తెలంగాణ కాంగ్రెస్‌లో ‘మీడియా కమిటీ’ చిచ్చు!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ విధానాలను, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన మీడియా విభాగానికి సంబంధించి ప్రకటించిన నియామకాలు కేవలం 24 గంటల వ్యవధిలోనే తాత్కాలికంగా నిలిచిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సోమవారం ఆర్భాటంగా విడుదల చేసిన పదవుల జాబితాను, మంగళవారం అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గాంధీ భవన్లో నెలకొన్న అసమ్మతి తీవ్రతను చాటిచెబుతోంది.
టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియా కమిటీ నియామకాల వివరాలను వెల్లడించారు. ఈ జాబితాలో మొత్తం 16 మంది మీడియా ప్యానెలిస్టులు, నలుగురు సభ్యులతో కూడిన సమన్వయ బృందం, 49 మంది అధికార ప్రతినిధుల పేర్లను చేర్చారు. ఇప్పటికే కొనసాగుతున్న అధికార ప్రతినిధులను సీనియర్ అధికార ప్రతినిధులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, డాక్టర్ రామచంద్ర నాయక్, బల్మూరి వెంకట్‌లతో పాటు ఎమ్మెల్యేలు సి.వంశీకృష్ణ, టి.రామ్మోహన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎం.ఎస్.రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తదితరులను 16 మంది ప్యానెలిస్టుల జాబితాలో చేర్చారు. అలాగే చీఫ్ మీడియా కోఆర్డినేటర్‌గా కె.శ్రీకాంత్ యాదవ్, కన్వీనర్‌గా దామోదర్ ఆవేలి, కోఆర్డినేటర్లుగా తుమ్మల పద్మ, మొగిలి సత్యారెడ్డిలను నియమించారు.
ఇవి కూడా చదవండి
ఈ వివాదానికి ప్రధాన కారణం ఏఐసీసీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియను తుంగలో తొక్కడమేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అర్హత, ప్రతిభ ఆధారంగా పార్టీ గొంతుకను బలంగా వినిపించే వక్తలను ఎంపిక చేసేందుకు ఏఐసీసీ నుంచి ముగ్గురు ప్రతినిధులు, రాష్ట్ర యూనిట్ నుంచి ఇద్దరు సభ్యులతో కలిపి మొత్తం ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ద్వారా టాలెంట్ హంట్ నిర్వహించి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు కూడా చేశారు. అయితే, కమిటీ పరిశీలించి సిఫార్సు చేసిన అభ్యర్థులలో 10 శాతం కంటే తక్కువ మందికే తుది జాబితాలో స్థానం లభించిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మరింత ఆశ్చర్యకరంగా, ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురైన వారికి ఏకపక్షంగా పదవులు కట్టబెట్టడం కమిటీ సభ్యులతో పాటు ఏఐసీసీ స్థాయి నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
తన ప్రమేయం లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే జాబితా ఎలా విడుదలవుతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసంతృప్తికి గురైన ఆశావహులు నేరుగా పీసీసీ చీఫ్‌ను ఆశ్రయించగా, ఆయన మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ, తక్షణమే పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఏఐసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరాను ఆదేశించారు. మహేష్ కుమార్ గౌడ్, పవన్ ఖేరాల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం, ప్రస్తుతానికి ఆ నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఏఐసీసీ నాయకత్వంతో మరోసారి విస్తృతంగా సంప్రదింపులు జరిపి, అర్హులైన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ సమగ్రమైన సమీక్ష అనంతరం కొత్త జాబితాను విడుదల చేయనున్నారు. అధికారంలో ఉన్న సమయంలో సమర్థవంతమైన ప్రచార వ్యూహాన్ని అమలు చేయాల్సిన విభాగంలోనే అంతర్గత వైరుధ్యాలు బయటపడటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్న భావన కేడర్‌లో వ్యక్తమవుతోంది.







