దీపావళి ఫెడరల్ సెలవుదినం బిల్లును తిరిగి ప్రవేశపెట్టిన అమెరికా చట్టసభ సభ్యులు
న్యూయార్క్ : దీపావళి పండగకి వున్న సాంస్కృతిక నేపథ్యం, మత పరమైన నేపథ్యాన్ని, దాని ప్రాముఖ్యతను గుర్తిస్తూ.. ఫెడరల్ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ యూఎస్ కాంగ్రెస్ ఓ చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టింది.
కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ (CAPAC) ఛైర్ అయిన కాంగ్రెస్ సభ్యురాలు గ్రేస్ మెంగ్ నేతృత్వంలోని 20 మంది చట్టసభ్యుల బృందం, నవంబర్ 9న ప్రతినిధుల సభలో ‘దీపావళి దినోత్సవ చట్టం’ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ కాంగ్రెస్ చట్టసభ్యులలో భారతీయ-అమెరికన్ ప్రతినిధులు రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రమణ్యం, శ్రీ థానేదార్, రో ఖన్నా మరియు అమీ బేరా ఉన్నారు.
దీపావళిని అధికారిక యూఎస్ ఫెడరల్ సెలవుదినంగా గుర్తించాలని ఈ ప్రతిపాదిత చట్టం కోరుతోంది. కాంగ్రెస్ దీనిని ఆమోదిస్తే, ఇది యునైటెడ్ స్టేట్స్లో ఫెడరల్ ప్రభుత్వం గుర్తించిన 12వ జాతీయ సెలవుదినంగా మారుతుంది.
దీపావళి చట్టం, ఈ హిందూ పండుగ ప్రాముఖ్యతను అమెరికన్లు అర్థం చేసుకోవడానికి, అలాగే దీనిని జరుపుకునే వర్గాల సాంస్కృతిక సంప్రదాయాలను గుర్తించడానికి సహాయపడుతుందని గ్రేస్ మెంగ్ అన్నారు. దీపావళి దినోత్సవ చట్టం ఈ రోజు ప్రాముఖ్యత గురించి అమెరికన్లకు అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది. అలాగే, ప్రజల గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించే మరింత సమ్మిళిత దేశాన్ని నిర్మించడానికి నేను కృషి చేస్తూనే ఉంటాను,” అని ప్రకటించారు. దీపావళి పండగ సమయంలో కుటుంబీకులు, ఆత్మీయులతో గడపడం ద్వారా కుటుంబాలను ఏకం చేస్తాయన్నారు.
తాజా బిల్లు హిందువులు, సిక్కులు, జైనులు మరియు బౌద్ధులతో సహా అనేక మత వర్గాలకు దీపావళి పండుగను అత్యంత ముఖ్యమైన వార్షిక వేడుకలలో ఒకటిగా గుర్తిస్తుంది. ఇది దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరియు ఇండో-కరేబియన్ వర్గాలలోని లక్షలాది మంది ప్రజలకు ఈ భారతీయ పండుగ యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది.
అమెరికాలో హిందూ మరియు దక్షిణాసియా వర్గాలపై జరుగుతున్న విద్వేషపూరిత, లక్షిత హింసా ఘటనలపై CAPAC లేవనెత్తిన ఆందోళనల నేపథ్యంలో కూడా ఈ చట్టం వచ్చింది.
హిందూ పండుగ దీపావళిని, చెడుపై మంచికి, అజ్ఞానంపై జ్ఞానానికి ప్రతీకగా మెంగ్ అభివర్ణించారు. ఈ హిందూ పండుగకు ఫెడరల్ సెలవు దినం హోదా ఇవ్వడం ద్వారా, దానిని పాటించే మత వర్గాల కృషికి, స్థానానికి గుర్తింపు లభించినట్లేనని అన్నారు.”హిందూ వ్యతిరేక మరియు దక్షిణ ఆసియా వ్యతిరేక ద్వేషం పెరుగుతున్న తరుణంలో, దీపావళిని ఫెడరల్ సెలవుదినంగా గుర్తించడం ద్వారా హిందువులతో పాటు సిక్కులు, జైనులు మరియు బౌద్ధులు కూడా మన సమాజంలో విలువైన సభ్యులేననే బలమైన సందేశం వెళ్తుంది” అని ఆమె అన్నారు.







