టీడీపీకి దీటుగా ఓట్లు సాధించిన వైసీపీ.. విజయాలను సీట్లుగా మలచుకోవడంలోనే అసలు వైఫల్యమా..
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, కొన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) గట్టి పోటీ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా విజయనగరం (Vizianagaram) జిల్లాలో వెలువడిన ఓట్ల గణాంకాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల సాధనలో కూటమి భారీ ఆధిక్యం చూపించినా, ఓట్ల విషయంలో మాత్రం టీడీపీ (TDP), వైసీపీ మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం చర్చనీయాంశమైంది.
విజయనగరం జిల్లాలో మొత్తం 9,79,848 ఓట్లు పోలవగా, తెలుగుదేశం పార్టీకి 4,19,480 ఓట్లు లభించాయి. వైసీపీ 4,13,528 ఓట్లతో దాదాపు సమాన స్థాయిలో నిలిచింది. ఇరు పార్టీల మధ్య తేడా కేవలం 6,048 ఓట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అయితే కూటమి భాగస్వాములైన జనసేన (Jana Sena), భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన ఓట్లను కూడా కలిపి చూస్తే పరిస్థితి పూర్తిగా మారుతుంది. జనసేనకు 72,381, బీజేపీకి 16,396 ఓట్లు వచ్చాయి. దీంతో కూటమి మొత్తం ఓట్ల సంఖ్య 5,14,305కు చేరింది. ఈ లెక్కన వైసీపీతో పోలిస్తే కూటమికి 1,00,777 ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది.
ఓట్ల పరంగా రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ, సీట్ల విషయంలో మాత్రం ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో టీడీపీ 20 స్థానాలను గెలుచుకోగా, జనసేన రెండు చోట్ల విజయం సాధించింది. వైసీపీ మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైంది. అంటే ఓటర్ల మద్దతు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ, దానిని విజయాలుగా మార్చుకోవడంలో వైసీపీ వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓట్ల పంపిణీ, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని 27 మండలాల ఫలితాలను పరిశీలిస్తే కూటమి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వైసీపీ పూర్తిగా బలహీనపడలేదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ తన ఓటు మద్దతును నిలబెట్టుకునేందుకు ప్రయత్నించినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏకగ్రీవాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం (Gajapathinagaram), టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు (Kimidi Kala Venkata Rao) ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి (Cheepurupalli) నియోజకవర్గాల్లో వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించడం మరో కీలక అంశంగా మారింది. ఆయా ప్రాంతాల్లో బొత్స కుటుంబానికి చెందిన నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించడం పార్టీకి కలిసివచ్చిందని చర్చ జరుగుతోంది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ (Botscha Satyanarayana), గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే అప్పలనరసయ్య (Appala Narasayya) చురుకైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ రెండేసి స్థానాలను దక్కించుకుంది.
మొత్తంగా విజయనగరం ఫలితాలు కూటమి రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టం చేస్తూనే, వైసీపీకి ఇంకా గణనీయమైన ఓటు మద్దతు ఉందనే విషయాన్ని కూడా బయటపెట్టాయి. అయితే ఆ మద్దతును సీట్లుగా మార్చుకోవడం, క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం వైసీపీ ముందున్న ప్రధాన సవాళ్లుగా కనిపిస్తున్నాయి.







