయితే మరో ఐదేళ్లలో AI ట్రాఫిక్ మనుషుల ట్రాఫిక్ కంటే వెయ్యి రెట్లు పెరుగుతుందన్నది ప్రస్తుత ధోరణుల ఆధారంగా చేసిన అంచనా మాత్రమే. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. క్లౌడ్‌ఫ్లేర్ సంస్థ కూడా గతంలో ఇలాంటి మార్పుల వేగాన్ని అంచనా వేయడంలో పొరపాట్లు జరిగాయని అంగీకరించింది.
అలాగే ఇక్కడ లెక్కిస్తున్నది ఇంటర్నెట్ రిక్వెస్టుల సంఖ్య మాత్రమే. ఉదాహరణకు ఒక AI ఏజెంట్ వేలాది వెబ్‌పేజీలను పరిశీలిస్తే వేల రిక్వెస్టులు నమోదవుతాయి. కానీ దానర్థం వేల మంది AI వినియోగదారులు ఉన్నారని కాదు. కాబట్టి ట్రాఫిక్ సంఖ్యను, AIని ఉపయోగిస్తున్న మనుషుల సంఖ్యతో కలిపి చూడకూడదు.
ఏదైమైనా…
మనుషులే ఇంటర్నెట్లో వెతికేవారు. ఇప్పుడు మనుషుల తరఫున AI వెతుకుతోంది. రేపు ఒక AI మరో AIతో మాట్లాడి, మనకు తెలియకుండానే ఎన్నో పనులు పూర్తి చేయవచ్చు. అప్పుడు మనం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నామా? లేక మన తరఫున AIలు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నాయా? అన్నదే అసలు ప్రశ్న. ఇంటర్నెట్లో మనుషుల సంఖ్య తగ్గకపోయినా.. మనుషుల కంటే యంత్రాల సందడే వెయ్యి రెట్లు ఎక్కువయ్యే ప్రపంచం నిజంగానే రాబోతోందేమో!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







