నార్త్ అమెరికా లో ‘రామాయణ’ రికార్డ్: RRR, పుష్ప 2, జవాన్లను వెనక్కి నెట్టి టాప్-6లోకి!
రీసెంట్ గా రిలీజైన ‘రామాయణ’ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఆరో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో RRR, పుష్ప 2, జవాన్, యానిమల్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలను వెనక్కి నెట్టింది. ముఖ్యంగా తొలి వారం కూడా పూర్తికాకముందే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ‘రామాయణ’ సుమారు 15.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.138 కోట్లకు పైమాటే. Venky Box Office ట్రాకింగ్ ప్రకారం, సోమవారం నాటికి ఈ సినిమా వసూళ్లు 13.64 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మంగళవారం మరో 1.85 నుంచి 1.90 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం వసూళ్లు 15.49 నుంచి 15.54 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. తుది లెక్కల్లో మార్పులు ఉండవచ్చు.
నార్త్ అమెరికాలో నాలుగు భారీ సినిమాలను వెనక్కి నెట్టిన రామాయణ
నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ప్రస్తుతం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి 2, ధురంధర్, కల్కి 2898 ఏడీ, పఠాన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆరో స్థానంలోకి వచ్చిన రామాయణకు మరో రెండు సినిమాలను దాటే అవకాశం ఉంది.
ర్యాంక్ సినిమా నార్త్ అమెరికా వసూళ్లు
1 ధురంధర్ 2: ది రివెంజ్ $28.60M
2 బాహుబలి 2 $20.77M
3 ధురంధర్ $20.67M
4 కల్కి 2898 ఏడీ $18.57M
5 పఠాన్ $17.49M
6 రామాయణ $15.50M+
7 RRR $15.34M
8 పుష్ప 2 $15.28M
9 జవాన్ $15.23M
10 యానిమల్ $15.01M
ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న పఠాన్ వసూళ్లు 17.49 మిలియన్ డాలర్లు. అంటే రామాయణ మరో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తే పఠాన్‌ను కూడా వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకోవచ్చు. అంతేకాదు, రెండో వారాంతం ఇంకా మిగిలే ఉండటంతో ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆరు రోజుల్లోనే $15 మిలియన్లు.. రామాయణ వసూళ్ల ప్రయాణం ఇదీ!
రామాయణకు నార్త్ అమెరికాలో వచ్చిన వసూళ్లు ఒక్క రోజులో వచ్చినవి కావు. ప్రీమియర్ల నుంచే మంచి ఆరంభం లభించగా, వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగాయి. ముఖ్యంగా శనివారం వసూళ్లు ఈ సినిమా బాక్సాఫీస్ పరుగుకు బలమైన ఊపునిచ్చాయి.
ఇవి కూడా చదవండి
Venky Box Office గణాంకాల ప్రకారం.. ప్రీమియర్లు, మొదటి రోజు కలిపి 3.39 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఇందులో ఒక్క ప్రీమియర్ల నుంచే సుమారు 1.9 మిలియన్ డాలర్లు రావడం విశేషం. శనివారం ఏకంగా 3.76 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఆదివారం కూడా 2.66 మిలియన్ డాలర్లతో మంచి వసూళ్లను కొనసాగించింది.
వీకెండ్ ముగిసిన తర్వాత కూడా వసూళ్లు గణనీయంగా తగ్గకపోవడం ఈ సినిమా బాక్సాఫీస్ బలాన్ని సూచిస్తోంది. సాధారణంగా భారీ సినిమాలకు వీకెండ్ తర్వాత వసూళ్లలో తగ్గుదల కనిపిస్తుంది. కానీ రామాయణ విషయంలో వర్కింగ్ డేస్‌లోనూ మంచి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది.
ధురంధర్ 2 రికార్డుపై రామాయణ కన్ను?
నార్త్ అమెరికాలో రామాయణకు వస్తున్న స్పందన చూస్తుంటే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించే దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా, కెనడా మార్కెట్లు సినిమాకు బలమైన ఆదాయ వనరుగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న వసూళ్లు ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ లెక్కల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
ప్రస్తుతం నార్త్ అమెరికాలో రామాయణ ముందున్న లక్ష్యం పఠాన్‌ను దాటి టాప్-5లోకి ప్రవేశించడం. ఆ తర్వాత కల్కి 2898 ఏడీ, ధురంధర్ సినిమాల వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. అయితే ధురంధర్ 2 సాధించిన 28.60 మిలియన్ డాలర్ల రికార్డు మాత్రం చాలా దూరంలోనే ఉంది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ 2 సాధించిన వసూళ్లను అధిగమించడంతో పాటు రూ.2,000 కోట్ల మార్కును అందుకోవాలన్న భారీ లక్ష్యం కూడా రామాయణ ముందుంది. రెండో వారాంతంలో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందన్న దానిపైనే ఈ రికార్డుల వేట ఆధారపడి ఉంటుంది. తొలి ఆరు రోజుల్లోనే RRR, పుష్ప 2, జవాన్లను దాటిన రామాయణ.. చివరకు భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకుంటుందో చూడాలి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







