కోట్లు ముంచిన వివాహేతర సంబంధం.. ఒక్క రోజులో రూ.64,600 కోట్ల మాయం!
డబ్బున్నవాళ్ల జీవితంలో ప్రతి దానికీ ఒక లెక్క ఉంటుంది. వాళ్లు తీసుకునే నిర్ణయాలు, కలిసే మనుషులు, పెంచుకునే పరిచయాలు.. చివరకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఏదో ఒక రకంగా వ్యాపారంపై ప్రభావం చూపిస్తుంటాయి. సాధారణ వ్యక్తి జీవితంలో ఒక వివాహేతర సంబంధం కుటుంబానికి పరిమితమైన సమస్య కావచ్చు. కానీ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపించే బిలియనీర్ జీవితంలో అదే వ్యవహారం కంపెనీ ప్రతిష్టను, పెట్టుబడిదారుల నమ్మకాన్ని, స్టాక్ మార్కెట్ విలువను కూడా ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే అక్కడ వ్యక్తి వేరు.. అతని వ్యాపార సామ్రాజ్యం వేరు కాదు. రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.
ఇప్పుడు NVIDIA సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న వివాదం కూడా ఇలాంటి చర్చకే తెరలేపింది. చైనా మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు, దాని వెనుక గూఢచర్యం కోణం ఉందన్న అనుమానాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయంలోనే NVIDIA షేర్లు 4 శాతం పడిపోయాయి. ఫలితంగా ఒక్క రోజులోనే హువాంగ్ సంపద 6.8 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.64,600 కోట్లు తగ్గినట్లు ఫోర్బ్స్ అంచనా వేసింది.
అసలు ఈ వ్యవహారం ఏమిటి? హువాంగ్‌కు ఉన్న చైనా మహిళతో సంబంధం ఏంటి? ఇందులో గూఢచర్యం ఆరోపణలు ఎలా వచ్చాయి?
ఒక్క రోజులో రూ.64,600 కోట్ల సంపద ఎలా తగ్గింది?
అమెరికా NASDAQ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సోమవారం NVIDIA షేర్లు 4 శాతం పడిపోయి ఒక్కో షేరు 178.67 డాలర్ల వద్ద ముగిశాయి. గత నెల రోజుల్లో కంపెనీ షేర్లు 22 శాతానికి పైగా నష్టపోయాయి. ఈ పరిణామాలతో హువాంగ్ నికర సంపద 6.8 బిలియన్ డాలర్లు తగ్గి 155.4 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.14.76 లక్షల కోట్లు.
దీంతో ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్న హువాంగ్ పదో స్థానానికి పడిపోయారు. బెర్క్‌షైర్ హాత్వే అధినేత వారెన్ బఫెట్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కంటే దిగువకు వెళ్లారు.
NVIDIA మార్కెట్ విలువ మాత్రం దాదాపు 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.408 లక్షల కోట్లు. హువాంగ్ సంపదలో ఎక్కువ భాగం కంపెనీలో ఆయనకున్న షేర్ల రూపంలోనే ఉండటంతో స్టాక్ మార్కెట్లో వచ్చే మార్పులు ఆయన వ్యక్తిగత సంపదను నేరుగా ప్రభావితం చేస్తుంటాయి.
భార్యకు క్షమాపణలు చెప్పిన జెన్సన్ హువాంగ్?
ఈ వివాదంలో హువాంగ్ వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన ఆరోపణలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒక చైనా మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు హువాంగ్ అంగీకరించారని, ఆదివారం కంపెనీ బోర్డు ముందు ఈ విషయాన్ని వెల్లడించారని కథనం పేర్కొంది. తన భార్య లోరీ, పిల్లలకు క్షమాపణలు చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఉటంకిస్తూ వెల్లడించింది.
“నేను నా భార్యకు ద్రోహం చేశాను. నా చర్యల వల్ల ఆమెకు, నా పిల్లలకు బాధ కలిగింది. నేను చేసిన దానికి ఎలాంటి సాకు చెప్పలేను. పశ్చాత్తాపపడుతున్నాను” అని హువాంగ్ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారం కేవలం కుటుంబానికి సంబంధించిన వివాదంగా మిగిలిపోలేదు. ఇందులో చైనా గూఢచర్యం కోణం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో విషయం మరింత తీవ్రంగా మారింది.
చైనా గూఢచర్యం కోసం హువాంగ్‌కు దగ్గరైందా?
ఈ వివాదంలో ఆలిస్ హువాంగ్ అనే మహిళ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమెను హువాంగ్ లే అనే పేరుతో కూడా పిలుస్తారని కథనం పేర్కొంది. చైనా ప్రభుత్వానికి చెందిన స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ (MSS) కోసం ఆమె పనిచేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
అమెరికా నిఘా సంస్థలు ఆమెపై ఏడాదికి పైగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె చైనాకు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించాయని కథనం చెబుతోంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ధారించిన ఆధారాలు బయటకు వచ్చినట్లు స్పష్టత లేదు.
ఆన్లైన్ ప్రొఫైల్ ప్రకారం ఆలిస్ గతంలో చైనాలో టెలివిజన్ రిపోర్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే డేటా సెంటర్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. ఈ సంస్థ NVIDIA నుంచి భారీ మొత్తంలో చిప్స్ కొనుగోలు చేసే కస్టమర్లలో ఒకటి.
రూ.40 వేల కోట్లకు పైగా చిప్స్ కొనుగోలు చేసిన సంస్థతో సంబంధం!
మెగాస్పీడ్ సంస్థ 2024 జూన్ నుంచి NVIDIA నుంచి 4.8 బిలియన్ డాలర్లకు పైగా విలువైన చిప్స్ కొనుగోలు చేసినట్లు కథనం పేర్కొంది. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.40 వేల కోట్లకు పైమాటే.
ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. మెగాస్పీడ్ సంస్థ చైనాకు అమెరికా ఆంక్షలు విధించిన AI చిప్స్‌ను అక్రమంగా చేరవేస్తోందా? అనే కోణంలో అమెరికా వాణిజ్య శాఖ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
అమెరికా ప్రభుత్వం ఈ సంస్థపై విచారణ ప్రారంభించిన తర్వాత కూడా NVIDIA దానితో వ్యాపార సంబంధాలను కొనసాగించినట్లు కథనం పేర్కొంది. దీంతో ఈ వ్యవహారంలో వ్యక్తిగత సంబంధాలు, అంతర్జాతీయ వ్యాపారం, జాతీయ భద్రత వంటి అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడినట్లు కనిపిస్తున్నాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ ఒకే ఇంటిపేరు కలిగి ఉన్నప్పటికీ వీరిద్దరూ బంధువులు కాదు.
NVIDIA బోర్డు ఏం చేయబోతోంది?
ఈ ఆరోపణలు బయటకు రావడంతో NVIDIA బోర్డు కూడా వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు కథనం పేర్కొంది. కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారం కానీ, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం కానీ బయటకు వెళ్లినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని బోర్డు తెలిపినట్లు సమాచారం.
అయినప్పటికీ ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ నిపుణుడితో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు నివేదిక పేర్కొంది. విచారణకు హువాంగ్ సహకరిస్తారని, ఆయన సీఈఓగా కొనసాగుతారని వెల్లడించింది.
డిష్ వాషర్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు!
జెన్సన్ హువాంగ్ జీవితం కూడా ఒక ఆసక్తికరమైన ప్రయాణమే. 1963 ఫిబ్రవరి 17న తైవాన్‌లోని తైనాన్‌లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే అమెరికాకు వెళ్లారు. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు.
అమెరికాలో చదువుకునే రోజుల్లో ఒక రెస్టారెంట్లో డిష్ వాషర్గా పనిచేశారు. తర్వాత AMD, LSI Logic సంస్థల్లో ఉద్యోగం చేశారు. 1993లో క్రిస్ మలచోవ్‌స్కీ, కర్టిస్ ప్రీమ్లతో కలిసి NVIDIAని స్థాపించారు.
ప్రారంభంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ కంపెనీ, గ్రాఫిక్స్ చిప్స్ నుంచి AI కంప్యూటింగ్ వరకు తన వ్యాపారాన్ని విస్తరించింది. GPUలు, CUDA సాఫ్ట్వేర్, AI డేటా సెంటర్లకు అవసరమైన చిప్స్‌పై పెట్టిన పెట్టుబడులు NVIDIAను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలబెట్టాయి.
NVIDIA షేర్లతోనే హువాంగ్ సంపదలో ఎక్కువ భాగం!
2026 మార్చి 23 నాటి కంపెనీ ఫైలింగ్ ప్రకారం హువాంగ్ వద్ద 870.6 మిలియన్ NVIDIA షేర్లు ఉన్నాయి. ఇవి కంపెనీలో 3.58 శాతం వాటాకు సమానం. ఫౌండేషన్‌కు సంబంధించిన షేర్లను మినహాయిస్తే ఆయన వాటా సుమారు 811.9 మిలియన్ షేర్లుగా ఉంది.
అందుకే NVIDIA షేరు ధరలో వచ్చే మార్పులు ఆయన సంపదను భారీగా ప్రభావితం చేస్తాయి. కంపెనీ షేరు ధరలో ప్రతి 10 డాలర్ల మార్పు వచ్చినా ఆయన వాటాల విలువలో సుమారు 8.1 బిలియన్ డాలర్ల తేడా వస్తుందని Celebrity Net Worth అంచనా.
2026లో హువాంగ్‌కు మొత్తం 36.3 మిలియన్ డాలర్ల పరిహారం లభించినట్లు ఫార్చ్యూన్ నివేదిక పేర్కొంది. ఇందులో వార్షిక జీతం 2 మిలియన్ డాలర్లు ఉంది.
NVIDIA IPOలో పెట్టుబడి పెట్టినవాళ్లు కోటీశ్వరులయ్యారా?
NVIDIA ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అంశం దాని IPO. 1999 జనవరి 22న కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో ఒక్కో షేరు ప్రారంభ ధర 12 డాలర్లు.
ఆ సమయంలో 1,000 డాలర్లు పెట్టుబడి పెట్టినవారి షేర్ల విలువ, స్టాక్ స్ప్లిట్లు, తర్వాతి మార్కెట్ ధరలను బట్టి సుమారు 4.9 మిలియన్ డాలర్ల నుంచి 9 మిలియన్ డాలర్లకు పైగా పెరిగి ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.
ఒకప్పుడు చిన్న చిప్ కంపెనీగా ప్రారంభమైన NVIDIA, AI విప్లవంతో ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక శక్తిగా మారింది. 2023లో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన సంస్థ, 2025 అక్టోబర్‌లో 5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని కూడా తాకింది.
చివరకు వ్యక్తిగత జీవితమూ బిజినెస్ లెక్కల్లో భాగమే!
బిలియనీర్ల ప్రపంచంలో సంపద అనేది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ లేదా ఆస్తుల విలువ మాత్రమే కాదు. వారి పేరు, ప్రతిష్ట, కంపెనీపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకం కూడా ఆ సంపదలో భాగమే. అందుకే వారి వ్యక్తిగత జీవితంలో తలెత్తే వివాదాలు కూడా వ్యాపార ప్రపంచంలో చర్చకు వస్తుంటాయి.
సంపాదించడం ఒక ఎత్తయితే.. సంపాదించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. బిలియనీర్ల జీవితంలో ఈ రెండింటి మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







