ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి 30కి పైగా కీలక అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా ఐటీ (IT), పరిశ్రమలు (Industries), రెవెన్యూ (Revenue), హోంశాఖలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.2026-31 కాలానికి గానూ ఏపీ ఏవీజీసీ-ఎక్స్ఆర్ నూతన పాలసీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ పోలీసు శాఖలో భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కొత్త విభాగం పనిచేస్తుంది.
అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల్లో ఫుట్వేర్ కాంపోనెంట్ పార్కు, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో 30 ఎకరాల్లో ఎఫ్ఎల్వో మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. వీటితో పాటు రాంబిల్లిలో ఈప్యాక్ డేటా సెంటర్ యూనిట్ ఏర్పాటు, నాయుడుపేటలో లిథియం బ్యాటరీ మెటీరియల్ తయారీ పరిశ్రమ, రూ.4 వేల కోట్ల పెట్టుబడితో కార్బన్ కార్బో సంస్థ పరిశ్రమల స్థాపనపై క్యాబినెట్లో విస్తృతంగా చర్చించారు. వివిధ జిల్లాల్లో బయోగ్యాస్ ప్లాంట్లు, పలు కొత్త ఇంధన ప్రాజెక్టులకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అమనాంలో భారీ స్థాయిలో 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది. 2036 వరకు అమల్లో ఉండేలా రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీతో పాటు సెమీకండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో సవరణలకు ఆమోదం తెలిపారు.
అధికారిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో రాజకీయ అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఘనవిజయాన్ని ఎవరూ తలకెక్కించుకోవద్దని హితవు పలికారు. ప్రతీ ఒక్కరూ మరింత బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రజాసేవలో మునిగిపోవాలని మంత్రులకు చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.







