మస్క్‌కు కేంద్రం స్ట్రాంగ్ కౌంటర్! ఇలా దొరికిపోయాడేంటి?
భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు ఇంకా ఎందుకు మొదలుకాలేదు? ఐదేళ్లుగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీకి ఎదురుచూపులు ఎందుకు తప్పడం లేదు? దీని వెనుక ముఖేశ్ అంబానీ ఉన్నారా? కొద్ది రోజుల క్రితం వరకు ఇదే ప్రశ్నలతో మస్క్ సోషల్ మీడియాలో హడావుడి చేసిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది.అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై అసలు విషయాన్ని బయటపెట్టింది. మస్క్ చేస్తున్న ఆరోపణలకు కేంద్రం తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఆ సమాధానం ఏమిటి
అంబానీ కంటే ముందే జియో, వన్‌వెబ్.. చివర్లో స్టార్‌లింక్!
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రస్తుతం మూడు సంస్థలు పోటీలో ఉన్నాయి. ఒకటి ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్, రెండోది ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, మూడోది భారతీ ఎయిర్టెల్ మద్దతున్న వన్‌వెబ్. ఈ మూడు సంస్థలకు లైసెన్సులు ఉన్నప్పటికీ, సేవలు ప్రారంభించడానికి అవసరమైన భద్రతా నిబంధనల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
ఇక్కడే అసలు విషయం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భద్రతా అనుమతులకు సంబంధించిన పత్రాలను మొదట వన్‌వెబ్ సమర్పించగా, ఆ తర్వాత జియో తన డాక్యుమెంట్లను అందించింది. స్టార్‌లింక్ మాత్రం చివరిగా ఈ ప్రక్రియను పూర్తి చేసిందని అధికారులు వెల్లడించారు. అంటే జియో కావాలనే స్టార్‌లింక్‌ను అడ్డుకుంటోందన్న ఆరోపణలకు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం భిన్నంగా ఉంది. అనుమతుల విషయంలో మూడు కంపెనీలకు ఒకే విధమైన నిబంధనలు వర్తించాయని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని అధికారులు చెబుతున్నారు.
‘అంబానీనే భారత్‌కు అసలు బాసా?’.. మస్క్‌కు ఎందుకంత కోపం?
ఈ వివాదం అక్టోబర్ 7న మొదలైంది. భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారని మస్క్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది.
భారత్‌లో అనుమతుల ప్రక్రియ వివక్షాపూరితంగా ఉందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. అయినా మస్క్ వెనక్కి తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా 165కి పైగా దేశాల్లో స్టార్‌లింక్ సేవలు అందిస్తున్నామని, భారత ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని గుర్తుచేశారు. మరి అలాంటప్పుడు భారత్‌లో ఇంకా ఎందుకు అనుమతులు రావడం లేదని ప్రశ్నిస్తూ.. ‘భారత్‌కు అసలు బాస్ ముఖేశ్ అంబానీనా?’ అంటూ నేరుగా అంబానీ పేరును ప్రస్తావించారు. దీంతో టెలికాం రంగంలో ఉన్న పోటీ ఒక్కసారిగా సోషల్ మీడియా వివాదంగా మారిపోయింది.
మస్క్ వర్సెస్ అంబానీ.. మధ్యలోకి రాహుల్ గాంధీ!
మస్క్ వ్యాఖ్యలతో వివాదం మొదలైతే, ఆ తర్వాత అది రాజకీయ రంగు కూడా పులుముకుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కలగజేసుకున్నారు. మస్క్‌కు స్పందిస్తూ.. ‘ఇంకా మీరు ఆ మరో వ్యక్తిని కలవలేదు.. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు చూడండి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో స్టార్‌లింక్ అనుమతుల వ్యవహారం కాస్తా మస్క్, అంబానీ, కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగే చర్చగా మారింది.
జియోకు కూడా అనుమతులు రాలేదట.. మరి అడ్డుకుంటున్నదెవరు?
ఈ వివాదంలో రిలయన్స్ జియో కూడా తన వాదనను వినిపించింది. స్టార్‌లింక్‌తో సహా కొత్త సంస్థల పోటీని తాము స్వాగతిస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్టోబర్ మధ్యలో ప్రకటించింది. అంతేకాదు, జియో సొంత శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు కూడా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని స్పష్టం చేసింది.
అసలు పోటీ మొదలయ్యేది ఇప్పుడే!
ఇప్పటివరకు జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్న టెలికాం మార్కెట్లోకి అంతరిక్షం నుంచి నేరుగా ఇంటర్నెట్ అందించే మస్క్ కంపెనీ వస్తే పరిస్థితులు ఎలా మారతాయన్నది చూడాలి. అయితే ప్రస్తుతానికి స్టార్‌లింక్ ఆలస్యానికి అంబానీ కారణమన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. పైగా దరఖాస్తులు, భద్రతా పత్రాల సమర్పణలో స్టార్లింకే చివర్లో ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరి ఇప్పుడు మస్క్ తన ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







