శ్రీజారెడ్డి ఆచూకీ కోసం దేశవ్యాప్త గాలింపు.. 911 నెంబర్ కి కాల్ చేయాలని బోస్టన్ పోలీసుల పిలుపు
బోస్టన్ లో తప్పిపోయిన నల్గొండ యువతి కోయ శ్రీజారెడ్డి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆమె జాడ లేక ఇప్పటికే తొమ్మిది రోజులు గడిచిపోయింది. దీంతో కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. మరోవైపు అమెరికన్ అధికారులు కూడా దేశ వ్యాప్తంగా శ్రీజారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బోస్టన్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం, బోస్టన్ పోలీసు విభాగంతో సమన్వయం చేసుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
అయితే.. అమెరికన్ పోలీసుల కథనం ప్రకారం.. శ్రీజ 5 అడుగుల 3 అంగుళాల నుండి 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ఉండి, సన్నని శరీరతత్వాన్ని, నల్లని జుట్టును కలిగి ఉంది. ఆమె చివరిసారిగా నల్లని జాకెట్ మరియు నీలిరంగు జీన్స్ ధరించి వుందని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పాలని సూచిస్తున్నారు కూడా. అయితే.. శ్రీజారెడ్డి కార్సన్ బీచ్ లేదా హార్బర్ పాయింట్ ప్రాంతాలలో వుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఆ ప్రాంత వాసులకు కూడా సమాచారం కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు భారత కాన్సులేట్ కూడా బోస్టన్ పోలీసులను కోరడంతో బోస్టన్ పోలీసులు దేశవ్యాప్త గాలింపు హెచ్చరికలను జారీ చేశారు. ఈ విషయాన్ని కాన్సులేట్ ప్రకటించింది.”కాన్సులేట్ అధికారులు మరియు ఆమె కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. శ్రీజ కోయ ఆచూకీని కనుగొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అన్ని విధాలా మద్దతు అందిస్తున్నారు” అని పేర్కొంది.
ఎవరికి ఆచూకీ తెలిసినా.. వెంటనే తమకు సమాచారం అందించాలని బోస్టన్ పోలీసులు కోరుతున్నారు. శ్రీజ ఎక్కడ ఉన్నారో తెలిసిన వారు ఎవరైనా సరే, వెంటనే 911కి కాల్ చేయాలని లేదా డిస్ట్రిక్ట్ సి-11 (డార్‌చెస్టర్) డిటెక్టివ్‌లను సంప్రదించాలని బోస్టన్ పోలీసులు కోరారు.
బోస్టన్ పోలీస్ క్రైమ్‌స్టాపర్స్ టిప్ లైన్ లేదా దాని ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కూడా సమాచారాన్ని పంచుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అయితే.. సమాచారం ఇచ్చిన వారి వివరాలను ఎవ్వరికీ వెల్లడించమని పోలీసులు కూడా హామీ ఇస్తున్నారు.







