‘రామాయణం’తో మళ్లీ రేసులోకి దిల్ రాజు, ఆ పెద్ద సినిమాలే టార్గెట్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకటే పరిస్థితి ఉండదు. ఓడలు బండ్లు అవుతూంటాయి. బండ్లు ఓడలు అవుతూంటాయి. చేతిలో వరుస ప్రాజెక్టులు, బాక్సాఫీస్ దగ్గర మంచి పట్టు ఉన్నవాళ్లకే ఒక్కోసారి గడ్డు పరిస్థితులు ఎదురవుతుంటాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పరిస్థితి కూడా ఇలాగే మారింది. గత కొంత కాలంగా ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూషన్ ఆశించినట్టుగా ముందుకు వెళ్లలేకపోయారు. ఏ సినిమా కొనుగోలు చేసినా నష్టాలే ఎదురవడంతో కొంత ఆర్దిక ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు రామాయణ రూపంలో ఆయనకు మంచి అవకాశం దొరికినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ తన పాత జోరును అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రామాయణతో దిల్ రాజుకు కాస్త ఊరట!
రీసెంట్ గా రామాయణ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను దక్కించుకోవడం దిల్ రాజుకు కలిసొచ్చే అంశంగా మారింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి బిజినెస్ చేస్తుండటంతో దిల్ రాజుకు కూడా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది.
మరోవైపు యశ్ నటించిన టాక్సిక్ సినిమా విషయంలో ఎదురైన నష్టాలను కూడా కొంతవరకు భర్తీ చేసుకునే అవకాశం ఉందని టాక్. అంతేకాదు, భవిష్యత్తులో దిల్ రాజు కోసం ఓ సినిమా చేస్తానని యశ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అదే నిజమైతే ప్రస్తుత నష్టాల నుంచి బయటపడటమే కాకుండా, మరో పెద్ద ప్రాజెక్టుతో తిరిగి తన మార్కెట్‌ను బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
చిరంజీవి సినిమా నైజాం హక్కులపై కన్ను!
రామాయణతో వచ్చిన ఈ ఊపును దిల్ రాజు ఇక్కడితో ఆపేలా కనిపించడం లేదు. మళ్లీ భారీ సినిమాల పంపిణీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమా నైజాం హక్కులను భారీ ధరకు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నైజాం మార్కెట్లో దిల్ రాజుకు ఉన్న పట్టును దృష్టిలో పెట్టుకుంటే ఈ డీల్ ఆయనకు చాలా కీలకంగా మారనుంది.
ఇక వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ పైనా ఆయన దృష్టి పెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను కూడా సొంతం చేసుకోవాలని దిల్ రాజు చూస్తున్నారట. అనిల్ రావిపూడి సినిమాలకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ, సంక్రాంతి సీజన్ కలిసొస్తే ఈ సినిమా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది.
డిసెంబర్లో వృషకర్మ.. చేతిలో మరిన్ని ప్రాజెక్టులు!
నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ సినిమాను డిసెంబర్లో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే బాధ్యతలను కూడా దిల్ రాజు తీసుకున్నారు. ఇలా ఒకవైపు రామాయణతో ఊపిరి పీల్చుకుంటూనే, మరోవైపు వరుసగా కొత్త సినిమాల హక్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఆయన ప్లాన్ కేవలం ఇప్పటివరకు వచ్చిన నష్టాలను పూడ్చుకోవడమే కాదు.. మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లో తన పాత స్థానాన్ని సంపాదించుకోవడం కూడా!
మైత్రీకి పోటీగా మళ్లీ దూకుడు?
ఇటీవలి కాలంలో టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో మైత్రీ మూవీ మేకర్స్ కూడా బలంగా దూసుకొస్తోంది. పెద్ద సినిమాల హక్కులు, భారీ డీల్స్ విషయంలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ పోటీలో దిల్ రాజు కొంత వెనుకబడినట్టుగా కనిపించినా, ఇప్పుడు మళ్లీ తనదైన వ్యూహంతో ముందుకొస్తున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులపై కన్నేయడం చూస్తుంటే ఆయన మళ్లీ బిజినెస్‌లో దూకుడు పెంచాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్టుంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







