Instagram రీల్స్ ఎడిక్షన్‌పై సుప్రీంకోర్టు సీరియస్..నోటీసులు! అసలేం జరిగింది?
ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారంటే చాలు.. ఒక రీల్ చూస్తారు, తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత మరొకటి. ఐదు నిమిషాలు చూద్దామనుకుని ఫోన్ తీసుకుంటే అరగంట, గంట గడిచిపోయినా తెలియదు. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్ల విషయంలో ఈ అలవాటు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అసలు వాళ్లు అంతలా ఫోన్‌కు ఎందుకు అతుక్కుపోతున్నారు?
కేవలం కంటెంట్ బాగుండటమే కారణమా? లేక యూజర్లు ఫోన్ వదిలిపెట్టకుండా ఉండేలా యాప్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే అంశం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. పిల్లలను సోషల్ మీడియా వ్యసనంలోకి నెడుతున్నాయనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం, మెటా సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లపై కఠిన నియంత్రణలు తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్‌పై వివరణ కోరింది.
రీల్స్ చూస్తూనే ఉండాలనిపించేలా ప్లాన్ చేస్తున్నారా?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పూర్తికాగానే మరోటి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మనం స్క్రోల్ ఆపకపోతే వీడియోలు వస్తూనే ఉంటాయి. మధ్యలో నోటిఫికేషన్లు, కొత్త పోస్టులు, ఆసక్తికరమైన కంటెంట్.. ఇలా యూజర్ మళ్లీ మళ్లీ యాప్‌లోకి వచ్చేలా ఎన్నో ఫీచర్లు పనిచేస్తుంటాయి. వీటినే మెటా ఉద్దేశపూర్వకంగా రూపొందించిన ‘డార్క్ ప్యాటర్న్స్’గా పిటిషనర్ శ్రీరూపా చౌధురి అభివర్ణించారు.
కంటిన్యూగా స్క్రోల్ చేసే సదుపాయం, ఆటోప్లే రీల్స్, పదేపదే వచ్చే నోటిఫికేషన్లు, ఎప్పుడొస్తుందో తెలియని రివార్డుల తరహా అల్గారిథమ్స్.. ఇవన్నీ మెదడులో డోపమైన్ ప్రతిస్పందనలను ప్రేరేపించి యూజర్లు యాప్ నుంచి బయటకు రాకుండా చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. అంటే మనం ఫోన్ చూస్తున్నామని అనుకుంటున్నా.. మనల్ని ఫోన్ చూసేలా యాప్‌లే ప్రేరేపిస్తున్నాయన్నది ఈ పిటిషన్‌లోని ప్రధాన వాదన.
పిల్లల మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతోంది?
ఈ సమస్య పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లలు, టీనేజర్ల విషయంలో మరింత ఆందోళన కలిగిస్తోందని పిటిషన్ చెబుతోంది. గంటల తరబడి రీల్స్ చూడటం, సోషల్ మీడియా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం, నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో స్వీయహాని ఆలోచనలకు కూడా దారితీయవచ్చని ఆరోపించింది.
అంతేకాదు, 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు తెరవకుండా అడ్డుకోవాల్సిన వయసు ధ్రువీకరణ వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని పిటిషనర్ అంటున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు కూడా ఎలాంటి నియంత్రణ లేకుండా సోషల్ మీడియాలోకి వస్తున్నారని, ఆన్లైన్ గ్రూమింగ్, పిల్లలకు సంబంధించిన లైంగిక వేధింపుల కంటెంట్ వంటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
విదేశాల్లో పిల్లలకు రక్షణ.. భారత్‌లో మాత్రం ఎందుకు లేదు?
ఈ పిటిషన్లో మరో కీలకమైన అంశం కూడా ఉంది. పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థల ఒత్తిడితో పిల్లల భద్రత కోసం మెటా ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అదే స్థాయి రక్షణను భారత్‌లో మాత్రం అందించడం లేదని పిటిషనర్ ఆరోపించారు.
అంటే విదేశాల్లో ఒకరకమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, భారత్‌లో మాత్రం తక్కువ స్థాయి రక్షణతో సరిపెడుతున్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం అభ్యంతరకరమైన పోస్టులను తొలగిస్తే సరిపోదని, పిల్లలు సోషల్ మీడియాకు బానిసలయ్యేలా చేస్తున్న యాప్‌ల డిజైన్, అల్గారిథమ్స్పైనా నియంత్రణ ఉండాలని ఆమె కోరుతున్నారు.
మెటా, కేంద్రం ఏం సమాధానం చెబుతాయి?
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం, మెటాకు నోటీసులు జారీ చేసి తమ వాదనలు తెలియజేయాలని కోరింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







