పాక్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ.. కుర్రాళ్ల ఆటకు గంభీర్ ఫిదా..!
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై(Ind vs Pak) భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది పోరులో టీమిండియా ఒక్క వికెట్ తేడాతో ఘనవిజయం సాధించి, రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. భారత కుర్రాళ్ల అద్భుత పోరాట పటిమపై భారత సీనియర్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు. గంభీర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఒక దశలో వరుసగా వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. 42వ ఓవర్లో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మనల్ చౌహాన్ (47), మోహిత్ ఉల్వా (49 నాటౌట్)(Mohit ulva) అసమాన పోరాటంతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. చివరి బంతికి మోహిత్ ఉల్వా అద్భుతమైన బౌండరీ బాది భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ థ్రిల్లింగ్ విక్టరీపై గౌతమ్ గంభీర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ భారత జట్టు ఆటతీరును కొనియాడారు.
ఇవి కూడా చదవండి
భయంలేని క్రికెట్, చెక్కుచెదరని నమ్మకం, పట్టుదలకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండదు అంటూ గంభీర్ చేసిన పోస్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఈ టోర్నీ ఆసాంతం అద్భుత ఫామ్ కనబరిచిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఫైనల్లో కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని (80)తో కలిసి ఆర్యవీర్ 17.4 ఓవర్లలోనే 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌కు బలమైన పునాది వేశాడు. ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్‌లలో 90.25 సగటుతో ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీల సాయంతో 361 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో లక్ష్యాన్ని ఛేదించగలమనే నమ్మకం మొదటి నుంచీ తమ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉందని ఆర్యవీర్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.







