గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో మైసూర్ లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు….
మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో 2026 అక్టోబర్ 11 నుంచి 22 వరకు 60వ వార్షిక శ్రీ దేవీ నవరాత్రి పూజా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ , పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి సమక్షంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు గోపూజ, కుమారి పూజ, అమ్మవారికి నవావరణ పూజ, దేవీ ఆరాధన, హోమాలు, ప్రఖ్యాత విద్వాంసులచే సంగీత సేవలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
మహానవమి 20 అక్టోబర్ 2026: శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజైన మహానవమి పర్వదినం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. తెల్లవారుజామున చండీమాతకు ప్రత్యేక చండీ హోమం ప్రారంభమైంది. హోమకుండంలో పవిత్ర ద్రవ్యాలను సమర్పిస్తూ, దేవీ మాహాత్మ్యంలోని 700 శ్లోకాలను భక్తిపూర్వకంగా పఠించారు. పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆశ్రమంలోని వాహనాలన్నింటికీ ఆయుధ పూజను నిర్వహించారు. అనంతరం స్వామీజీ వారు కుమారీ పూజను నిర్వహించి, అంతకుముందు ఆవాహన చేసిన దేవతామూర్తులకు ఉద్వాసన క్రతువును సంపూర్ణంగా నిర్వహించారు. చండీ హోమానికి మహాపూర్ణాహుతిని సమర్పించి, పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేసి అందరికీ ఆశీస్సులు అందించారు. వావరణ పూజలో అమ్మవారిని శక్తి దుర్గాదేవిగా ఆరాధించారు. కొబ్బరికాయలను సమర్పించి, అన్నార్చనలో భాగంగా దధ్యన్నాన్ని (పెరుగన్నం) అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.
పూజ్య శ్రీ స్వామీజీ అన్నార్చన నిర్వహించి, భక్తులకు మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం మరకత శ్రీచక్రానికి విశేష అభిషేకం, పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో డోలోత్సవ సేవను సమర్పించారు. తరువాత పూజ్య స్వామీజీ వారు దేవి భజనలు గానం చేసి భక్తులను తన్మయపరిచారు. అనంతరం పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు తన అనుగ్రహ భాషణ చేస్తూ ఈ 60వ నవరాత్రి ఉత్సవాలను దర్శించుకునే దివ్యభాగ్యాన్ని శ్రీ దత్తాజీ పదకొండు రోజులుగా భక్తులకు ప్రసాదిస్తున్నారని తెలిపారు. ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతి ఒక్కరూ తమ హృదయాలను ప్రేమతో, ఆనందంతో నింపుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. మహోన్నత నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో, మనసుల్లో చెరగని ఆధ్యాత్మిక ముద్రను వేస్తాయని స్వామీజీ పేర్కొన్నారు.
శ్రీ దత్తాజీ అనుగ్రహించిన లలితా సహస్రనామ పారాయణం భక్తులకు రక్షణగా నిలుస్తుందనీ, అందువల్ల ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామాన్ని భక్తితో, శ్రీ స్వామీజీ వారి యూట్యూబ్లో ప్రతిరోజూ కనీసం మూడుసార్లు వినాలని స్వామీజీ సూచించారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో ప్రత్యేకంగా పిల్లలకు, పెద్దలకు కూడా , “దత్తవాణి “యాప్ను పూజ్య స్వామీజీ వారు రిలీజ్ చేశారు. ఈ యాప్ మనకు ఎన్నో విషయాలను బోధిస్తుంది, జ్ఞానాన్ని పంచుతుదని వివరించారు. ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలు కూడా లభిస్తాయి. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా జ్ఞానానికి నిధి వంటిదని శ్రీస్వామీజీ వారు పేర్కొన్నారు.జగన్మాత అనుగ్రహంతో ఈదేవీ నవరాత్రుల ఉత్సవాలు భక్తుల హృదయాలలో భక్తి, శాంతి, ప్రేమ, ఆనందాలు వెళ్లివిరిసాయి. మహానవమి వేడుకలు భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని అందించాయి. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో , క్రమశిక్షణతో దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు… ప్రతిరోజు భక్తులందరికీ ఉచితంగా అన్న ప్రసాదము పంపిణీ చేశారు. దత్త సేవాదళ్ స్వయంసేవకులు, భక్తి శ్రద్ధలతో, భక్తులకు అన్ని సదుపాయాలు సమకూర్చారు,
జయ గురు దత్త! శ్రీ మాత్రే నమః!
చెన్నూరి సుబ్బారావు









