అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు మరో ఎదురుదెబ్బ!
అమెరికాలో ఐటీ ఉద్యోగం.. హెచ్-1బీ వీసా.. ఆ తర్వాత గ్రీన్‌కార్డ్.. ఇదే లక్ష్యంతో ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు ఒక్కొక్కటిగా అవకాశాలు జారిపోతున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేస్తుండగా, తాజాగా టెక్ దిగ్గజం ఐబీఎం తీసుకున్న నిర్ణయం విదేశీ ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.
H-1B, Green Card Sponsorshipకు IBM బ్రేక్!
అమెరికాలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తయితే.. అక్కడే శాశ్వతంగా స్థిరపడటం మరో ఎత్తు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు హెచ్-1బీ వీసా నుంచి గ్రీన్‌కార్డ్ వరకు ప్రయాణం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టెక్ దిగ్గజం ఐబీఎం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తన కన్సల్టింగ్ విభాగంలోని చాలా ఉద్యోగాలకు ఇకపై హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల స్పాన్సర్షిప్ అందించకూడదని కంపెనీ నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా అమెరికాలో కంపెనీ తరఫున పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే వర్క్ వీసాలపై ఆధారపడుతున్నవారికి భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. అంతేకాదు, కంపెనీ ద్వారా గ్రీన్‌కార్డ్ పొందాలని ఎదురుచూస్తున్నవారికి కూడా ఈ పరిణామం ఇబ్బందికరంగా మారనుంది.
ఉద్యోగం కావాలా? అమెరికా వదిలి వెళ్లాలా?
ఈ నిర్ణయం పరిధిలోకి వచ్చిన ఉద్యోగులకు ఐబీఎం రెండు అవకాశాలు ఇచ్చినట్లు సమాచారం. కంపెనీ కోసం అమెరికా బయట ఉన్న కార్యాలయాల్లో పనిచేయడానికి సిద్ధపడితే ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు. అలా కాకుండా అమెరికాలోనే ఉండాలని భావిస్తే, ఈ ఏడాది చివరిలోపు కంపెనీని వీడాల్సి ఉంటుంది.
అంటే ఇన్నాళ్లూ అమెరికాలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని అక్కడే స్థిరపరుచుకోవాలని భావించిన ఉద్యోగులు ఇప్పుడు తమ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో దేశానికి వెళ్లి పనిచేయాలా? లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కోవాలా? అనే సందిగ్ధంలో పడిపోయారు.
అమెరికాలో స్థానిక ఉద్యోగులకే ప్రాధాన్యత!
ఈ నిర్ణయంపై ఐబీఎం ప్రతినిధి వివరణ ఇచ్చారు. అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చేందుకు కంపెనీ గతంలో హైస్కిల్డ్ వీసా ప్రోగ్రామ్‌లో భాగస్వామిగా ఉందని తెలిపారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమంలో కంపెనీ భాగస్వామ్యం తగ్గుతూ వస్తోందని చెప్పారు.
అమెరికాలోనే నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు అందుబాటులోకి రావడం, క్లయింట్ల అవసరాలు మారడం వంటి పరిణామాల నేపథ్యంలో కన్సల్టింగ్ విభాగంలో వీసా, గ్రీన్‌కార్డ్ స్పాన్సర్‌షిప్‌ను వీలైనంత వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు వివరించారు.
కంపెనీ చెబుతున్న కారణం స్థానిక ఉద్యోగుల లభ్యత పెరగడమే అయినప్పటికీ, అమెరికాలో వలస ఉద్యోగుల భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఈ నిర్ణయానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ట్రంప్ విధానాల ప్రభావం మొదలైందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ముఖ్యంగా కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునే విధానం, హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్ ప్రక్రియలపై ఆంక్షలు పెరుగుతున్నాయి.
ఇటీవల ఎనిమిది ప్రముఖ టెక్నాలజీ, ఐటీ కన్సల్టింగ్ సంస్థలకు సంబంధించి కొత్త లేబర్ సర్టిఫికేషన్లు, పెండింగ్ గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్‌పై అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వచ్చిన వార్తలు కూడా ఈ ఆందోళనను పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐబీఎం నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఐబీఎం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ ఆదేశాల వల్లే వచ్చిందని చెప్పడానికి ఆధారాలు లేవు. కంపెనీ మాత్రం స్థానిక నైపుణ్యాల లభ్యత, క్లయింట్ల అవసరాల్లో మార్పులను కారణాలుగా చెబుతోంది.
భారతీయ ఐటీ ఉద్యోగులకు అసలు సమస్య ఇదే!
ఈ పరిణామాన్ని కేవలం ఒక కంపెనీ తీసుకున్న వ్యాపార నిర్ణయంగా చూడలేం. అమెరికాలో వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఉద్యోగం మారినా, కంపెనీ మారినా వీసా నిబంధనలు, ఇమిగ్రేషన్ ప్రక్రియలు వారి జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి.
ఇప్పుడు కంపెనీలు వీసా స్పాన్సర్షిప్ తగ్గిస్తే ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, అమెరికాలో ఉండే అవకాశాలపైనా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కుటుంబంతో కలిసి అక్కడ స్థిరపడినవారికి ఇది మరింత క్లిష్టమైన పరిస్థితి. ఐబీఎం నిర్ణయం ఈ మారుతున్న పరిస్థితులకు మరో ఉదాహరణగా నిలుస్తోంది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల







