బ్యాంక్ యాప్ ఓపెన్ కాలేదు.. చివరికి దేశ అధ్యక్షుడి పదవే పోయింది!! అసలు ఏం జరిగింది?
నవంబర్ 3, 2026. పారాగ్వేలో చాలామందికి ఆ రోజు మామూలుగానే మొదలైంది. ఉదయం లేవగానే కొందరు తమ బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బుందో చూసుకోవడానికి Ueno యాప్ తెరిచారు. ఇంకొందరు ఎవరికో డబ్బులు పంపించాలనుకున్నారు. కానీ ఎవరికీ లావాదేవీలు జరగలేదు. మొదట ఏదో సాంకేతిక సమస్య అనుకున్నారు. కాసేపు ఆగి మళ్లీ ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు.
కొద్దిసేపటికే సమస్య ఒక్కరిదే కాదని అర్థమైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. బ్యాంకు ఫోన్లు నిరంతరం మోగుతున్నాయి. ఏటీఎంల దగ్గర జనం పెరుగుతున్నారు. తమ ఖాతాల్లో డబ్బున్నా అవసరమైనప్పుడు తీసుకోలేని పరిస్థితి. దాదాపు 30 లక్షల మంది ఖాతాదారుల జీవితాల్లో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది.
కానీ ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు విషయం అప్పటికి ఎవరికీ తెలియదు. ఇది కేవలం ఒక బ్యాంకు సాంకేతిక సమస్య కాదు. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను దాటి రాజకీయ అధికార కేంద్రాల వరకు వెళ్లబోతోంది.
కొన్ని రోజుల తర్వాత పారాగ్వేలో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామా చేయాల్సి వచ్చింది. చివరకు దేశ అధ్యక్షుడి కుర్చీ కూడా కదిలింది.
అసలు Ueno బ్యాంకులో ఏం జరిగింది? లక్షలాది మంది నమ్మిన ఆర్థిక సంస్థ వెనుక ఎలాంటి లెక్కలు దాగున్నాయి? ఒక బ్యాంకు సంక్షోభం దేశ అధ్యక్షుడి పదవికే ఎలా ఎసరు పెట్టింది?
మొదట అనుమానం.. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఎంట్రీ!
Ueno యాప్ పనిచేయకపోవడం వెనుక సాధారణ సాంకేతిక సమస్య లేదని త్వరలోనే స్పష్టమైంది. నవంబర్ 2నే పారాగ్వే సెంట్రల్ బ్యాంక్ ఈ సంస్థపై కీలక చర్యలు ప్రారంభించింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన అధికారులు దాన్ని తమ నియంత్రణలోకి తీసుకునే Resolution ప్రక్రియ చేపట్టారు. ఇది సాధారణంగా బ్యాంకు దివాలా తీసినప్పుడు జరిగే పరిణామాలకు భిన్నమైనది. ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడకుండా కేంద్ర బ్యాంకే నేరుగా జోక్యం చేసుకునే చర్య.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. Ueno చిన్న ఆర్థిక సంస్థ కాదు. దాదాపు 30 లక్షల మంది ఖాతాదారులున్న బ్యాంకు. దేశ జనాభాలో దాదాపు సగం మందితో సంబంధం ఉన్న సంస్థ. ఇంత పెద్ద బ్యాంకును సెంట్రల్ బ్యాంక్ తన నియంత్రణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
దానికి సమాధానం బ్యాంకు లోపలి లెక్కల్లో ఉంది.
2021లో డిజిటల్ లెండింగ్ సంస్థగా ప్రారంభమైన Ueno, చాలా తక్కువ సమయంలోనే పారాగ్వేలో ప్రముఖ బ్యాంకింగ్ బ్రాండ్‌గా ఎదిగింది. సంప్రదాయ బ్యాంకులు అందించని సౌకర్యాలను మొబైల్ ఫోన్ ద్వారానే అందించింది. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, సులభమైన రుణాలు, క్రెడిట్ కార్డులు.. ఇలా కొత్త కస్టమర్లను ఆకర్షించింది.
ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా తన ఖాతాదారులుగా మార్చుకుంది. తక్కువ ఆదాయం ఉన్నవారికి క్రెడిట్ కార్డులు అందించడం ద్వారా కొత్త మార్కెట్‌ను సృష్టించింది.
అయితే బ్యాంకు ఎంత వేగంగా ఎదిగిందన్నది ఒక లెక్క. ఆ వృద్ధికి అవసరమైన ఆర్థిక పునాది ఎంత బలంగా ఉందన్నది మరో లెక్క. ఇప్పుడు రెండో లెక్కలోనే అసలు సమస్య బయటపడింది.
$146 మిలియన్ల రుణాలు.. ఎవరి కంపెనీలకు వెళ్లాయి?
ఈ వ్యవహారంలో కీలకమైన ఆధారాలు 2026 జూన్‌లోనే బయటపడ్డాయి. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలు నిర్వహించిన తనిఖీల్లో Ueno ఇచ్చిన కొన్ని భారీ రుణాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
బ్యాంకును నియంత్రించే Grupo Vázquez కు సంబంధం ఉన్న మూడు కంపెనీలకు దాదాపు 146 మిలియన్ డాలర్ల రుణాలు వెళ్లినట్లు పర్యవేక్షణ నివేదికలో వెల్లడైంది. కొన్ని కంపెనీల యాజమాన్యాలను గ్రూప్ ఉద్యోగులకు బదిలీ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ రుణాలకు చూపించిన హామీలు సరైనవేనా? డబ్బు చివరకు ఎక్కడికి వెళ్లింది? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇక్కడే బ్యాంకింగ్ రంగంలో కీలకమైన ఒక ప్రమాదం కనిపిస్తుంది. ఒక బ్యాంకు యజమానులకు సంబంధం ఉన్న కంపెనీలకే భారీ రుణాలు ఇస్తే, ఆ డబ్బు తిరిగి వచ్చే విషయంలో రిస్క్ పెరుగుతుంది. రుణం తీసుకున్న కంపెనీ నష్టాల్లోకి వెళ్తే బ్యాంకు కూడా ఇబ్బందుల్లో పడుతుంది. పైగా రుణాలు ఇచ్చే నిర్ణయాలు వ్యాపార ప్రయోజనాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. దీనినే Connected Lending అంటారు.
అయితే ఈ హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా సమస్య ఎందుకు పెరిగింది? నియంత్రణ సంస్థలు ముందుగానే ఎందుకు అడ్డుకోలేకపోయాయి? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి.
చివరకు బ్యాంకు లెక్కల్లో చేసిన సర్దుబాట్ల తర్వాత దాని Solvency Ratio చట్టబద్ధ కనీస స్థాయిలో సగానికి కూడా పడిపోయింది. అంటే బ్యాంకు తీసుకున్న రిస్క్‌లను తట్టుకునే ఆర్థిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్పష్టమైంది.
ఇప్పుడు Uenoను కాపాడటం కంటే దాని పతనం ఇతర ఆర్థిక సంస్థలకు వ్యాపించకుండా చూడటం సెంట్రల్ బ్యాంక్‌కు ప్రధాన సవాలుగా మారింది.
అసలు ట్విస్ట్.. బ్యాంకులో ఉన్నది ప్రైవేట్ డబ్బు మాత్రమే కాదు!
Ueno ఆర్థిక పరిస్థితి ఎందుకు ఇంత వేగంగా దిగజారిందో అర్థం చేసుకోవడానికి దాని ఖాతాల్లో ఉన్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలి. అప్పుడే ఇందులో మరో కీలకమైన విషయం బయటపడుతుంది.
