ఓ మహిళతో ఎఫైర్.. ప్రపంచ AI సామ్రాజ్యానికే ముప్పు తెచ్చిందా?
ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూ తిరుగుతోంది. ఈ కొత్త టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి చేతుల్లో ఉంటే భవిష్యత్తు వారిదే అన్నంతగా పోటీ పెరిగిపోయింది. ఈ రేసులో Nvidiaది తిరుగులేని ఆధిపత్యం. కానీ ఇప్పుడు ఆ సంస్థను వెంటాడుతున్న ప్రశ్న AI చిప్స్ గురించి కాదు.. ఒక మహిళ గురించి!
ప్రపంచ టెక్ రంగంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరైన Nvidia CEO జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న ఓ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఓ వివాహేతర సంబంధం.. చైనా గూఢచర్య అనుమానాలు.. కంపెనీ రహస్యాలపై ఆందోళనలు! అసలు ఓ వ్యక్తి వ్యక్తిగత బంధం ప్రపంచ AI సామ్రాజ్యానికి ముప్పుగా ఎలా మారింది?
భార్యకు క్షమాపణలు చెప్పిన Nvidia CEO
బ్లూమ్‌బెర్గ్, ఆక్సియోస్ కథనాల ప్రకారం.. జెన్సన్ హువాంగ్ తన వివాహేతర సంబంధాన్ని అంగీకరిస్తూ Nvidia ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు. తన భార్యకు నమ్మకద్రోహం చేశానని, తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని అందులో పేర్కొన్నట్లు సమాచారం.
“నేను నా భార్యకు నమ్మకద్రోహం చేశాను. నా చర్యలు నా భార్య, పిల్లలను బాధపెట్టాయి. నేను చేసిన పనికి ఎలాంటి సమర్థన లేదు” అని ఆయన పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. తన తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తానని కూడా హువాంగ్ స్పష్టం చేశారు.
Nvidia సంస్థకు నాయకత్వం వహించడం తన జీవితంలో లభించిన గొప్ప అవకాశమని చెబుతూ.. ఉద్యోగుల నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వ్యవహారం కేవలం కుటుంబ సంబంధాలకే పరిమితం కాలేదు. ఇందులో చైనా గూఢచర్య అనుమానాలు తెరపైకి రావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది.
ఆ మహిళ ఎవరు? చైనా గూఢచర్యంతో సంబంధం ఏమిటి?
ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆలిస్ హువాంగ్ (చైనీస్ పేరు హువాంగ్ లే). ఆమె గతంలో సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ ఆపరేటర్ మెగాస్పీడ్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినట్లు సమాచారం.
అయితే ఆమెకు చైనా ప్రభుత్వ నిఘా విభాగమైన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS)తో సంబంధాలున్నాయనే అనుమానాలు అమెరికా అధికారులకు ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి.
న్యూయార్క్ టైమ్స్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా నిఘా వర్గాలకు చెందిన ఓ మెమోలో ఆలిస్ హువాంగ్ను చైనా నిఘా సంస్థ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు నియమించుకుందని అనుమానించినట్లు పేర్కొన్నారు.
అంటే ఈ వ్యవహారం వెనుక కేవలం వ్యక్తిగత సంబంధమే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన Nvidiaపై నిఘా పెట్టే ప్రయత్నం ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
వ్యక్తిగత సంబంధం ద్వారా Nvidia రహస్యాలను సేకరించారా?
అమెరికా అధికారుల పరిశీలనలో ఉన్న మరో కీలక అంశం ఇదే. జెన్సన్ హువాంగ్‌తో ఏర్పడిన సంబంధాన్ని ఉపయోగించుకుని ఆలిస్ హువాంగ్ Nvidiaకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.
Nvidia సాధారణ టెక్నాలజీ కంపెనీ కాదు. ప్రపంచవ్యాప్తంగా AI అభివృద్ధికి అవసరమైన అధునాతన చిప్స్ తయారీలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థలు, డేటా సెంటర్లు, AI కంపెనీలు Nvidia చిప్స్‌పై ఆధారపడుతున్నాయి.
