గుంటూరు హెచ్‌పీ బంకుల్లో ఆగని కల్తీ దందా..!
గుంటూరు(Guntur) నగరంలోని హెచ్‌పీ(HP) పెట్రోల్ బంకుల్లో వరుసగా వెలుగుచూస్తున్న కల్తీ, కొలతల మోసాలు వాహనదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే నగరంలోని చుట్టుగుంట వీఐపీ రోడ్డులో ఉన్న ఒక హెచ్‌పీ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయిన ఘటన మరువకముందే, తాజాగా మరో బంకులో భారీ మోసం బట్టబయలైంది. ఏటుకూరు జంక్షన్ వద్ద ఉన్న ఎన్‌హెచ్-16 హైవే సర్వీస్ రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఇంధన కల్తీతో పాటు కొలతల్లోనూ భారీ కోత విధిస్తున్న వ్యవహారం కలకలం రేపుతోంది.
ఈ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా రూ.110 చెల్లిస్తే ప్రస్తుత ధరల ప్రకారం సుమారు 940 మిల్లీలీటర్ల పెట్రోల్ రావాల్సి ఉండగా, ఈ బంకులో కేవలం 750 మిల్లీలీటర్లు మాత్రమే వచ్చినట్లు బాధితులు గుర్తించారు. అంటే ఒక్కో వంద రూపాయల కొనుగోలుపైనే దాదాపు 190 మిల్లీలీటర్ల మేర కోత విధిస్తూ వినియోగదారులను నిలువునా దోచుకుంటున్నారు. అటు ఇంధనం నాణ్యతలో కల్తీకి పాల్పడటం, ఇటు యంత్రాలలో మాయాజాలం చేస్తూ కొలతల్లో కోత పెట్టడంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కల్తీ పెట్రోల్ పోయడం వల్ల ఖరీదైన బైకులు, కార్ల ఇంజిన్లు త్వరగా దెబ్బతింటున్నాయని, మరమ్మతుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారి పక్కనే ఇలాంటి దందా జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
గుంటూరులో వరుసగా హెచ్‌పీ బంకులపైనే ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆయిల్ కంపెనీ ప్రతినిధుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూనికలు, కొలతల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఏటుకూరు హైవే బంకుతో పాటు నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీకి, కొలతల మోసాలకు పాల్పడుతున్న సదరు బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, లైసెన్సులను రద్దు చేయాలని కోరుతున్నారు.







