వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వల్లే ‘మీడియా’ గోల!?
తెలంగాణ కాంగ్రెస్‌లో మీడియా విభాగం నియామకాల వ్యవహారం ఒక్కసారిగా రాజకీయ వేడిని రాజేసింది. పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టుల జాబితా విడుదలైన 24 గంటల్లోనే నిలిపివేతకు గురికావడం గాంధీభవన్ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మీడియా విభాగం చైర్మన్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరు వల్లే ఈ గందరగోళం తలెత్తిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, బయటకు మాత్రం ఇద్దరు నేతలు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతూ నష్టనివారణ చర్యలకు దిగారు.
నవంబర్ 9న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 16 మంది మీడియా ప్యానెలిస్టులు, నలుగురు మీడియా కో-ఆర్డినేటర్లు, 49 మంది అధికార ప్రతినిధులతో కూడిన జాబితాను విడుదల చేశారు. పాత అధికార ప్రతినిధులందరికీ సీనియర్ అధికార ప్రతినిధులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరిగాయని చామల ప్రకటించారు. కానీ, మరుసటి రోజే పార్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఈ ఉత్తర్వులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి
ఈ నియామకాల వెనుక పెద్ద ఎత్తున అంతర్గత రాజకీయాలు నడిచినట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూలలో సిఫార్సు చేసిన వారిలో 10 శాతం మందికి కూడా తుది జాబితాలో చోటు దక్కలేదని, తిరస్కరణకు గురైన వారికి పదవులు కట్టబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సంస్థాగతంగా పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని, కొందరు జూనియర్లకు, ముఖ్యనేతల అనుచరులకు రాత్రికిరాత్రే జాబితాలో చోటు కల్పించారనే విమర్శలు వచ్చాయి. తనకు పూర్తి సమాచారం లేకుండా, ఆమోదించిన జాబితాలో మార్పులు చేసి విడుదల చేయడంపై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన రాహుల్ గాంధీ, పవన్ ఖేరా దృష్టికి తీసుకెళ్లడంతో, అధిష్టానం సూచనల మేరకే జాబితాపై బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.
పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయంటూ మీడియాలో కథనాలు రావడంతో ఇద్దరు నేతలు రంగంలోకి దిగి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని మీడియా విభాగం బాధ్యతలకు తానే ఎంపిక చేశానని, ఆయన సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, కేవలం సాంకేతిక కారణాల వల్లే జాబితాను తాత్కాలికంగా నిలిపివేశామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీనిని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. జాబితాను రద్దు చేయలేదని, మరికొన్ని పేర్లను జోడించి రెండు మూడు రోజుల్లో సవరించిన పూర్తిస్థాయి జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు తమకు సమాచారం లేకుండా నియామకాలు జరిగాయని అభద్రతాభావంతో అభ్యంతరాలు వ్యక్తం చేశారని, పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇస్తుంటే అడ్డుపడవద్దని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్న పార్టీకి మీడియా విభాగం అత్యంత కీలకం. ప్రభుత్వ పథకాలను సమర్థించుకోవడానికి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి బలమైన వాయిస్ అవసరం. అయితే పదవుల పంపకంలో సమన్వయ లోపం, వర్గ ప్రయోజనాలు తెరపైకి రావడం వల్ల పార్టీ ప్రతిష్టకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. పైకి అంతా సవ్యంగానే ఉందని నేతలు చెబుతున్నా, రాబోయే సవరించిన జాబితాలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతుందనేది ఇప్పుడు గాంధీభవన్‌లో ఆసక్తికరంగా మారింది. సమర్థతకు పెద్దపీట వేస్తారా లేక ఒత్తిళ్లకు తలొగ్గి సర్దుబాటు జాబితాను విడుదల చేస్తారా అనేది వేచి చూడాలి.







