మండలి పోరుతో టీఆర్ఎస్ రాజకీయ భవితవ్యం తేలేనా?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపిన కల్వకుంట్ల కవిత, ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ నీడ నుంచి బయటకు వచ్చి, ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరిట సొంత వేదికను ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి ఆమె అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ రాజకీయాలకు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిర్మించుకునే క్రమంలో, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను కవిత ఒక ప్రతిష్టాత్మక మైలురాయిగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ ఆవిర్భావం సమయంలో కేసీఆర్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించిన కవిత, ఆ తర్వాత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, సంతోష్ రావులపై సైతం తీవ్రస్థాయిలో రాజకీయ బాణాలు సంధించారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి కుటుంబ నేపథ్యాన్ని లేదా తండ్రి బ్రాండ్ ఇమేజ్ను వాడుకోకుండా, పూర్తిగా క్షేత్రస్థాయి శ్రమ, ప్రజా సమస్యల ఆధారంగానే తన పార్టీని నిర్మించాలన్న కృతనిశ్చయంతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఇది ఒకరకంగా ఆమె రాజకీయ ప్రయాణంలో అత్యంత సాహసోపేతమైన ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ ప్రజల్లో ఉండేందుకు కవిత తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా, సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు గని కార్మికుల హక్కులు, ఆదివాసీల భూ సమస్యలు, అటవీ హక్కులపై స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులతో మమేకమవుతున్నారు. నిరుద్యోగ సమస్య, జాబ్ క్యాలెండర్ అమలు, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీటి నిర్వహణ లోపాలు, పంట నష్టపరిహారం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ పర్యటనల్లో ఆమె చేసే ఘాటైన వ్యాఖ్యలు ప్రత్యర్థి వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ, రాజకీయ ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి దోహదపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
పార్టీ స్థాపించిన తర్వాత నేరుగా ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఇదే ప్రథమం. రెండు కీలక గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో ముందంజ వేసేలా వ్యూహం రచించారు. విద్యావంతులు, గ్రాడ్యుయేట్ ఓటర్లను నేరుగా కలుస్తూ తమ గొంతుకగా శాసనమండలిలో నిలిచేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మండలిలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా నిజమైన ప్రజా సమస్యలను ప్రస్తావించేది తమ అభ్యర్థులేనని ఆమె బలంగా ప్రచారం చేస్తున్నారు.
కవిత వ్యక్తిగతంగా సమస్యలపై పోరాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అది పూర్తిస్థాయి రాజకీయ బలగంగా లేదా ఓట్ల రూపంలోకి మారుతుందా అన్నదానిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పార్టీని ఒంటిచేత్తో నడిపించడం ఆషామాషీ కాదు. గ్రామీణ, పట్టణ స్థాయిల్లో ఇంకా బలమైన క్యాడర్ కొరవడటం పార్టీకి ప్రధాన సవాలుగా మారింది. పర్యటనలు, పత్రికా ప్రకటనల కంటే మించి, ప్రజల్లో భావోద్వేగపూరిత అనుబంధాన్ని, విశ్వాసాన్ని కలిగించేలా ఆందోళనా కార్యక్రమాలను రూపకల్పన చేయాల్సి ఉంది. ఇతర ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకోవాలంటే, కేవలం కుటుంబ విభేదాలు మాత్రమే కాకుండా, స్పష్టమైన భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ ఆడబిడ్డగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను విద్యావంతులు, యువత తప్పక ఆదరిస్తారనే పూర్తి ధీమాతో కవిత ఉన్నారు. అయితే, మండలి ఫలితాలు ఆమె స్థాపించిన పార్టీకి రాజకీయ గుర్తింపును, భవిష్యత్ మనుగడను నిర్దేశించేలా కీలకంగా మారనున్నాయి. ఒంటరి పోరాటం విజయతీరాలకు చేరుస్తుందా లేక మరిన్ని వ్యూహాత్మక మార్పులకు నాంది పలుకుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.