ఆ బ్యాంకులో దాదాపు 850 మిలియన్ డాలర్ల ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఇందులో సుమారు 355 మిలియన్ డాలర్లు పారాగ్వే సామాజిక భద్రతా సంస్థ IPSకు చెందినవి. ఈ సంస్థ ప్రజల ఆరోగ్య సేవలు, పదవీ విరమణ పెన్షన్ల కోసం నిధులను నిర్వహిస్తుంది. అంటే ప్రజల భవిష్యత్తు కోసం దాచిన డబ్బులో గణనీయమైన మొత్తం Uenoలో ఉంది.
ఒక ప్రైవేట్ బ్యాంకు ఆర్థిక పరిస్థితి బలహీనపడుతున్న సమయంలో ప్రభుత్వానికి చెందిన ఇంత భారీ మొత్తం అక్కడ ఎందుకు ఉంది?
ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే 2023లో జరిగిన ఒక విధాన మార్పు కనిపిస్తుంది. అప్పట్లో IPS బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టేందుకు ఉన్న అర్హత నిబంధనలను సడలించింది. 2024లో ఒకే బ్యాంకులో పెట్టుబడులు పెట్టడంపై ఉన్న మూలధన ఆధారిత పరిమితిని కూడా తొలగించింది. ఈ మార్పుల తర్వాత Uenoలో IPS డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మార్పులు జరిగిన కాలంలోనే అధ్యక్షుడు శాంటియాగో పెనా నియమించిన వ్యక్తి IPSకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రభుత్వ నిధులను ఏ బ్యాంకులో పెట్టాలనే నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో మార్పులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆ మార్పుల వల్ల ప్రయోజనం పొందిన బ్యాంకుతో ప్రభుత్వ పెద్దలకు పాత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇది యాదృచ్ఛికంగా జరిగిన పరిణామాల సమాహారమా? లేక ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న నిర్ణయాలా? అన్నది ఇప్పుడు పారాగ్వేలో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది.
బ్యాంకు యజమానులు.. ప్రభుత్వ పెద్దలు.. మధ్యలో అధ్యక్షుడు!
ఇప్పటివరకు కనిపించినది బ్యాంకు ఆర్థిక సమస్య. కానీ దాని వెనుక ఉన్న వ్యక్తుల సంబంధాలను పరిశీలిస్తే కథ మరో మలుపు తిరుగుతుంది.
అధ్యక్షుడు పెనాకు Uenoను నియంత్రించే Grupo Vázquezతో గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయన Ueno Holdingలో 1.58 శాతం వాటా కలిగి ఉన్నట్లు స్థానిక మీడియా గతంలో కథనాలు ప్రచురించింది. ఆయన సోదరుడు ఫ్రాన్సిస్కోకు కూడా లక్సెంబర్గ్‌కు చెందిన U Holdingsలో వాటాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సంస్థ Uenoలో పరోక్ష వాటాదారుగా ఉంది. అయితే ఇద్దరూ 2025లో తమ వాటాల నుంచి వైదొలిగినట్లు సమాచారం.
ఇంకో వైపు పెనాకు గతంలో Banco Basaతో కూడా సంబంధాలున్నాయి. ఈ బ్యాంకు అధికార Colorado Party నాయకుడు, మాజీ అధ్యక్షుడు హొరాసియో కార్టెస్కు అనుబంధంగా ఉంది. కార్టెస్కు పారాగ్వే రాజకీయాల్లో ఇప్పటికీ గణనీయమైన ప్రభావం ఉంది. పెనాను అధ్యక్ష పదవి నుంచి తప్పించే పరిణామాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి.
ఆర్థిక మంత్రి కార్లోస్ ఫెర్నాండెజ్ వాల్డోవినోస్ కూడా గతంలో Banco Basa బోర్డులో పనిచేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఒకే వ్యాపార వర్గానికి చెందిన వ్యక్తులు వివిధ సమయాల్లో బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వ ఆర్థిక శాఖలు, నియంత్రణ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోజనాల సంఘర్షణ తలెత్తే అవకాశం ఉంటుంది.
దీనినే ఆర్థిక పరిభాషలో Regulatory Capture అంటారు. ఒక సంస్థను నియంత్రించాల్సిన ప్రభుత్వ వ్యవస్థ, క్రమంగా అదే సంస్థల ప్రయోజనాలకు అనుకూలంగా మారిపోవడమే దీని వెనుక ఉన్న భావన.
