దూసుకొస్తున్న అక్వాన్ తీవ్ర తుపాను..!
ఇటీవల సంభవించిన అర్నాబ్, మురసు తుపానుల నష్టం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే రాష్ట్రానికి మరో పెను తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ రానున్న మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి సుమారు 860 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 1,040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
సముద్రంలో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ వ్యవస్థ వేగంగా బలపడుతోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా రూపాంతరం చెందనుంది. ఈ తుపానుకు ఇరాన్(Iran) సూచించిన ‘అక్వాన్'(Cyclone) అనే పేరును ఖరారు చేశారు. తుపానుగా మారిన తర్వాత ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత ఉగ్రరూపం దాల్చనుంది. ఈ నెల 18వ తేదీ ఉదయానికి బంగాళాఖాతంలో ‘తీవ్ర తుపాను’గా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.
ఇవి కూడా చదవండి
సముద్రం పైనే దీని తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుని, గంటకు 95 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్ర తుపాను ప్రభావంతో ఈ నెల 18, 19 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
తుపాను ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై సోమవారం నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన వారు తక్షణమే సురక్షిత తీరాలకు తిరిగి రావాలని సూచించారు. మరోవైపు వరుస తుపానుల నేపథ్యంలో వరి కోతల దశలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోసిన పంటను తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.