ఇలాంటి సంస్థకు సంబంధించిన వ్యాపార వ్యూహాలు, సాంకేతిక సమాచారం, భవిష్యత్ ప్రణాళికలు పోటీ దేశాల చేతుల్లోకి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. అందుకే జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారంపై కూడా ఇప్పుడు కార్పొరేట్ భద్రత కోణంలో చర్చ జరుగుతోంది.
అయితే ఇప్పటివరకు Nvidia రహస్యాలు బయటకు వెళ్లినట్లు లేదా అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ స్పష్టం చేసింది.
రంగంలోకి Nvidia బోర్డు.. స్వతంత్ర దర్యాప్తు
ఈ వివాదం నేపథ్యంలో Nvidia డైరెక్టర్ల బోర్డు తక్షణమే అంతర్గత దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది. హువాంగ్ను విదేశీ నిఘా సంస్థ లక్ష్యంగా చేసుకుందన్న వార్తలపై ఈ విచారణ జరగనుంది.
స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ ఈ దర్యాప్తును పర్యవేక్షించనుంది. ఇందుకోసం బయటి స్వతంత్ర న్యాయ నిపుణుల సహాయం కూడా తీసుకోనున్నారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని జెన్సన్ హువాంగ్ కూడా హామీ ఇచ్చినట్లు బోర్డు తెలిపింది.
అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక భద్రత తమకు అత్యంత ముఖ్యమైన అంశాలని Nvidia బోర్డు స్పష్టం చేసింది. అదే సమయంలో హువాంగ్ నాయకత్వంపై తమకు విశ్వాసం ఉందని, ఇప్పటివరకు కంపెనీ రహస్యాలు లేదా జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం రాజీపడినట్లు నమ్మడానికి ఆధారాలు లేవని వెల్లడించింది.
2024 ఫొటో.. ఇప్పుడు ఎందుకంత చర్చ?
ఈ వివాదానికి సంబంధించి 2024లో తైవాన్‌లోని ఓ బార్లో జెన్సన్ హువాంగ్, ఆలిస్ హువాంగ్ పక్కపక్కనే కూర్చున్న ఫొటో కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. నెట్ థండర్ అనే సంస్థ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆలిస్ హువాంగ్ను మెగాస్పీడ్ చైర్‌వుమన్‌గా పరిచయం చేసింది.
రెండేళ్ల క్రితం తీసిన ఈ ఫొటో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడానికి కారణం.. హువాంగ్ వ్యక్తిగత సంబంధంపై వచ్చిన వార్తలు, దానికి జతైన చైనా గూఢచర్య అనుమానాలే.
Nvidia AI సామ్రాజ్యానికి ఇది ఎలాంటి పరీక్ష?
ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య AI ఆధిపత్యం కోసం పోటీ తీవ్రంగా సాగుతోంది. అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ రంగంలో ఉన్న పోటీ నేపథ్యంలో Nvidia వంటి సంస్థలకు సంబంధించిన సమాచారం అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉంది.
అలాంటి సమయంలో సంస్థ CEO వ్యక్తిగత సంబంధం చుట్టూ విదేశీ గూఢచర్య అనుమానాలు రావడం కంపెనీకి కొత్త సవాలుగా మారింది. అయితే ఈ వ్యవహారంలో నిజంగా ఏదైనా సమాచారం సేకరించారా? కంపెనీ రహస్యాలకు ముప్పు ఏర్పడిందా? లేక వ్యక్తిగత సంబంధానికి గూఢచర్య అనుమానాలు జతకావడంతో వివాదం పెద్దదైందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఒకప్పుడు AI ప్రపంచాన్ని శాసించే చిప్స్ తయారీతో వార్తల్లో నిలిచిన Nvidia.. ఇప్పుడు తన CEO వ్యక్తిగత జీవితంతో అంతర్జాతీయ చర్చలోకి వచ్చింది. ఈ వ్యవహారం ఓ వ్యక్తిగత వివాదంగానే ముగుస్తుందా? లేక ప్రపంచ AI ఆధిపత్య పోరులో కొత్త భద్రతా సమస్యలకు తెరతీస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