Ueno వ్యవహారం ఇప్పుడు ఈ అంశాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది.
అధ్యక్షుడి కుర్చీ కదిలిన అసలు క్షణం!
ఈ విషయాలన్నీ బయటకు వస్తున్న సమయంలో దేశంలో ప్రజా ఆగ్రహం పెరుగుతోంది. తమ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఖాతాదారులు నిరసనలకు దిగుతున్నారు. బ్యాంకు ఉద్యోగులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అధ్యక్షుడు పెనా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
2023లో ఆర్థికవేత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయనకు బ్యాంకింగ్ రంగంతో ఉన్న పాత సంబంధాలు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. Ueno సంక్షోభాన్ని ప్రభుత్వం సరిగా పర్యవేక్షించలేకపోయిందనే విమర్శలు తీవ్రమయ్యాయి.
నవంబర్ 5న పెనా రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాతో వ్యవహారం ముగియలేదు. మరుసటి రోజు సెనేట్ ఏకగ్రీవంగా ఆయనను పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయనకు ఉన్న పార్లమెంటరీ రక్షణ కూడా తొలగిపోయింది.
ఆ తర్వాత ఆయనను గృహ నిర్బంధంలో ఉంచి, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. సెంట్రల్ బ్యాంక్ మాజీ చీఫ్ కార్లోస్ కార్వాల్యో కూడా ఇదే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
పెనా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆయన గత వ్యాపార సంబంధాలు, ప్రభుత్వ నిర్ణయాలు, బ్యాంకింగ్ పర్యవేక్షణపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోపణలు న్యాయస్థానంలో ఇంకా నిరూపించాల్సి ఉంది.
ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2028 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
వీధుల్లోకి వచ్చిన ఖాతాదారులు.. కాలిపోయిన బ్యాంకు కార్డులు!
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతుంటే.. బయట సామాన్యుల పరిస్థితి మాత్రం వేరుగా ఉంది.
Uenoలో ఖాతాలున్న ఉద్యోగులు తమ జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. చిన్న వ్యాపారులు చెల్లింపులు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. తమ పొదుపును బ్యాంకులో ఉంచిన కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
కొంతమంది Ueno ఉద్యోగులు కంపెనీ కార్డులను తగలబెట్టి నిరసన తెలిపారు. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఖాతాదారులు పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనలు నిర్వహించారు. తమ డబ్బును తిరిగి ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొన్ని నిరసనల్లో పోలీసులు పెప్పర్ స్ప్రే, రబ్బరు బుల్లెట్లు ఉపయోగించారు.
ఇది కేవలం ఒక బ్యాంకు ఖాతాదారుల సమస్యగా మిగలలేదు. ఇతర బ్యాంకుల నుంచి కూడా ప్రజలు డబ్బు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించడంతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది.
ఒక బ్యాంకుపై నమ్మకం కోల్పోయిన ప్రజలు మిగతా బ్యాంకులపైనా అనుమానం పెంచుకుంటే దాన్ని Bank Run అంటారు. డబ్బు ఉన్న బ్యాంకు కూడా ప్రజలంతా ఒకేసారి తమ డిపాజిట్లు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇబ్బందుల్లో పడవచ్చు.
పారాగ్వేలో అలాంటి భయం ఏర్పడింది.
అయితే డిపాజిటర్లకు కొంత రక్షణ కల్పించేందుకు అక్కడి డిపాజిట్ గ్యారంటీ పథకం ఉంది. ఒక్కో ఖాతాదారుడికి సుమారు 38 వేల డాలర్ల వరకు రక్షణ కల్పించే వ్యవస్థ అమల్లో ఉంది. సెంట్రల్ బ్యాంక్ మాత్రం ఈ సంక్షోభం Uenoకే పరిమితమని చెబుతోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







