అప్పుల కుప్ప.. మరింత దిగజారిన పాక్ ఆర్థికస్థితి..!
పాకిస్తాన్ .. మన పొరుగున ఉన్న ఈ దేశం.. ఇప్పుడు నిలవాలంటే అప్పులు కావాలి..బతకాలంటే అప్పులు కావాలి.. వడ్డీలు కట్టాలంటే అప్పు చేయాలి.. ఈ దేశం ఇప్పుడు ఎవరి దగ్గరకు వెళ్లినా.. అనుమానపు చూపులు తప్పడం లేదు. ఎక్కడ అప్పు అడుగుతుందో అని ఇది పాక్ ప్రస్తుతం పరిస్థితి. ఆవిషయాన్ని అక్కడి దేశాధినేతలు స్వయంగా అంగీకరించారు కూడా.
పాకిస్థాన్ విదేశీ అప్పులు గత పదేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. 2015లో 68.7 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ అప్పులు 2025 నాటికి 135.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘ఇంటర్నేషనల్ డెట్ రిపోర్ట్–2026’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024లో ఉన్న 129.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2025లో అప్పులు మరో 4 శాతం పెరిగాయి.
మొత్తం విదేశీ అప్పుల్లో ప్రభుత్వ, ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాలు 107.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రభుత్వ హామీ లేని ప్రైవేటు రంగ రుణాలు 17.58 బిలియన్ డాలర్లు కాగా, స్వల్పకాలిక అప్పులు 10.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రభుత్వ హామీతో తీసుకున్న రుణాల్లో బహుళపక్ష ఆర్థిక సంస్థల వాటా అత్యధికంగా 56.83 బిలియన్ డాలర్లుగా ఉంది. ద్వైపాక్షిక రుణదాతలకు 42.43 బిలియన్ డాలర్లు బకాయి పడింది.
దేశాల వారీగా చూస్తే చైనానే పాకిస్థాన్‌కు అతిపెద్ద రుణదాతగా కొనసాగుతోంది. ఆ దేశానికి పాకిస్థాన్ సుమారు 22.4 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ప్రపంచ బ్యాంకుకు 19.2 బిలియన్ డాలర్లు, ఆసియా అభివృద్ధి బ్యాంకుకు 16.83 బిలియన్ డాలర్ల బకాయిలున్నాయి.
రుణాలపై వడ్డీ భారం కూడా పాకిస్థాన్‌కు ఆందోళనకరంగా మారింది. 2025లో అధికారిక రుణదాతల నుంచి కొత్తగా తీసుకున్న రుణాలపై సగటు వడ్డీ 3.6 శాతంగా ఉంది. వీటి చెల్లింపు గడువు సగటున 16 ఏళ్లు కాగా, అసలు చెల్లింపులపై నాలుగేళ్ల వెసులుబాటు లభించింది. ప్రైవేటు రుణాలపై మాత్రం సగటు వడ్డీ 8.6 శాతంగా ఉంది. వీటి చెల్లింపు గడువు మూడేళ్లు మాత్రమే కాగా, ఏడాది పాటు మాత్రమే వెసులుబాటు ఉంది.
T2025లో పాకిస్థాన్ విదేశీ అప్పులు స్థూల జాతీయాదాయంలో 34 శాతానికి చేరాయి. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 33 శాతం రుణాల చెల్లింపులకే ఖర్చవుతోందని నివేదిక తెలిపింది. ఇదే ఏడాది చైనా సుమారు 2 బిలియన్ డాలర్ల రుణాల చెల్లింపు గడువును పొడిగించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కూడా విస్తృత నిధుల సదుపాయం (ఈఎఫ్ఎఫ్), స్థిరత్వం, సుస్థిరత సదుపాయం (ఆర్ఎస్ఎఫ్) కింద 2.3 బిలియన్ డాలర్లను విడుదల చేసింది.







