పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ అడుగులు..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కాగిత రహితంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఒకే దేశం – ఒకే అప్లికేషన్ నినాదంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA)ను ఏపీ అసెంబ్లీలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలను నేరుగా ఈ పోర్టల్‌కు అనుసంధానం చేయనున్నారు.
సభలో ప్రవేశపెట్టే బిల్లులు, సభ్యులు అడిగే ప్రశ్నలు, వివిధ నోటీసులకు ఆయా శాఖల నుంచి వేగంగా, పారదర్శకంగా సమాధానాలు పంపే విధానంపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. అమరావతిలోని ఏపీ శాసనసభ కమిటీ హాల్ నంబర్ 2లో ఈ తరగతులను నిర్వహించేందుకు అసెంబ్లీ(Ap Assembly) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విడతల వారీగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా, నవంబర్ 18వ తేదీన ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తొలి విడత శిక్షణ జరగనుంది.
ఈ మొదటి సెషన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల పీఎస్‌లతో పాటు వ్యవసాయం, ఐటీ, విద్య, మైనింగ్ శాఖల మంత్రుల పీఎస్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. డిజిటల్ విధానంలో పత్రాలను ఎలా అప్లోడ్ చేయాలి, సభా కార్యకలాపాలను వెంటనే ఎలా సమన్వయం చేసుకోవాలి అనే అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి రావడం వల్ల శాసనసభ సమావేశాల నిర్వహణలో కాగితాల వినియోగం పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా, సమయం ఆదా అవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వద్ద ఉన్న ట్యాబ్‌లు లేదా మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సభా పత్రాలను సులభంగా చూసుకునే వెసులుబాటు కలుగుతుంది. పాలనలో పారదర్శకతను పెంచేందుకు ఈ డిజిటల్ వేదిక ఎంతగానో ఉపయోగపడనుందని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి.







